Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బస్సు డ్రైవర్ మృతి... లారీ డ్రైవర్ పరిస్థితి విషమం
- ఆరుగురికి తీవ్రగాయాలు
నవతెలంగాణ- ఖమ్మంరూరల్
మండల పరిధిలోని కోదాడ క్రాస్ రోడ్డు సమీపంలో బుధవారం లారీ, ఆర్టిసీ బస్సు ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ మృతిచెందగా లారీ డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది. బస్సులో ప్రయాణిస్తున్న ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. వీరిలోనూ కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కోదాడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఖమ్మం బస్టాండ్ నుంచి కోదాడకు 12 మంది ప్రయాణికులతో బయలుదేరింది. మార్గమధ్యలో రూరల్ మండలం కోదాడ క్రాస్ రోడ్డు వద్దకు వెళ్లేసరికి హైదరాబాద్ నుండి ఖమ్మం వైపు వస్తున్న లారీ ఎదురుగా వచ్చి ఢీ కొట్టింది. దీంతో కోదాడ పట్టణానికి చెందిన బస్ డ్రైవర్ మలిశెట్టి శ్రీనివాసరావు(45)చికిత్స పొందుతూ మృతిచెందాడు. బస్సులో ప్రయాణించే వారిలో ఆరుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఇందులో కోదాడ మండలం ఆచార్లగూడెం గ్రామానికి చెందిన శీలం కోటేశ్వరరావు పరిస్థితి విషమంగా ఉంది. బస్ కండక్టర్ ధనలక్ష్మి, ఆచార్లగూడెం గ్రామానికి చెందిన కోటమ్మ, కోదాడకు చెందిన శ్రీనివాసరావు, రాకేష్ ఖమ్మంరూరల్ మండలం గుదిమళ్ళ గ్రామానికి చెందిన గురవయ్యలకు తీవ్ర గాయాలయ్యాయి. వరంగల్ జిల్లా తాడ్వాయికి చెందిన లారీ డ్రైవర్ దేశబోయిన మహేష్ తీవ్రగాయాలతో క్యాబిన్లో ఇరుక్కుపోయాడు. లారీ డ్రైవర్ మహేష్‌ను బయటకు తీసేందుకు ఎక్స్ కవేటర్, జెసిబి సహాయంతో బయటకు తీశారు. మహేష్ పరిస్థితి విషమించడంతో వెంటనే ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గాయాలపాలైన వారందరని రూరల్ పోలీసులు 108 వాహనం ద్వారా ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులు ప్రస్తుతం ఖమ్మం ప్రభుత్వ హాస్పిటల్ చికిత్స పొందుతున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ బాణాల రాము తెలిపారు.