Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేడు రౌండ్ టేబుల్ సమావేశం
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు
నవతెలంగాణ- ఖమ్మం
గత సంవత్సరం కరోనా వైరస్ కారణంగా లాక్డౌన్ కాలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలను మూసివేసిందని, దీని ఫలితంగా వాటిల్లో పనిచేస్తున్న లెక్చరర్స్, సిబ్బందికి సరిపడా జీతాలు అందక అనేక అవస్థలు పడి జీవనం కొనసాగిస్తున్నారని, మళ్ళీ నేడు ప్రభుత్వం కరోనా పేరుతో విద్యా సంస్థలను మూసివేయడం ద్వారా వాటిల్లో పనిచేస్తున్న వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకోవడానికే విద్యా సంస్థలను బంద్ చేసిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మౌలిక వసతులను కల్పించడంలో వైఫల్యం చెందిందని, కరోనా నివారణకు బడ్జెట్లో కేటాయించకుండా తగు జాగ్రత్తలు తీసుకోకుండా తప్పించుకునేందుకే విద్యా సంస్థలు బంద్ చేశారని, దీనివల్ల పేద విద్యార్థులు చదువుకు దూరమవుతారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాల్లో విద్యాలయాలు సడిపితే మన రాష్ట్రంలో ఎందుకు నడపలేదని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాపితంగా అనేక విద్యా సంస్థలు విద్యార్థులకు ప్రత్యక్ష బోధన చేస్తున్నాయని, మరి వారికి కరోనా రాదా? అని ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు. విద్యా సంస్థలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం చెప్పినా, కార్పొరేట్ విద్యా సంస్థలు నడుపుతున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వం కార్పొరేట్ విద్యాసంస్థల యాజమానుల చేతుల్లో కీలుబొమ్మగా మారిందన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించుకొని తగు జాగ్రత్తలు తీసుకొని విద్యా సంస్థలను ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు. పాఠశాలలు, కళాశాలల్లో పనిచేస్తున్న అధ్యాపకులు, సిబ్బందికి కనీసం రూ.10 వేలు, 10 నెలలు కరోనా ప్యాకేజీ ఇవ్వాలని, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు వెంటనే ప్రారంభించాలని కోరారు. దీని పైన సీపీఐ(ఎం) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గురువారం ఎన్ఎస్పి క్యాంప్‌లో ఖమ్మం మంచికంటి భవన్లో సాయంత్రం 5 గంటలకు ''రౌండ్ టేబుల్'' సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో అన్ని రాజకీయ పార్టీలు, విద్యార్థి, యువజన సంఘాలు ప్రభుత్వ, ప్రైవేటు ఉపాధ్యాయ, కళాశాల సంఘాలు, ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలు పాల్గొనాలని కోరారు.