Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎన్నాళ్ళనించో వున్న కోరికను తీర్చుకోవడానికి సాహసం చేసింది ఆ బైండు పుస్తకం. లైబ్రరీలో తను వున్న అరలోనుంచి కిందకి దూకేసింది.
దూకేసిన ఆ గ్రంథం అటూ ఇటూ చూసింది. అంతా నిశ్శబ్దంగా వుంది. చుట్టుపక్కల ఎవరూ లేరు. ఇంతకంటే మంచి అవకాశం ఇక దొరకదు అనుకుంది. నేలమీద పడుకున్న అది లేచి నిలబడింది. గాలికి ఎగురుతున్న కాగితాల్ని అదుపులోకి పెట్టింది. అడుగులో అడుగు వేసింది. చిరకాల వాంఛ తీర్చుకోవాలని దాని ఆరాటం. అలా ఐదారేడెనిమిది అడుగులు వేసిందో లేదో...
'ఆగు!' అన్న మాట వినిపించి ఉలిక్కిపడింది. అడుగు ముందుకు పడలేదు. తనను ఆగమన్నది ఎవరా అని ఓ పక్కకు తిరిగి చూసింది. గోడ మీద ఓ ఫొటో, ఆ ఫొటోలో ఓ గంభీరమైన వ్యక్తి కనిపించాడు. అంతే. మనుషులెవరూ లేరే మరి 'ఆగు' అన్నది ఎవరు అనుకున్నది.
'ఆగు' అన్నది నేనే. ఇటు చూడు ఈ ఫొటోలో వున్నవాడ్ని. నన్ను చూడు' అన్నాడు ఫొటోలో గంభీరంగా కనపడ్తున్న వ్యక్తి.
'మీరు... మీరు.. మీరెవరు?' తడబడుతూ అడిగింది అనేక పేజీల పుస్తకం.
'నేనెవరు అనడుగుతున్నావు. నన్నే గుర్తుపట్టలేదా? నిన్ను తయారు చేసింది నేనే అని దేశంలోని ప్రజలందరికీ తెల్సునే' అన్నాడు ఫొటోలోని వ్యక్తి.
'నన్ను తయారు చేశారా! అంటే, ఆ... గుర్తొచ్చింది. మిమ్మల్నెలా మరిచిపోగలను. అసలు మీరు లేకపోతే నేనెక్కడీ మీరు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారు కదా. మీరు ప్రాణం పోసిన దాన్ని. మీకిదే నా గౌరవాభివందనం' అన్నది ఆ మహాగ్రంథం.
'ఇప్పటికి తెలిసిందా. అది సరే, ఉన్నట్టుండి ఉన్న చోటునుండి కిందకి దూకి ఎటో వెళ్తున్నావు?' అడిగాడు ఫొటోలోంచి వ్యక్తి.
'ఏం చెప్పమంటారు డాక్టర్.బి.ఆర్.గారూ, మీరు నన్ను సృష్టించారు. ప్రజాప్రతినిధులకు అప్పగించారు. నన్ను వాళ్లు ఎలా గౌరవిస్తున్నారో, ఎలా చూసుకుంటున్నారో తెల్సుకోవాలనే కోరిక చాలా ఏళ్ళనుంచీ వుంది. అందుకోసం పక్కనే వున్న అసెంబ్లీ హాలులోకి వెళ్ళి చూద్దామని బయలుదేరా' అన్నది ఆ పుస్తకం.
అలాగా. నిన్ను ప్రజల చేత, ప్రజల కొరకు ఎన్నుకోబడ్డ నాయకులు ఎలా చూసుకుంటున్నారో చూడాలా! సరే వెళ్ళు. నీ ముచ్చట ఎందుకు కాదనాలి. అయితే ఇలా పుస్తకంలా వెళితే లోపలికి రానివ్వరు. మనిషిగా మారు. ఇవాళ అసెంబ్లీకి చాలామంది గైర్హాజర్ అయ్యారు. వెళ్ళి హాయిగా వెనక సీట్లో కూచో! వాళ్ళు నిన్ను ఎలా పూజిస్తున్నారో చూసుకుని వచ్చేసెరు' అన్నాడు ఫొటోలోని డాక్టర్ గారు.
