Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బెంగళూరుకు చెందిన విజరు నిశాంత్ చెట్ల డాక్టర్. మనుషులకు, పశువులకు డాక్టర్లుంటారు కానీ చెట్లకు డాక్టరేంటి అనుకుంటున్నారా? ఈ విషయం విన్నవారందరూ ఇదే సందేహం వెలిబుచ్చారు. విజరు మాత్రం నేను చెట్ల డాక్టర్ని అని గర్వంగా చెప్పుకుంటాడు. ఈ విజరు నిశాంత్ ఏ రకమైన డాక్టర్ పట్టా పుచ్చుకోలేదు. ఇతను ఇంజినీరింగ్ చదువుతూ మధ్యలోనే ఆపేశాడు. ఇండియాలోనే మొట్టమొదటి చెట్ల డాక్టర్. ప్రతి ఒక్కరికి సొంతగా మొబైల్‌ఫోన్, బైక్, కారు, ఇల్లు ఉన్నట్టే ఒక చెట్టు కూడా వుండాలంటాడు విజరు నిశాంత్. ఇతను చెట్లతో మాట్లాడతాడు కూడా. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో చెట్లను కాపాడడం ఎంతో అవసరం.
వ్యాపార ప్రకటనల కోసం పెద్ద పెద్ద హౌర్డింగ్‌లు భవనాల మీదే కాకుండా చెట్లకు కూడా ఏర్పాటు చేస్తున్నారు. అలాంటి సమయాల్లో అనివార్యంగా చెట్లకు పెద్ద పెద్ద మేకులు కొట్టడం, అవి కదలకుండా వుండడానికి రకరకాల రసాయనాలు పూయడం చేస్తారు. కొన్ని రసాయనాలు పడ్డప్పుడు చెట్లు లోపల్లోపల కుళ్ళిపోయినట్లయి పాడైపోతాయి. నిలువునా కూలిపోతాయి. విజరు అలాంటి చెట్లను గుర్తించి, ఆ చెట్లలోని రసాయనాల ద్వారా వచ్చిన విష పదార్థాలను తీసేస్తాడు. ఒక డాక్టర్ ఎలా అయితే పేషెంట్ గాయాలకు కట్టు కడతాడో విజరు నిశాంత్ కూడా చెట్ల గాయాలకు తనదైన శైలిలో వైద్యం చేసి చెట్ల గాయాలకు కట్టు కడతాడు. దెబ్బతిని కూలిపోతున్న ఎన్నో పెద్ద పెద్ద చెట్లను తీసి వేరే సురక్షిత ప్రదేశాల్లో తిరిగి రీ ప్లానిటేషన్ చేసి వాటికి ప్రాణదాత అయ్యాడు. చెట్లతో బాతాఖానీ కొట్టే విజరుని చూసి అతని తండ్రి తెగ ముచ్చట పడుతుంటాడు.