Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిద్రపోతున్నపుడు తప్ప మిగిలిన సమయంలో నిరంతరం ఏదో ఒక విషయాన్ని ఆలోచిస్తూనే ఉంటాం. ఆలోచనలు నిరంతర ప్రవాహం లాంటివి. ఆలోచనలే ఆచరణకు దారి చూపుతాయి. ప్రణాళికా బద్ధంగా నిర్వహించే పనులే విజయానికి దిక్సూచి అవుతాయి. అందువల్ల మన ఆలోచనే మనకు ఆయుధం. రచయితలు మొదట తమ మనసుతో ఆలోచిస్తారు. ఆలోచించిందే కాగితంపై పెడతారు. తమ ఆలోచన వాస్తవమా? కాదా అని బేరీజు వేసుకుంటారు. అది ప్రయోజనకరంగా ఉంటుందా? లేదా అని తర్జన భర్జన చేస్తారు. ప్రతిరోజూ ఒక్కో మనిషికి సగటున 60 వేల ఆలోచనలు వస్తాయి. అందులో పాజిటివ్ ఆలోచనలను మాత్రమే నిక్షిప్తం చేసుకుని మిగిలిన వాటిని మనసు నుంచి తొలగించాలి. పాజిటివ్ ఆలోచనలతో ప్రణాళికా రచించుకుని ఆచరించాలి.
మన మనసుకు పరిమితి ఉంది. ఒకసారి ఒక విషయాన్ని మాత్రమే ఆలోచిస్తుంది. ఆ ఒక్క ఆలోచన గాలివాటంగా ఎందుకుండాలి? ఎప్పుడైనా సరే ఆలోచన ప్రయోజనకరంగా ఉండాలి. ఏ విషయాన్ని గురించి ఆలోచించాలన్నది మనమే నిర్ణయించుకోవచ్చు. అదేం ఆసాధ్యమైన విషయం కాదు, సాధనతో సమకూరుతుంది. నోబెల్ బహుమతి సాధించాలి. మంచి రచయితగా గుర్తింపు పొందాలి. పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికై కేంద్ర మంత్రి పదవి చేపట్టాలి. ఇలా ఒక పట్టాన నిద్ర పోనివ్వని పాజిటివ్ ఆలోచనలకు రూపం వస్తే అదే లక్ష్యం. ఈ దశలోనే 'ఎలా?' అన్న ప్రశ్న తలెత్తేది.
జీవితంలో ఉన్నత స్థితికి ఎదగాలనుకుంటాం. ఎలా ఎదగాలో తెలియదు. తరగతి గదిలో బతుకు పాఠాలు ఎవరూ, ఎప్పుడూ నేర్పలేదు. జీవిత గమనంలో ఎదురయ్యే ఆటంకాలను ఎలా ఎదుర్కోవాలో చెప్పలేదు. క్లిష్ట సమయంలో ఏ వైపుకు వెళ్లాలో తెలియజేసే దిక్సూచి కావాలి. ఏ దారి గమ్యానికి చేరుస్తుందో రోడ్‌మ్యాప్ కావాలి. ఎంత సమయంలో ఎంత దూరం ప్రయాణించగలమో చురుకైన కాలిక్యులేటర్ కావాలి. ప్రతి క్షణం, ప్రతి నిమిషం గంటకొట్టి వెన్ను తట్టడానికి పెద్ద గోడ గడియారం కావాలి. రోజులు గడిచిపోతున్నాయని చెవి మెలేసి గుర్తు చేసేందుకు క్యాలెండర్ కావాలి. మంచి ఆలోచన పరిపూర్ణమైన ప్రణాళికతో ఈ విషయాలన్నీ సమకూరుతాయి.
