Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మధిర
పురపాలక సంఘం ఆదాయ వనరులను పెంచే దిశగా చర్యలు చేపట్టి మున్సిపాలిటీలలో ప్రత్యేక మార్పు తేవాలని జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్జన్ అన్నారు. మధిర పురపాలక సంఘ కార్యాలయంలో ఛైర్పర్సన్ మొండితోక లత అధ్యక్షతన జరిగిన ప్రత్యేక బడ్జెట్ సమావేశంలో బుధవారం జిల్లా కలెక్టర్ పాల్గొని 2021-22 సంవత్సరపు వార్షిక బడ్జెట్ అంచనాలను ఆమోదించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మున్సిపాలిటీలలో ఆస్తిపన్ను వసూళ్ళ పై ప్రత్యేక దృష్టి సారించి పన్నులు పూర్తి స్థాయిలో వసూలు చేయాలని తద్వారా ఆదాయ వనరులు పెరుగుతాయని కలెక్టర్ తెలిపారు. ప్రతి మున్సిపాలిటీలో సమీకృత వెజ్-నాన్ వెజ్ మార్కెట్ ఏర్పాటు చేస్తున్నామని, దీనిలో భాగంగా మధిరలో ఇప్పటికే స్థలాన్ని గుర్తించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. ప్రతి మున్సిపాలిటీలో డంపింగ్ యార్డు, వైకుంఠధామంను క్రమం తప్పకుండా నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. పురపాలక సంఘంలో ఇంటిపన్నులతో పాటు కమర్షియల్ భవనాలకు కమర్షియల్ టాక్స్ విధించాలని, తద్వారా మున్సిపాలిటీల ఆదాయన్ని మరింత పెంచుకోవాలని కలెక్టర్ తెలిపారు. సమావేశంలో మధిర మున్సిపల్ కమిషనర్ అంబటి రమాదేవీ, అకౌంటెంట్ పి.స్వప్న, మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు.
సాగర్ జలాలను తప్పనిసరిగా అందిస్తాం :కలెక్టర్
నియోకవర్గ పరిధిలోని ఎన్ఎస్పి కెనాల్ వారాబందీ నీటి విడుదల సమస్యలపై బుధవారం మధిర మండల ప్రజాపరిషత్ సమావేశ మందిరంలో జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమలరాజుతో కలసి ఇరిగేషన్ అధికారులతో కలెక్టర్ ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా రబీ సీజన్లో ఎటువంటి సాగునీటి సమస్య తలెత్త లేదని, ఈ సంవత్సరం మధిర నియోజకవర్గంలోని చింతకాని, బోనకల్, మధిర, ఎర్రుపాలెం మండలాల్లో రబీ పంటకు ఏప్రియల్, మే నెలలో చివరి ఆయకట్టు రైతాంగానికి సాగునీటి సమస్య తలెత్తకుండా ఇరిగేషన్ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. మధిర నియోజకవర్గంలోని చివరి ఆయకట్టు రైతులందరికి మే మొదటి వారం వరకు తప్పకుండా సాగర్ జలాలను అందిస్తామని తదుపరే చెరువులు నింపే ప్రక్రియ చేపడ్తామని ఈ సందర్భంగా కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో మండల పరిషత్ అధ్యక్షులు లలిత, పర్యవేక్షక ఇంజనీరు ఆనంద్ కుమార్, కార్యనిర్వాహక ఇంజనీరు సిహెచ్. రామకృష్ణ, ఖమ్మం రెవెన్యూ డివిజనల్ అధికారి రవీంద్రనాథ్, డిఇలు జె.పెద్దరాంబాబు టి.సాంబశివరావు, నాగబ్రహ్మయ్య, ఎం.రాణి ఏఇలు పాల్గొన్నారు