Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం)జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు
నవతెలంగాణ- ఖమ్మం
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఆ రాష్ట్ర ప్రజలు నిర్ణయా త్మకంగా తిరస్కరించారని, బీజేపీ ప్రభుత్వం పాల్పడిన దారుణమైన అవినీతి, అసమర్ధపాలన తాలుకూ ఫలితం ఈ ఓటమి అని సీపీఐ(ఎం) ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఆదివారం ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం ముఖ్య కార్యకర్తల సమావేశం నాయకులు వై. విక్రమ్ అద్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రధాని మోడీ నేతృత్వంలో సాగిన తీవ్రమైన మత ప్రచారాన్ని ప్రజలు తిరస్కరించారని, ఈ తీర్పు రుజువు చేసిందని , ప్రభుత్వం పట్ల తీవ్రంగా ఉన్న వ్యతిరేకత కాంగ్రెస్‌కు బాగా కలిసి రాగా, అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించిందని పేర్కొన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా బలమైన తీర్పునిచ్చిన కర్ణాటక ప్రజలను ఆయన అభినందించారు. మోడీ ప్రభుత్వం ఇప్పటికయినా మతం, కులం పేరుతో ఓట్లు రాజకీయం చేయడం మానుకోవాలని హితవు పలికారు. రానున్న లోకసభ ఎన్నికల్లో బిజేపీ ప్రభుత్వం రాకుండా విపక్షాలు ఒకటై రాబోయే ఎన్నికల్లో మోడీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున దేశ ప్రజలను చైతన్యవంతం చేయవల్సిన అవసరం ఉందని తెలిపారు. ఒక ప్రధాని పదవిలో మోడీ ఉండి దేశ లౌకికవదానికి తూట్లు పొడుస్తున్నాడని విమర్శించారు. రాబోయే కాలంలో ఖమ్మం నియోజకవర్గంలో పలు ప్రజా సమస్యలపై పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు యర్రా శ్రీకాంత్, నాయకులు యర్రా శ్రీనివాసురావు, దొంగల తిరుపతిరావు, ఎస్.నవీన్‌రెడ్డి, జావేద్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.