ప్రణాళిక రాసుకునేందుకు ఖరీదైన నోటు పుస్తకాలు, రంగు రంగుల స్కెచ్ పెన్నులు అవసరంలేదు. చిన్న వయసులో ఉన్నపుడు ఎలా ఆలోచించే వారమో ఒకసారి మననం చేసుకొండి. ఆకాశంలో విమానం వెళ్ళడం చూసి, విమానం నడపాలని మనసులో అనుకుని ఉంటాం. కానీ మన ఆశలపై నీళ్లు చల్లి నీ వల్ల ఆ పని కాదని నిరుత్సాహపరుస్తారు. ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్ కావాలని కలలు కంటాం. ఏడ్చావులే నీలో అంత సత్తా లేదని తేల్చేస్తారు. అడుగడుగునా వెనక్కి లాగే వాళ్ళే కనిపిస్తారు. జీవితంలో ఎదిగే కొద్ది కలలు కురచైపోతాయి. ఆత్మవిశ్వాసం చిక్కి శల్యమైపోతుంది. డిగ్రీ పట్టా చేతికొస్తే అదే పదివేలని సర్దుకుపోతాం. గుమాస్తా ఉద్యోగమైనా ఈ జీవితానికి చాలకుకునే స్థితికి వస్తాం. మనకి మనమే పరిమితులు విధించుకుంటాం.
వ్యక్తిత్వ వికాస నిపుణుడు రాబిన్ శర్మ ఇలాంటి పరిమితులను 'కనిపించని కంచెలు' అని వర్ణించారు. మొదట మాయచేసే ఆ ముండ్ల కంచెలను తొలగించండి. ప్రతి మనిషి జీవితానికి విస్తృతమైన అవకాశాలున్నాయనే విషయాన్ని గుర్తించండి. ఇక మీ ఆలోచనలకు, ప్రణాళిక రచనకు ఎలాంటి అడ్డంకులు ఉండవు. చిన్న వయసులో ఎంత సృజనాత్మకంగా ఆలోచించారో, ఇపుడు కూడా అలానే ఆలోచించండి. అంతర్లీనంగా ఉన్న సృజనాత్మక శక్తినంతా వెలికి తీయండి. ప్రయోజనకరమైన కలలు కనండి. అపారమైన ఆత్మవిశ్వాసాన్ని పోగుచేసుకొండి. జీవితానికి గొప్పగొప్ప లక్ష్యాలు నిర్దేశించుకొండి. జీవితానికి కంచెల్లేవు, కందకాల్లేవు. పరిమితులనే సరిహద్దులను చెరిపేయండి. ఉన్నత స్థితికి ఎదగకుండా పట్టి ఉంచే శృంఖల్లాలను తెంచుకోండి. జీవిత ప్రణాళికకు ఒక రూపం ఇవ్వండి. అభిరుచి, ఇష్టం, వ్యక్తిత్వం, నైపుణ్యం, కలలు, కళలు, పరిమితులు... ఏ ఒక్క విషయాన్ని వదలకుండా పుస్తకంలో రాయండి. ఇవన్నీ తెలియని విషయాలు కాదు. అయితే అక్షరాల్లో రాసుకున్నపుడు వచ్చే స్పష్టత బాగుంటుంది. మన నిజరూపం ఏమిటో అర్థమైపోతుంది. వ్యక్తిత్వ వికాస నిపుణులు దీనినే 'కోర్ కాంపిటెన్సీ' అంటారు.
ఉదాహరణకు చార్లెస్ డార్విన్ కొంతకాలం పాటు మతబోధకుడిగా పని చేశారు. ఉపాధి కోసం చిన్నాచితకా ఉద్యోగాలు అనేకం చేశారు. జీవశాస్త్రవేత్త అనేది ఆయన నిజరూపం. జీవ పరిణామ సిద్దాంతాన్ని కనుగొని మానవాళికి ఆయన ఎంతో మేలు చేశారు. మీ నిజరూపం ఏమిటో ఈపాటికే మీకు అర్థమై ఉండాలి. మీ సత్తా ఏమిటో ఒక అంచనాకు రావాలి. బాల్యం నుంచే ఆరోగ్యకరమైన ఆలోచనలను పెంపొందుంచుకోవాలి. యుక్త వయస్సులో పెడదారులు పట్టకుండా జాగ్రత్తపడాలి. పాతికేండ్ల వయస్సులోనూ, 40 ఏండ్ల వయస్సులోనూ ఈ ప్రపంచం ఒకేలా కనిపించిందంటే 15 ఏండ్ల కాలాన్ని వృథా చేసినట్టేనని మానసిక నిపుణులు చెబుతున్నారు. అయితే ఉత్తమ సాహిత్య పఠనం మనోవికాసానికి తోడ్పడుతుంది. ఉత్తమ ఆలోచనలు జీవిత గమనాన్ని నిర్ణయిస్తాయి.
- జి. గంగాధర్ సిర్ప,
9010330529