Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వైరా
రైతులను కొనుగోలు కేంద్రాల నుండి మిల్లర్ల వరకు దోపిడీ చేస్తున్నారని, దీన్ని అరికట్టాలని మండల సర్పంచ్లు డిమాండ్ చేశారు. బుధవారం ఎంపీపీ వేల్పుల పావని అధ్యక్షతన జరిగిన సర్వ సభ్య సమావేశంలో వ్యవసాయ శాఖ అధికారి మాట్లాడుతూ మండలంలో 19,500 ఎకరాలలో వరిసాగు చేశారని, ఎకరానికి 26 నుంచి 27 క్వింటాళ్ల దిగుబడి రావచ్చన్న అంచనా ఉన్నదని తెలిపారు. మాతో పాటు ఇతర శాఖలను సమన్వయం చేసుకుని, లారీలు, గన్నీ బస్తాల కొరత లేకుండా చేస్తామని చెబుతుండగా, తాటిపూడి, కొస్టాల, విప్పలమడక, స్టేజి పినపాక అష్ణగుర్తి సర్పంచ్లు బట్టా భద్రయ్య, మంచాల జయరావు, తుమ్మల జాన్ పాపయ్య, రాజు, ఇటికాల మురళీ మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు కేంద్రాల నుండి మిల్లర్ వరకు రైతులను దోపిడీ చేస్తున్నారని అన్నారు. ప్రతి బస్తాకు 2, 3 రూపాయలు ఇస్తేనే లారీ పెడతామని గత ఖరీఫ్ సీజన్ లో ఇబ్బంది పెట్టినట్లు సమావేశం లో తెలిపారు. అంతే గాక మిల్లర్లు ప్రతి క్వింటాకు 4, 5 కేజీల తరుగుతో పట్టీలు కట్టి డబ్బు ఇస్తున్నారని, రైతులకు అడిగే ఆస్కారం లేకుండా చేస్తున్నారని అన్నారు. ప్రయివేట్ లారీలు ద్వారా ధాన్యం తరలింపుకు క్వింటాకు రూ.700 బదులు రూ.1000 ఖర్చు అవుతుందని ఈ దోపిడీ నుండి రైతులను ఆదుకోవాలని సర్పంచ్ లు అన్నారు. 12 గంటలు దాటినా కోరం పూర్తి కానందున సమావేశం ప్రారంభం కాలేదు. 12 గంటల తర్వాత సిరిపురం, గరికపాడు ఎంపీటీసీ మట్టురి కృష్ణారావు, మాగంటి సుందరమ్మ రావటంతో ఎంపిడిఓ నడింపల్లి వెంకట పతిరాజు సమావేశం ప్రారంభించారు. సమావేశంలో ప్రభుత్వ వైద్యాధికారి సుచరిత మాట్లాడుతూ ఏప్రిల్ 1 నుండి 45 సంవత్సరాలుపై బడిన వారికి వ్యాక్సిన్ వేయాలని నిర్ణయించిందని అందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. కాబట్టి మిషన్ భగీరథ నీళ్ళు సరఫరాలో అధికారుల అశ్రద్ద తగదని ప్రజా ప్రతినిధులు కోరారు. డిప్యూటీ తహసీల్దార్ రవీందర్ మాట్లాడుతూ.. మండలంలో 508 రేషన్ కార్డులు పెండింగులో ఉన్నాయని, ఫింగర్ ప్రింట్స్ పడక 22 మందికి రేషన్ బియ్యం ఇవ్వలేక పోతున్నట్లు తెలిపారు. ఈ విషయమై కోస్టాల సర్పంచ్ మంచాల జయారావు మాట్లాడుతూ.. నిరుపేదలై బియ్య కోసం వస్తే నెలల తరబడి ఫింగర్ ప్రింట్ పేరుతో బియ్యం ఇవ్వక పోవటం బావ్యమేనా అని ప్రశ్నించారు. తహసీల్దార్ కార్యాలయంలో భూములకు సంబంధించి పాస్ పుస్తకాలలో తప్పులు దొర్లితే వాటిని కూడా సరిచేయలేని దౌర్భాగ్యం ఉన్నదని దీంతో రైతులు పలు పథకాలకు దూరమవుతున్నారని తెలిపారు. ఈ సమావేశంలో జడ్పిటిసి నంబూరి కనకదుర్గ, జడ్పి కో ఆప్షన్ సభ్యులు షేక్ లాల్ అహమ్మద్, ఎంఈఓ కే వెంకటేశ్వర్లు, ఐబి ఏఈ రాణి, పశువైద్య అధికారి రాకేష్, ఐసీడీఎస్ అధికారిణి పాల్గొన్నారు.