Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'పెద్ద మేడమ్‌గారు రమ్మంటున్నారు' అన్నది లక్ష్మమ్మ. ఇదిగో వచ్చేస్తున్నానన్నది టీచర్ సత్యవతి. ఆమె వెళ్ళేప్పటికి హాస్టల్లో నైట్‌డ్యూటీ చెయ్యడానికి వచ్చిన టీచర్లంతా ఏదో సీరియస్‌గా చర్చించుకుంటున్నారు. తనూ జాయినైంది సత్యవతి.
'అసలు పాయింటేమిటంటే మన హాస్టల్ మేట్స్ రెండువందల మంది. ఈ ఆడపిల్లలు స్నానం చెయ్యడానికి ముఖ్యంగా తలలు తడుపుకోవడానికి కనీసం రెండు ట్యాంకుల నీళ్ళు అవసరం. మన బోరింగు ఎప్పుడో ఎండిపోయింది. ట్యాంకు సగం నీళ్ళతో వెలవెలబోతుంది. అందువల్ల ఈ సమస్య పరిష్కారానికి బాగా శోధించి మధించి నేనొక నిర్ణయానికి వచ్చాను' అన్నది వార్డెన్.
అందరూ స్టడీగా వున్నారు. ఆమె ఏం చెబుతుందోనని.
'ఒక ఒక్కటే మార్గం. నాయీబ్రాహ్మణ్ణి పిలిచి వీళ్ళందరికీ గుండ్లు గీకించడమే మన తక్షణ కర్తవ్యం' అంది వార్డెన్.
ఒక టీచరమ్మ 'ఇది అన్యాయం' అంది.
అయితే పరిష్కారం చెప్పు' అని వార్డెన్ అనగానే ఆమె నోరు మూత పడింది. మరొక టీచర్ వినపించీ వినిపించకుండా నసిగింది.
సత్యవతి మాత్రం 'మేడం ఇది చాలా సీరియస్ ఇష్యూ. మీ అభిప్రాయాన్ని మేం గౌరవిస్తాం కానీ ఈ గుండ్లు గీకే కార్యక్రమానికి మన పై అధికారి అనుమతి మాత్రం తప్పనిసరి. వీలయితే ఆ గుండ్లు గీకే కార్యక్రమానికి వారిని ముఖ్య అతిథిగా పిలవండి. ఏ గొడవా వుండదు' అంది.
సమావేశం ముగిసింది.
మర్నాడు ఊళ్ళో బాగా పేరున్న నాయీ రానే వచ్చాడు. రెండు వందల గుండ్లా, అవీ ఆడపిల్లలవా అనుకున్నాడు. గుండుకి ఇంత చొప్పున వసూలు చెయ్యవచ్చుననుకున్నాడు. ఆ మాటే వార్డెన్‌తో అన్నాడు. వార్డెన్ తల ఊపింది. 'మరి గుండ్లు గీకితే వచ్చే టన్నుల కొద్ది జుట్టు సంగతేమిటి' అనడిగాడు నాయీ.
'మీరే కదా తీసుకెళ్తారు' అంది వార్డెన్ తికమక పడుతూ. వెంట్రుకల తుక్కు అమ్ముకుంటే బోలెడు డబ్బు వస్తుందని నాయికి తెలియకపోలేదు. అదెలాగూ వస్తుంది. తుక్కుని ఎత్తడానికి కిలోకి ఇంత అని వసూలు చేద్దామనుకున్నాడు. హాస్టల్ నడపడానికి వార్డెన్ కుళ్ళిన కూరగాయలు, నాసిరకం సరుకులు తెచ్చి ప్రభుత్వం సొమ్ము మెక్కడం లేదూ అనుకున్నాడు.
'సరే. మళ్ళీ పిలిపిస్తాను' అంటూ అతన్ని పంపేసి పై అధికారికి సెల్లు కొట్టింది వార్డెన్. ఇటీవలి కాలంలో అనేక పనులు కాగితాల మీద కనిపించకుండా ఫోనుల్లో వినిపించి గాల్లో కల్సిపోతున్నాయి.
