Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒక్క పూట మండుటెండలో,వడగాల్పుల్లో సమ్మె శిబిరంలోకి వచ్చి కూర్చుంటారా....?
- అశ్వాపురం, మణుగూరు, పినపాక
- సమ్మె శిబిరాల్లో సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎ.జె.రమేష్
నవతెలంగాణ-మణుగూరు
రాష్ట్ర ప్రభుత్వంలో క్యాబినెట్ హౌదాలో ముఖ్యమైన బాధ్యతల్లో ఉన్న విప్ రేగా కాంతారావు ఐకెపి వీవోఏల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఏజే రమేష్ అన్నారు. ఆదివారం పినపాక నియోజకవర్గంలోని అశ్వాపురం, మణుగూరు సమ్మె శిబిరాలను సందర్శించి మాట్లాడుతూ గత 28 రోజులుగా ఐకెపి వీవోఏలు చేస్తున్న నిరవధిక సమ్మె పై మణుగూరులో తన క్యాంపు కార్యాలయంకి వీవోఏలను పిలిపించుకుని అవాక్కులు, చేవాక్కులు పేలడం మానుకోకపోతే కార్మికులు తగిన బుద్ది చెప్తారని హెచ్చరించారు. కడుపు కాలిన కార్మికులు కనీస వేతన కోసం మండుటెండల్లో, వడ గాల్పుళ్లో సమ్మె శిబిరంలో కూర్చున్న కార్మికులతో ఒక్క పూటైనా కూర్చుంటారా అని రేగా కాంతారావుని సూటిగా ప్రశ్నించారు రాష్ట్ర వ్యాప్తంగా గత నెలలో చట్టబద్దంగా ముందస్తుగానే సమ్మె నోటీస్ ప్రభుత్వానికి ఇచ్చి, సమ్మెలోకి వెళ్లారని అన్నారు. సమ్మె ప్రారంభమై 27 రోజులు కావస్తున్నా, విప్ కాంతారావుకి పినపాక నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో సమ్మె డిమాండ్ల వివరాలు తెలియజేసినప్పటికీ పరిష్కారానికి ఏమాత్రం చొరవ చేయకపోగా, ''ముఖ్యమంత్రి ఎవరి మాట వినరు, మీరు సమ్మె చేసినా ఏం లాభం లేదు, సిఐటియు ఆద్వర్యంలో సమ్మె చేస్తే ఏం పట్టించుకోరని'' వీవోఏల ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడారని అన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తున్న 17,500 వేల మంది వీవోఏలలో అత్యధిక మంది మహిళలే అన్న విషయం మరచిపోవద్దని అన్నారు. ఈ వివోఏ ల వెనక ప్రతి మండలంలో వందల సంఖ్యలో స్వయం సహాయక బృందాలు ఉన్నాయని, వీరంతా ఆయా గ్రామాలలో ప్రజలను ప్రభావితం చేస్తారని, సమ్మె డిమాండ్ల పరిష్కారం చేయకపోతే కార్మికులు తగిన బుద్ది చెప్తారని అన్నారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఐక్యంగా కార్మికులు పోరాడిన ప్రతి సందర్భంలో విజయం సాధించారని, గత సమ్మెల అనుభవాలను వివరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు ఉప్పుతల నరసింహారావు, వివోఏ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి అరుణ, జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి శ్రీను గోపాల్ తదితరులు పాల్గొన్నారు.