Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఖమ్మం
ఆర్టీసీ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పిస్తున్నామని ప్రభుత్వం విడుదల చేసిన ఉద్యోగ భద్రతా మార్గదర్శకాలు ఉద్యోగ భద్రత కల్పించకపోగా ఆర్టీసీ కార్మికులను మరింత ప్రమాదంలోకి నెట్టే విధంగా ఉన్నాయని ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్(సిఐటియు) రాష్ట్ర కార్యదర్శి వీరాంజనేయులు పేర్కొన్నారు. బుధవారం ఖమ్మంలోని మంచికంటి హాల్లో పిట్టల సుధాకర్ అధ్యక్షతన 'ఆర్టీసీ కార్మికుల ఉద్యోగ భద్రత - తీసుకోవాల్సిన చర్యలు'' అంశంపై సదస్సు జరిగింది. ఈ సదస్సులో ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులకు సామాజిక, ఆర్ధిక, సాంస్కృతిక భరోసా భద్రత కలిగించే సంపూర్ణ ఉద్యోగ భద్రత కావాలని, ఆర్టీసీ కార్మికుల ఉద్యోగ భద్రతకు ఆటంకంగా ఉన్న 1963 కాండక్ట్ రెగ్యులేషన్స్ మార్చకుండా, ఆర్టిసి రక్షణ లేకుండా ఆర్టీసీ కార్మికులకు ఉద్యోగ భద్రత ఎలా ఉంటుందని ప్రశ్నించారు. ఒకపక్క ప్రభుత్వాల విధానాలతో ఆర్టీసీ సంస్థను నిర్వీర్యం చేస్తూ, మరోపక్క కార్మిక హక్కులను హరించి వేస్తూ ఉద్యోగ భద్రత ఎలా కల్పిస్తారో కార్మికులు ఆలోచించాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆర్టీసీ కార్మికుల సమ్మె అనంతరం నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆర్టీసీ కార్మికుల చిరకాల కోరికైన ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారని, అయితే అందుకు భిన్నంగా విడుదల చేసిన ఉద్యోగ భద్రతా మార్గదర్శకాలు ఉన్నాయని విశ్లేషించారు. ఆర్టీసీ ఉద్యోగులు కోరుకునేది చేయని తప్పుకు శిక్ష ఉండకూడదని, చేసిన తప్పుకు మించిన శిక్ష ఉండకూడదని, అలాగే ఒకే తప్పుకు పలు రకాల శిక్షలు ఉండకూడదని అన్నారు. ఆర్టీసీ యాజమాన్యం విడుదల చేసిన ఉద్యోగ భద్రతా మార్గదర్శకాలు ఉద్యోగ భద్రత అంశాల కంటే ఉద్యోగులపై శిక్షలు ఎలా వేయాలో మార్గదర్శనం చేసే విధంగా ఉన్నాయంటూ కార్మికులు భావిస్తున్నారని తెలిపారు. ఇప్పటికే డిపోస్పేరులు, సస్పెన్షన్లు, రిమూవల్స్, డెబిట్లు,ఇంక్రిమెంట్లు కోతలు తదితర పనిష్మెంట్లతో ఇబ్బంది పడుతున్న ఆర్టీసీ ఉద్యోగులకు భద్రత కల్పించే ఉద్యోగ భద్రత మార్గదర్శకాలు కావాలి తప్ప ఆర్టీసీ ఉద్యోగులను శిక్షించే మార్గదర్శకాలు కాదని పేర్కొన్నారు. అశాస్త్రీయమైన ఉద్యోగ భద్రతా మార్గదర్శకాలను వెంటనే నిలుపుదల చేయాలని జొన్నలగడ్డ జగన్నాథం సదస్సులో తీర్మానం ప్రతిపాదించగా గుగ్గిళ్ల రోశయ్య బలపరుస్తూ మాట్లాడారు. సదస్సులో ప్రారంభోపన్యాసంలో సీఐటియు జిల్లా అధ్యక్షులు టి.విష్ణువర్ధన్ మాట్లాడుతూ ఆర్టీసీ రక్షణతో కూడిన ఉద్యోగ భద్రత కావాలనేది ఆర్టీసీ కార్మికుల అందరిలో ఉన్న భావన అని, దానికి అనుగుణంగానే ఉద్యోగ భద్రతా మార్గదర్శకాలు ఉండాలని, అందుకోసం ఆర్టీసీ కార్మికులు అందరూ గరిష్ఠ ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ గడ్డం లింగమూర్తి మాట్లాడుతూ ఆర్టీసీలో ఉన్న అన్ని రిజిస్టర్డ్ యూనియన్ల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని సంపూర్ణ ఉద్యోగ భద్రత కల్పించే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి,యాజమాన్యానికి విజ్ఞప్తి చేశారు. ఈ సదస్సులో ఎస్‌డబ్య్లూఎఫ్ రాష్ట్ర కార్యదర్శి జె.పద్మావతి, ఖమ్మం రీజియన్ అధ్యక్షులు ఎర్రంశెట్టి వెంకటేశ్వర్లు, ఖమ్మం, సత్తుపల్లి డిపోల కార్యదర్శులు తోకల బాబు, చింతలచెరువు వెంకట కృష్ణారెడ్డి, ఖమ్మం, మధిర, సత్తుపల్లి డిపోల అధ్యక్షులు గుండు మాధవరావు, కుడుదుల వెంకన్న, జి.శంకర్, నాయకులు సోమ ప్రభాకర్‌రావు, షేక్ నజీరుద్దీన్, దొంగరి ఉపేందర్, పగిళ్లపల్లి నరసింహారావు, లక్ష్మీ, సునీత, సైదమ్మ, రమ తదితరులు పాల్గొన్నారు.