'మేడమ్... మేడమ్... ఆ రెండు వందల గుండ్లు గీకే కార్యక్రమం సంగతేమంటారు?' అన్నది వార్డెన్.
'ఓ అదా! జాగర్తగా విను. కొన్ని విషయాలు పారదర్శకంగా చెయ్యాలంటుంది ప్రభుత్వం. అందువల్ల రెండు వందల గుండ్లు గీకించడానికి టెండర్లు తెప్పించు. తక్కువ అమౌంట్ కోట్ చేసిన వారికే గుండ్లు గీకే కార్యక్రమం అప్పచెప్పు. పకడ్బందీ షరతులు విధించాలి సుమా. కనీసం పది గుండ్లు గీకడానికి ఒకరు చొప్పున ఇరవై మంది రావాలి. తలలు తడపడానికి నీళ్ళ ట్యాంకర్ వాళ్ళే తెచ్చుకోవాలి. ముఖ్యంగా గుండ్లు గీకాక ఒక్క వెంట్రుక కూడా వాళ్ళు తీసుకుపోవడానికి వీల్లేదు' అంది అధికారి.
'ఎందుకు మేడమ్? ఆ తుక్కు ఎత్తించడానికి కూడా మనకే ఖర్చవుతుందట కదా' అంది వార్డెన్.
'ఇన్నాళ్ళూ ఎన్ని రకాలుగా తినాలో అన్ని రకాలుగా తిన్నందువల్ల బుర్ర ఖాళీ అయిందా యేం? ఆ వెంట్రుకల్ని కిలోల లెక్కన అమ్ముకుందాం. బియ్యం బస్తాల్లో నింపి వుంచు. టోకున కొనే వాడ్ని నేను చూపిస్తాగా. మరొక మాట, గుండ్లు గీకేటప్పుడు రేజర్ గాట్లూ, రక్తపు చుక్కలూ వంటివి కనపడకుండా చెయ్యడానికి ఫస్ట్ ఎయిడ్ బాక్సులు తెచ్చుకోమను. టెండర్ దక్కించుకున్న వాళ్ళని. రెండు వందల గుండ్లూ గీకిన తర్వాత ఒక్కటంటే ఒక్క వెంట్రుక కూడా ఏ గుండు మీదా కనపడ్డానికి వీల్లేదు. స్పాంజితోనో గుడ్డతోనో నీట్‌గా తుడిచేయమను. లేకపోతే రెండు వందల గుండ్ల స్నానానికి నీళ్ళెక్కడ దొరుకుతాయి' అంది అధికారి.
'గుండ్లు గీకే కార్యక్రమాన్ని మీరే వచ్చి ఇనాగ్రేట్ చెయ్యాలి' అన్నది వార్డెన్ గుండుకి ఐదు రూపాయలు, వెంట్రుకల తుక్కు కిలోకి మరో మూడు రూపాయలు తన వంతుకి రాకపోవు అని లోలోపల సంతోషిస్తూ.
'ఓకె. ఓకె. మంచి రోజు చూసుకో. అరేంజ్మెంట్స్ చేసుకో. నీకెందుకు లోకల్ ఎంఎల్ఎ గారిని ముఖ్య అతిథిగా తీసుకువస్తాను. అకౌంట్ మాత్రం సరిగ్గా వుండాలి సుమా. మనకు పారదర్శకత అన్నింటికంటే ముఖ్యం' అని అదో మాదిరిగా నవ్వింది అధికారి.
సెల్లు ఆఫ్ చేస్తూ 'తిరుపతిలో అయితే రోజూ అనేకం గుండ్లు గీకుతారు. కానీ ఈ ఇలాఖాలో ఒకేసారి రెండు వందల గుండ్లు గీకడం ఒక అద్భుతమైన కార్యక్రమం అవుతుంది అనుకుంది వార్డెన్.
- చింతపట్ల సుదర్శన్,
9299809212