Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయు ఆధ్వర్యంలో కోడ్ ప్రతుల దహనం
నవతెలంగాణ-వైరా టౌన్
కార్మిక హక్కులను కాలరాస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రైతు సంఘం, సిఐటియు ఆధ్వర్యంలో వైరాలో కార్మిక కోడ్ల ప్రతులను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు బొంతు రాంబాబు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతు, కార్మిక వ్యతిరేక చట్టాలను రూపొందించి, భారతదేశంలో ప్రజలకు కనీస హక్కులు లేకుండా నియంత్రణ పద్ధతులు అమలు చేస్తుందని అన్నారు. కొత్త కార్మిక నిబంధనల వలన కార్మికులు, ఉద్యోగులు మౌలిక వేతనం, పీఎఫ్ లెక్కించే పద్దతిలో తీవ్రమైన ప్రభావం పడుతుందని అన్నారు. రైతు వ్యతిరేక, వ్యవసాయ చట్టాలను, కార్మిక వ్యతిరేక కోడ్లను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు సుంకర సుధాకర్, తోట నాగేశ్వరావు, రైతు సంఘం నాయకులు యనమద్ది రామకృష్ణ, వడ్లమూడి మధు తదితరులు పాల్గొన్నారు.
మధిర: సిఐటియు ఆధ్వర్యంలో కార్మిక వ్యతిరేక చట్టాల పత్రాలను మధిరలో దగ్ధం చేయడం జరిగింది. ఈ సందర్భంగా సీఐటీయు నాయకులు శీలం నరసింహారావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయాలని, అదేవిధంగా కార్మికులకు రావలసిన సౌకర్యాలను కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు తేలబ్రోలు రాధాకృష్ణ, పడకంటి మురళి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు మంద సైదులు, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు మద్దాల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.