Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మలుపులు తిరుగుతున్న డీసీసీబీ వివాదం
- అధికారులపై గత పాలకవర్గం డైరెక్టర్ల నెపం
- మాజీ చైర్మన్ మువ్వా పాత్రపై నిర్మగర్భంగా అంగీకారం
- కొనసాగుతున్న విచారణ...ఫైళ్లను పరిశీలిస్తున్న పోలీసులు
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ఖమ్మం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు వివాదం మలుపులు తిరుగుతోంది. ఆదివారం మహాజన సభతో మొదలైన పరంపర కొనసాగుతూనే...ఉంది. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ప్రస్తుత సీఈవో ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఖమ్మం త్రీటౌన్ పోలీసులు.. బుధవారం బ్యాంకులో విచారణ నిర్వహించారు. నిధుల దుర్వి నియోగానికి సంబంధించిన ఫైళ్లను పరిశీలించారు. ఈ విచారణలో భాగంగా ఇంకా కొందరిపై కేసు నమోదయ్యే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇప్పటికే డీసీసీబీ మాజీ చైర్మన్ మువ్వా విజరుబాబు, మాజీ వైస్ చైర్మన్ బాగం హేమంతరావుతో పాటు 20 మంది డైరెక్టర్లపై కేసు నమోదయిన విషయం తెలిసిందే.
తప్పంతా నాటి అధికారులదే...
ఈ నిధుల దుర్వినియోగానికి సంబంధించిన పూర్తి బాధ్యత నాటి అధికారులదేనని డీసీసీబీ గత పాలకవర్గ డైరెక్టర్, ప్రస్తుత డీసీఎంఎస్ చైర్మన్ రాయల శేషగిరిరావు ఆరోపించారు. నాటి డైరెక్టర్లలో కొందరు తుళ్లూరి బ్రహ్మయ్య, కూరపాటి రంగరాజు, గూడపాటి శ్రీనివాస్, మండె వీరహనుమంతరావు, పోలిదాసు కృష్ణమూర్తి, వెంకటరమణ, బోజెడ్ల అప్పారావు, బద్ధులాల్, ఈసాల నాగేశ్వరరావు తదితరులతో కలిసి బుధవారం స్థానిక ఆర్అండ్బీ అతిథిగృహంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. తమ తప్పేమీ లేదని...ఏది తప్పో..ఏది ఒప్పో చెప్పాల్సిన నాటి అధికారుల వైఫల్యం కారణంగానే రూ.7.32 కోట్ల నిధులు దుర్వినియోగం అయ్యాయని చెప్పుకొచ్చారు. అప్పటి చైర్మన్ అతి జోక్యం కూడా కొంత కారణమై ఉండొచ్చని నర్మగర్భంగా అంగీకరించారు. నాటి పాలకవర్గంలో ఉండటం మినహా ఈ పరిణామాలతో అంతగా సంబంధం లేని వివాదాల్లోకి తమను లాగడం, వేధించడం సరైంది కాదని వాపోతున్నారు. రైతుల సొమ్మును బాధ్యుల నుంచి రికవరీ చేయాల్సిందేనని కోరారు.
కొందరిపై అనర్హత వేటు పడే అవకాశం?
గతంలో ఈ సమయంలో పనిచేసిన సీఈవోలు రమణమూర్తి, నాగచెన్నారావులపైనా కేసు నమోదయ్యే దిశగా విచారణ కొనసాగుతోంది. ఈ వ్యవహారంలో ఇరుక్కున్న పాలకవర్గంలో కొందరు...ప్రస్తుతం సహకార సంఘం అధ్యక్షులుగా, పస్త్రుత పాలకవర్గంలోనూ డైరెక్టర్లుగా ఉన్నారు. ప్రస్తుత పాలకవర్గం చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులను నమోదు చేశారు. ఈ కేసుల ఆధారంగా సహకార చట్ట ప్రకారం ప్రజాప్రతినిధులుగా ఉన్నవారు అనర్హత వేటును ఎదుర్కొనే పరిస్థితిపై చర్చ సాగుతోంది. రాష్ట్ర సహకార శాఖ కమిషనర్ ఓ రాష్ట్రానికి ఎన్నికల అధికారిగా వెళ్లడంతో ఆ శాఖ నుంచి చర్యల్లో కొంత జాప్యం జరిగే అవకాశం ఉంది. కమిషనర్ తిరిగి విధుల్లో చేరిన తర్వాత ఈ వ్యవహారంపై సహకార శాఖ చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిధుల దుర్వినియోగం వ్యవహారం రచ్చకెక్కడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. దీని ప్రభావం అధికార టీఆర్ఎస్లో వర్గవిభేదాలకు మరింతగా ఆజ్యం పోసినట్లయింది. ఈ వ్యవహారంలో తమకు సంబంధం లేదని, తమను బాధ్యులను చేసి కేసులు నమోదు చేయడం సరైంది కాదని కొందరు డైరెక్టర్లు మీడియా ముందు వాపోయారు. పాలకవర్గ సమావేశంలో బ్యాంకు ముఖ్య కార్యనిర్వహణాధికారితో పాటు జిల్లా సహకార అధికారి, టస్కాబ్ డీజీఎం స్థాయి అధికారులు, నాబార్డు డీజీఎం అధికారులు పాల్గొంటారు. సహకార చట్టం తెలిసిన అధికారులు పాల్గనే సమావేశంలో పాలకవర్గాలు చేసే తీర్మానాలను పరిశీలించి సరైన మార్గదర్శకాలు సూచించాల్సి ఉంటుంది. ఆ దిశగా ఆయా అధికారులు వ్యవహరించకుండా ఉండటంతోనే ఈ పరిస్థితి వచ్చిందని డైరెక్టర్లు వాపోయారు. ట్రస్టు ఏర్పాటుపై అభ్యంతరాలు తెలిపినా ప్రయోజనం లేకుండా పోయిందని డైరెక్టర్లు చెబుతున్నారు. సహకార అధికారుల బాధ్యతారాహిత్యాన్ని పక్కనబెట్టి తమపై కేసులు నమోదు చేయడం సరైంది కాదని గోడు వెళ్లబోసుకున్నారు. రైతులకు చెందాల్సిన నగదు ట్రస్టుకు జమచేయడం నిధుల దుర్వినియోగమేనని ఈ వ్యవహారంపై సమగ్ర చర్యలు తీసుకుని బాధ్యులైన వారి నుంచి రికవరీ చేయాలని కోరారు. తమపై అనర్హత వేటు సరైంది కాదని పేర్కొంటున్నారు. ఇదిలావుండగా కొందరు డైరెక్టర్లు మంత్రి పువ్వాడని కలిసి మొత్తం వ్యవహారాన్ని వివరించేందుకు సమాయత్తం అవుతున్నట్లు తెలుస్తోంది.