Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వాళ్ల బాధ్యతారాహిత్యంతోనే ఈ పరిణామాలు
- పాలకవర్గం తీర్మానాల్లో తప్పొప్పలను తెలపాల్సింది వారే
- ట్రస్టుకు నిధులు జమచేయడం చట్ట విరుద్ధం
- గత పాలకవర్గ డైరెక్టర్లు రాయల , తుళ్లూరి, జనగం
నవతెలంగాణ - ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
డీసీసీబీ నిధుల దుర్వినియోగం వ్యవహారంలో అధికారులే బాధ్యత వహించాలని గత పాలకవర్గ డైరెక్టర్, ప్రస్తుత డీసీఎంఎస్ చైర్మన్ రాయల వెంకటశేషగిరిరావు పేర్కొన్నారు. స్థానిక ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పాలకవర్గ సమావేశాల్లో పాలకవర్గంతో పాటు సహకార శాఖకు చెందిన అధికారులు, నాబార్డు, డీసీసీబీ, టస్కాబ్ అధికారులు కూడా పాల్గంటారన్నారు. సమావేశంలో జరిగే అంశాలపై చర్చ సమయంలో ఆయా అధికారులు తగిన సూచనలు చేయాల్సి ఉంటుందన్నారు. అధికారులు ఆ విధానాలను అవలంబించకుండా పాలకవర్గం చేసే తీర్మానాలకు గుడ్డిగా ఆమోదం తెలపడంతోనే పరిస్థితి ఇంత వరకూ వచ్చిందన్నారు. తీర్మానాలు చట్టపరిధిలో ఉన్నాయా? లేదా? అనే అంశాలను అధికారులు పరిశీలించకుండా వ్యవహారించడంతోనే ఈ పరిణామాలు నెలకొన్నాయని పేర్కొన్నారు. ట్రస్టు ఏర్పాటు విషయంలో సహకార రిజిస్ట్రార్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. కానీ ఆ విధానాన్ని అవలంబించలేదన్నారు. రైతుకు చెందాల్సిన డబ్బును సీఈవోలు ట్రస్టుకు జమచేయడం చట్ట విరుద్ధమన్నారు. విజ్ఞాన యాత్రలు, బహుమతుల విషయాల్లో బ్యాంకు అధికారులు తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో మరో డైరెక్టర్ జనగం కోటేశ్వరరావు మాట్లాడుతూ పాలకవర్గం ఎజెండా కాపీలను వారం ముందే అందించాల్సి ఉంటుందన్నారు. కానీ ఆ విధానం ఎప్పడూ అమలు చేయలేదన్నారు. అధికారుల తప్పిదాల వల్లనే ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయన్నారు. పాలకవర్గం చేసే తీర్మానాల్లో అనేక సందర్భాల్లో తప్పులు చూసినప్పటికీ సరిచేసుకోలేక పోయారని మరో ప్రస్తుత, మాజీ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా పలు తీర్మానాలు చేశారన్నారు. నిధుల మళ్లింపు వ్యవహారంలో చైర్మన్ బాధ్యత కూడా కొంత ఉందన్నారు. రైతుల డబ్బును తిరిగి వారు చెల్లించాల్సిందేనన్నారు. నిందితుల నుంచి రికవరీ చేయాలని సూచించారు. తమపై కేసులు పెట్టి వేధించడం సరైంది కాదన్నారు. ఈ సమావేశంలో కూరపాటి రంగరాజు, గూడపాటి శ్రీనివాస్, మండె వీరహనుమంతరావు, పోలిదాసు కృష్ణమూర్తి, వెంకటరమణ, బోజెడ్ల అప్పారావు, బద్ధులాల్, ఈసాల నాగేశ్వరరావు పాల్గొన్నారు.