మనిషిగా మారిన రాజ్యాంగ గ్రంథం అసెంబ్లీ సమావేశ మందిరంలో ఓ సీట్లో కూచుంది. స్పీకర్ 'ముందు మీరు కూర్చోండి, ముందు మీరు కూర్చోండి' అనరుస్తున్నాడు. బిత్తరపోయింది గ్రంథం. ఈ మూల నుంచి ఎవరో అరుస్తుంటే ఆ మూలన ఎవరో బల్లలు అరచేతుల్తో చరుస్తున్నారు. ఇదేమిటి మంగళవారపు సంతలా వుందే అని ముక్కున వేలేసుకుంది మనిషి రూపంలో వున్న గ్రంథం. ఒక ప్రజాప్రతినిధి లేచి పూనకం వచ్చిన వాడిలా ఊగిపోతూ ఏవో కాయితాలు చించి గాలిలోకి ఎగరేసి విలన్లా నవ్వాడు. ఒక ప్రతినిధి మరో ప్రతినిధిని అమ్మనా బూతులు తిట్టసాగాడు. ఈ తిట్టుకోవడం దేనికి, కాయితాలు చించుకోవడం దేనికి అని విస్తుపోయింది మనిషి రూపంలో అక్కడ కూర్చున్న గ్రంథం.
ఉన్నట్టుండి ఒక గుంపు స్పీకర్ వున్న చోటికి పరుగుతీసింది. ఒకడు స్పీకర్ వెనుక నిలబడ్డాడు. మరొకడు ఇంకో పక్కనుంచి మైకు లాక్కున్నాడు. పాపం... ఎంత ఓపికో ఈ స్పీకరుడికి అని జాలిపడింది గ్రంథం. సభ కాసేపు వాయిదా వేశాడు స్పీకర్. ఆ సమయంలో ఓ పార్టీ వాళ్ళ మాటలు చెవిన పడ్డాయి. 'చావగొడ్దాం. సభను జరగనివ్వకుండా అడ్డుకుందాం. ఒకరి తర్వాత ఒకరం అరిచి గీపెడదాం. నింబంధనల్ని తుంగలో తొక్కేద్దాం' అనుకుంటున్నారు వాళ్ళు. ఒక పార్టీ వారు వాకౌట్ చేద్దాం అంటే ఒక పార్టీవారు సస్పెండ్ అయి ప్రజల సానుభూతి కొట్టేద్దాం అన్నారు.
మళ్ళీ సభ మొదలయింది. 'నువ్వు కుక్కవి, నువ్వు పందివి, నువ్వు గాడిదవి, నీకు సిగ్గుందా, నువ్వు మనిషివేనా, నువ్వేం వెలగబెట్టావు' వంటి మాటలు రిపీట్ అయ్యాయి. రాజ్యాంగ నిబంధనలు తప్పుగా వాఖ్యానించబడ్డాయి. అంతా తప్పుల తడక అన్నాడొకడు. సమస్యలేవీ తేలకుండా సభా సమయం వృథాగా ముగిసింది.
మనిషిగా మారిన గ్రంథాన్ని మూకుమ్మడిగా మీదపడి కొందరు నానా బీభత్సం చేశారు. తిరిగి వచ్చిన మనిషి రూపంలో వున్న గ్రంథాన్ని అడిగాడు బిఆర్, 'ఇదేమిటి నీ చొక్కా చీలికలు పేలికలు అయింది. ముక్కు పగిలిందా యేం. వీపు మీద ఎవరైనా పిడిగుద్దులు గుద్దారా ఎర్రబడింది' అని.
'ఏం చెప్పను? నేనంటే వారికి ఏ మాత్రం గౌరవం ఉన్నట్టు లేదు. ఎవరి స్వార్థం వారే! నన్ను ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు వాడుకుంటున్నారు' అంటూ మనిషి మళ్ళీ గ్రంథంగా మారి ఇదివరకు వున్న అరలోకి చేరుకుంది.
- చింతపట్ల సుదర్శన్,
9299809212