Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతులకు అవగాహనా సదస్సులో వాలంటీర్లు
నవతెలంగాణ-ఆళ్ళపల్లి
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఎంపిక చేసిన సుదిమల్ల గ్రామంలోని రైతు వేదిక కేంద్రంగా ఏర్పాటు చేసిన అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్ ఉచిత సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఇల్లందు, ఆళ్ళపల్లి పారా లీగల్ వాలంటీర్లు సతీష్ ఖండేల్ వాల్, గుండెబోయిన రామకృష్ణ సూచించారు. ఈ మేరకు ఆదివారం మండల కేంద్రంలోని రైతు వేదికలో రైతులకు వారు నూతనంగా ఏర్పాటు చేసిన అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దుక్కి దున్ని సాగు చేసి ఫల సాయం పొందే వరకు ప్రతి దశలోనూ రైతులకు చట్ట పరంగా సాయం అందించడం అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్ల ముఖ్య ఉద్దేశమని చెప్పారు. రైతులకు భూమి, నీరు, క్రిమి సంహారక మందులు మార్కెటింగ్ చట్టాలపై అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. ఈ క్లినిక్ ద్వారా ఇల్లందు, ఆళ్ళపల్లి, టేకులపల్లి, గుండాల మండలాల అన్నదాతలు సమస్యలను నివారించుకోగలరని విజ్ఞప్తి చేశారు.