Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గుండాల
ఆదివాసీల ఆరాధ్య దైవం, ఈసం వంశీయుల ఇలవేల్పు దూలుగొండ తల్లి జాతర గురువారం మండలం లోని రోళ్ళ గడ్డ గ్రామంలో అంగరంగ వైభవం గా జరిగింది. జాతర బుధవారమే ప్రారంభమైనప్పటికీ రెండవ రోజు గురువారం దూలుగొండ తల్లి దేవతను గద్దెల మీదకు తీసుకువచ్చే కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆ తల్లి రాకను ప్రత్యక్షంగా వీక్షించారు. డోలు, వాయిద్యాల చప్పుళ్ళతో శివసత్తుల పూనకాలతో జాతర ప్రాంగణం మొత్తం జన సందోహంతో కిక్కిరిసిపోయింది. అశేష జనవాహిని నడుమ దేవత గద్దెల వద్దకు చేరుకునే ఘట్టం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. రాష్ట్ర నలుమూలల నుండి ఈసం వంశీయులు కుటుంబ సమేతంగా జాతరకు రావడంతో రోళ్ళగడ్డ గ్రామం జన సందోహంతో నిండిపోయింది. ఒక్క ఈసం వంశీయులే కాకుండా చుట్టుపక్క గ్రామాల ప్రజలు, భక్తులు భారీగా తరలివచ్చారు. ఆ తల్లిని కళ్ళారా చూసి పరవశించిపోయారు.
-దూలుగొండ తల్లిని దర్శించుకున్న జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల మండలంలోని రోళ్ళగడ్డ గ్రామంలో ప్రతియేటా జరిగే ఈసం వారి ఇలవేల్పు దూలుగొండ తల్లి జాతరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య గురువారం హాజరై ఆ తల్లిని దర్శించుకున్నారు. జాతర విశిష్టత, తీరుతెన్నుల గురించి జాతర నిర్వహకులను, ఆలయ కమిటీ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ఆ తల్లిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో జాతర నిర్వహకులు ఈసం(మేడారం)క్రిష్ణ, నారాయణ రావు, హైమావతి రావు, సురేందర్ రావు, రామ్మూర్తి, పాపారావు, రోళ్ళగడ్డ క్రిష్ణ, గుండాల క్రిష్ణ, సాంబయ్య, శంకర్, బుచ్చిరాములు పాల్గొన్నారు.