Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాలంతోపాటు మారాలని...
నవతెలంగాణ 'సోపతి' లో ప్రచురితమైన కవర్ స్టోరీ 'గమనశీలత చుక్కాని కావాలి' ఆసక్తికరంగా ఉంది. రోడ్లపై తినుబండారాలుఅమ్ముకునే చిరువ్యాపారులు ఏండ్ల తరబడి ఒకే దగ్గర స్థిరపడి జీవనం సాగిస్తుంటారనీ, దీనిలోని ఔచిత్యం ఏమిటని వ్యాసం రచయితను అతని మిత్రుడు ప్రశ్నించాడు. కాలం గతిశీలమైనది కాబట్టి కాలం తో పాటు మారాలని సూచించారు రచయిత. 'హాసవిలాసం' జోకులు నవ్వించాయి. 'పార్శిల్' గల్పిక బాగుంది.
- ముక్కెర రమేశ్ చంద్ర;గుర్రం పేట, జయశంకర్ భూపాలపల్లి
కార్టూన్ సమయోచితంగా ఉంది
''సారు.. సంవత్సరం పొడుగుతా ఏదో ఒక ఎలెక్ష నని ఉపాధి కలిపిస్తూనే ఉన్నాడుగా... ఇంకా పనికి ఉపాధి -హామీ ఏందయ్యా?'' (సహకార ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని) గీసిన కార్టూన్ అర్థ వంతంగా, సమయోచితంగా వుండుటయే కాక ఎన్నికల్లో కనిపించే ధన ప్రవాహం గురించి కూడా చెప్పకనే చెప్పింది.ఈ వారం 'అంతరంగం' ప్రేమ పార్శ్వాల గురించి వెలిబుచ్చిన అభిప్రాయాలు ఆలోచింప చేసినవి. ప్రేమకు మరణం లేదని గ్రహించాము. నియమ నిబంధనలు తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా శాసన నిర్మాతలు ప్రవర్తిస్తున్న తీరు గురించి 'చౌరస్తా' నేటి రాజకీయాలకు అద్దం పట్టింది. కవర్ స్టోరీ గమన శీలతను ఆయా వృత్తుల వారు చుక్కాని చేసుకొని వృత్తులను మార్చుకుని, పోటీ ప్రపంచంలో బతుకు బండిని లాగాలి. గౌరవం, హౌదా పొందాలి అని చెప్పడం సబబుగా వున్నది.
- పంజాల నరసయ్య, హైదరాబాదు
గమనశీలత్వం అవసరం
నాడార్ల గమనశీలత్వాన్ని ఉదహరిస్తూ రాసిన కవర్ స్టోరీ స్ఫూర్తివంతంగా ఉంది. మనుషుల మధ్య గమనశీలతే ఆయా సమాజాలు, దేశాలు, జాతుల అభివృద్ధికి హేతువని సరళమైన భాషలో చక్కగా చెప్పారు రచయిత. వేరే ప్రాంతానికి బతుకుదెరువు కోసం వెళ్లడం తప్పుకాదనీ, వెళ్లినవారు స్థానికులను దోపిడీచేయడమే తప్పని ఓ గొప్ప సత్యాన్ని చెప్పారు. మనుషులు ప్రాచీన కాలం నుంచీ వలసలు పోతూనే ఉన్నారు. అది వృత్తిపరంగానూ, ప్రాంత పరంగానూ ప్రపంచమంతా కొనసాగుతూనే ఉన్నది. భారతీయ మనువాద సంస్కృతిలో వృత్తుల మార్పిడి ఒకప్పుడు కష్టమే కాని ఇప్పుడు కాదనే సత్యాన్ని జనం తెలుసుకోవాలి. మన మనుగడకు గమనశీలత్వం చాలా అవసరం. మంచి వ్యాసం అందించినందుకు ధన్యవాదాలు.
- కె.శ్రీనివాసరావు, ఖమ్మం
తగిన శాస్తి
దంతాల రక్షణకు తీసుకోవలసిన జాగ్రత్తలను డాక్టరుగారు చక్కగా వివరించారు. మరిన్ని సంగతులు రాస్తే బాగుండేది. కరోనా వైరస్ ఉందని చెప్పడంతో లైంగిక దాడికి ప్రయత్నించినవాడు పారిపోయిన ఉదంతం చదివి 'తగిన శాస్తి' జరిగిందని నవ్వుకున్నాం. ఎడమచేతివాటం గురించి రాసిన విశేషాలు కూడా ఆసక్తికరంగా ఉన్నాయి.
- ఎన్.వాసవి, హైదరాబాదు