Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జనంతో సభ కిటకిటలాడుతున్నది. ఎటు చూసినా జనమే. అన్నంత మాత్రాన వీళ్ళందరూ సభ ఏర్పాటు చేసిన పార్టీ మీద భక్తితోనో, నాయకుడి మీద భయంతోనో, ప్రజాస్వామ్యం మీద గౌరవంతోనో వచ్చిన వాళ్ళు కాదు. కొందరు అలాంటి వారు వస్తే వచ్చినా చాలామంది జనం సేకరించబడిన వారే. లారీల్లోకి ఎక్కించి తేడబ్డవారే. రోజు కూలీ కోసం వచ్చినవారే.
ఎప్పటిలాగే సభలో గొంతు చించుకోడానికి జనం విరగబడి వచ్చారని తెల్సుకున్నాకే మైకు విరగ్గొడదామని జనం చెవుల్ని పూలతో అలంకరిద్దామని ఆలస్యంగా వచ్చాడు నాయకుడు.
మైకు అందుకున్న నాయకుడు జనాన్ని దేవుళ్ళని సంబోధించాడు. అన్ని దిక్కులకూ తిరిగి చేతులు ఊపాడు. దండాలు పారేశాడు. ఆ తర్వాత మొదలెట్టాడు. తుంపరలా మొదలైన మాటల వర్షం జల్లుగా మారి కుండలతో కురవసాగింది. మాటల వర్షంలో జనం తడిసి ముద్దయిపోతున్న సమయంలో హఠాత్తుగా ఓ మనిషి ఎలాగ చేరుకున్నాడో కాని స్టేజి ఎక్కి నాయకుడి దగ్గరికి చేరుకున్నాడు. నాయకుడు ఖంగారు పడ్డాడు మొదట. పిదప వీడి అభిమానం కూలా కాళ్ళకి దండం పెట్టటానికి వచ్చాడేమో అనుకుంటుంటే కళ్ళు గిర్రున తిరిగేయి. గిర్రున తిరిగిన కళ్ళకి ఆకాశంలోకి చూడకుండానే చుక్కలు కనిపించాయి. చెళ్ళుమన్న చెంపని ఎడమ అరచెయ్యితో ఒత్తుకుంటుంటే పోలీసులు ఓ వ్యక్తిని లాక్కువెళ్తుండటం లీలామాత్రంగా కనిపించింది మైకాసురుడికి.
నిండు సభలో జనమంతా ఇంతలేసి కన్నులతో చూస్తూ ఉండగా ఒక ప్రముఖ నాయకుడి చెంప ఛెళ్ళుమనడం ఖాకీలకి ఏ మాత్రం నచ్చలేదు. తమ డ్యూటీకి అంత పెద్ద మచ్చ రావడం సహించలేకపోయేరు. ఆ చెంప ఛెళ్ళుమనిపించిన టెర్రరిస్టుని ఒళ్ళంతా కుళ్ళబొడిచారు. ఏ పార్టీవాళ్ళు పంపారని ప్రశ్నించి ఎముకలు తీరిగ్గా లెక్క పెట్టారు. పాపం ఆ అమాయకుడు నోరు తెరిచి నేనేం తప్పు చేశాను. ఒక చెంపను కొడితే మరో చెంప అందిస్తాడనుకున్నాను. తను చేస్తున్న తప్పు ఒప్పుకుంటాడని తన్ను తాను మార్చుకుంటాడు అని ఆశపడ్డాను అన్నాడు.
సభలు జరగడం కొత్తేమీ కాదు. వింత అంతకంటే కాదు కదా! మరొక సభని చూద్దాం. ఓట్లు వెయ్యడానికి బద్ధకిస్తారు కాని జనం సభలకి మాత్రం తొక్కుకుంటూ వచ్చేస్తారు. స్వామి కార్యం స్వకార్యం అనుకుంటూ వచ్చేస్తారు. లారీల్లో కుక్కితే బస్సుల్లో ఎక్కిస్తే రానేవస్తారు.
ఎప్పటి లాగే సభ కిటకిటమంటున్నది. ఎప్పటిలాగే మైకులో నోరు పారేసుకోడానికి జనం చెవుల్లో సీసం పొయ్యడానికి వచ్చేశాడు నాయకుడు.
మైకు అందుకున్న నాయకుడు జనానికి చేతులెత్తి దండం పెట్టాడు. బొంగరంలా గిర్రున తిరిగాడు. ఆ తర్వాత మొదలెట్టాడు. పూనకం వచ్చిన వాడిలా ఊగటం మొదలుపెట్టి ఊపు అందుకున్నాడు. కార్యకర్తలు ఉషారు కోసం కేకలు వేశారు. ఈలలు జోరు అందుకున్నవి. హఠాత్తుగా ఓ కాలి బాటా బూటు ఎలాగ చేరుకుందో కాని స్టేజి మీదకి దూసుకుపోయి నాయకుడి కుడి చెవిని రాసుకుంటూ దబ్బుమని కింద పడనే పడింది. ఏ నాయకుడయితేనేం సందర్భం వస్తే కళ్ళు గిర్రున తిరగాల్సిందే మరి. గిర్రున తిరిగిన కళ్ళకి ఆకాశం అవుపించకుండానే చుక్కలు కనపడాలి మరి. నాయకుడు షాక్ అయ్యాడు. కొయ్యబారిపోయి బొమ్మలా నిలబడ్డాడు. బూటుకీ చెప్పుకీ నాయకుళ్ళంటే భయం ఉండదు కదా! షాక్ మీద షాక్ మరో షాక్. గాలిలో పక్షిలా ఎగురుతూ వచ్చిన ఇంకో బూటు నాయకుడి ఎడమ చెవిని రాసుకుంటూ ఎటో వెళ్ళిపోయింది.
నిండు సభలో జనమంతా కళ్ళు తేలేసి చూస్తుండగా ఒక ప్రసిద్ధ నాయకుడి మీదకి ఒకటి కాదు రెండు బూట్లు విసిరేయబడ్డం ఖాకీలకి నచ్చలేదు, యే మాత్రం. డ్యూటీకి వచ్చిన మచ్చను తుడిచేసుకోడానికి బూట్లు విసిరిన వాడి ఒళ్ళు కుళ్ళబొడిచి ఎముకలు ఏరిపారేశేరు.
పాపం ఆ అమాయకుడు తను కొత్త బూట్లు వేసుకొచ్చానని ఒకటి బాగా కాలు కొరికేస్తున్నందున భరించలేక విప్పి ఎటో విసిరేశానని అన్నాడు. ఒకటి సరే. ఒరే మరోటి కూడా విసిరావు ఎందుకు అంటే ఒకటి పోనేపోయింది కదా మిగిలిన ఒక్కటీ ఏం చేసుకోనని మొదటి దాని దగ్గరికే దాన్నీ పంపానన్నాడు అమాయకంగా ముఖం పెట్టి.
ప్రజాస్వామ్యాన్ని హైజాక్ చేస్తూ పదవుల కోసం పదేపదే నాయకులయి తీర్చలేని వరాలు ఇస్తూ, ఊక దంపుడు ఉపన్యాసాలు చేస్తూ వుండే నాయకులంటే చిర్రెత్తిన ఒకరిద్దరే కాక అనేకులు ఇలాంటి సాహసానికి పూనుకుంటే??
- చింతపట్ల సుదర్శన్,
9299809212