Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆకారంలో గుర్రాన్ని, మెడ చూస్తే జిరాఫీని, నాలుగు కాళ్లకీ.. జీబ్రా చారల్ని తెచ్చి అతికించుకున్నట్టుండే.. ఈ వింత జంతువు పేరు 'ఒకాపి'. జిరాఫీలకి కాసింత దగ్గర బంధువే. ఆఫ్రికా అడవుల్లో సంచరించే ఒకాపీలు కాంగోలో ఎక్కువగా కనిపిస్తాయి.. దీనిప్రత్యేకత 18 అంగుళాల పొడవుండే నాలుక. అంత పొడవు నాలుకతో ఎంచక్కా.. కళ్లూ, చెవులూ శుభ్రం చేసుకుంటుంది. అన్ని జంతువుల్లానే పండ్లు, ఆకులే తింటుంది. కానీ ఒకట్రెండు రకాలు సరిపోవు. సుమారు వంద రకాల ఆకులన్నా ఉండాల్సిందే. పైగా విషపూరితమైన ఆకుల్నీ విడిచిపెట్టవు. అవే ఆకుల్ని మనుషులు, మిగతా జంతువులుగానీ తిన్నాయంటే హరీమనాల్సిందే. కానీ దీనికి మాత్రం ఏం కాదట. 300 కిలోల వరకూ బరువుండే ఒకాపీలు ప్రస్తుతం అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నాయి. అంతా కలిపి లెక్కిస్తే ఓ 25 వేలకి మించి లేవట. వీటి చర్మం కోసం మనుషులు, మాంసం కోసం క్రూరజంతువులు వేటాడి కనుమరుగు చేసేస్తున్నారు మరి!