Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''మన ఎంప్లాయీస్లో రెస్పాన్సిబిలిటీ తగ్గిపోతోంది. బాధ్యతలేదు. చేసే పనిమీద శ్రద్ధలేదు. ప్రజలకి సమాధానం చెప్పుకోవలిసిన స్థానంలో ఉన్నామనే భయం కూడా లేదు. కాబట్టి వాళ్ళలో మోరల్ వాల్యూస్ పెంచడానికి ఇలాంటి వర్క్‌షాపులు చాలా అవసరం''
''కరెక్ట్ సార్. అందుకే మీ దగ్గరకి వచ్చింది''
''వెరీ నైస్. మొత్తం ఎన్ని క్లాసులుంటాయి?''
''పది క్లాసులు''
''అంటే ఏకంగా పదిరోజులు వాళ్ళని వదిలెయ్యాలా?''
''లేద్సార్. రోజుకి రెండు గంటలు చొప్పున పది రోజులు''
''ఈ క్లాసు వంకన అసలు పని ఎగ్గొట్టేస్తారు''
''లేద్సార్. నైతిక విలువల గురించిన చర్చ మొదలయ్యేదే పని దగ్గర. కాబట్టీ ఆయా విలువల గురించిన వర్క్‌షాప్ కూడా వాళ్ళ రోజువారీ పనితోనే ప్రారంభం అవుతుంది''
''వెరీగుడ్. చాలా మంచి ఐడియా. ముఖ్యంగా ఈ లంచాలు కమీషన్లు, క్విడ్ ప్రోకోలు... వీటిని కూకటివేళ్ళతో సహా పెకలించి పారెయ్యాలి. అందుగ్గాను ఎవరో ఒకరు ఇనీషియేటివ్ తీసుకోవాలి. ఎక్కడో ఒకచోట ఫస్ట్ స్టెప్ పడాలి''
''అది మీతోనే ప్రారంభం కావడం నాకు చాలా సంతోషంగా ఉంది''
''థాంక్స్ ఫర్ ది కాంప్లిమెంట్. బైది బై మీరు క్లాసుకి ఎంత ఛార్జ్ చేస్తారు?''
''ఐదువేలు సార్''
''అంటే మొత్తం యాభై వేలన్నమాట''
''ఔన్సార్''
''చాలా తక్కువ. అంత తక్కువ ఎమౌంట్తో మీరెలా గెటాన్ అవుతారు? లాస్ట్ టైం లాంగ్వేజ్ స్కిల్స్‌లో ట్రైనింగిప్పించాం. ఆయనకూడా మీలాగే చాలా మంచివాడు. అందుకే అడిగినదానికి రెట్టింపు ఇప్పించాను. ఆయన ఎంత సంతోషించాడో తెలుసా?''
''గ్రేట్ సార్''
''మీక్కూడా అలాగే ఇప్పిస్తాను. క్లాసుకి పదివేలు చొప్పున మొత్తం లక్ష''
''మీకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాన్సార్. ఇంత పెద్ద ఎమౌంట్ నేనస్సలు ఊహించలేదు. అందరూ బేరాలాడేవాళ్ళేగానీ మా కష్టం గురించి ఆలోచించే మీలాంటి ఆఫీసర్లు చాలా తక్కువ. మీరు తలుచుకోవాలేగానీ, ఆఫీసుల్లోంచీ అవినీతిని తరిమికొట్టడం ఎంతసేపు? అవినీతిని నిర్మూలించే మీ సంకల్పం చాలా గొప్పది సార్''
''కానీ ఆ సంకల్పాన్ని సాధించే పని చాలా కఠినమైంది''
''మీలాంటివాళ్ళు తలుచుకోవాలేగానీ కష్టం ఏముంటుంద్సార్?
''ఐతే ఒక్కటి. నాలుగో రోజే మీ చెక్కు మీకొచ్చేస్తుంది. ఈ విషయం ప్రత్యేకంగా ఎందుకు చెబుతున్నానో అర్థమైందిగా?''
''అర్థమైంది సార్''
''గుడ్. మారడానికి ఇష్టపడని మాలాంటి వాళ్ళని ఏమార్చడం ఎవరివల్లా కాదు. అయినా మంచి పనులు కేవలం మంచివాళ్ళు మాత్రమే చెయ్యాలనే రూలేం లేదు. ఎనీ హౌ... మారాలనుకునే యువతరానికి ఇలాంటి వర్క్‌షాప్‌లు మారే మార్గం చూపించగలవు. విష్ యూ ఆల్ ది బెస్ట్''
- జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి