Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధికారులకు కలెక్టర్ కర్ణన్ సూచనలు
నవతెలంగాణ - ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
మంత్రులు కల్వకుంట్ల తారక రామారావు, వేముల ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజరు కుమార్ చేతుల మీదుగా ఖమ్మం నగరంలో శుక్రవారం ప్రారంభం, శంకుస్థాపన కానున్న అభివృద్ధి పనుల ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్ గురువారం పరిశీలిం చారు. ఐ.టి.హబ్ రెండవ దశ పనుల శంకుస్థాపన, టేకులపల్లి డబుల్ బెడ్ రూమ్ గృహ సముదాయాలు, మిషన్ భగీరథ మంచినీటి సరఫరా ప్రారంభోత్సవం, నూతన ఆర్.టి.సి బస్టాండ్, కాల్వ ఓడ్డు వైకుంఠధామం ప్రారంభోత్సవ ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు. ప్రారంభోత్సవ శిలాఫలకాల ఏర్పాటు, నూతన ఆర్.టి.సి బస్టాండ్లో బహిరంగసభ ప్రాంగణాన్ని కలెక్టర్ తిలకించారు. అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు చేశారు. బహిరంగసభ ప్రాంగణంలో కోవిడ్-19 నిబంధనలకనుగుణంగా ప్రజలు కూర్చునే ఏర్పాట్లు ఉండాలన్నారు. వేసవి దృష్ట్యా సభకు వచ్చే ప్రజల సౌకర్యార్థం తాగునీటి వసతి ఏర్పాట్లు ఉండాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. డబుల్ బెడ్ రూమ్ గృహ సముదాయాల ప్రారంభోత్సవ అనంతరం రాష్ట్ర మంత్రులు గృహసముదాయాలను సందర్శించను న్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో అన్ని గృహాలలో ఏర్పాట్లు సమర్థవంతంగా ఉండాలన్నారు. అనంతరం కాల్వ ఓడ్డు హిందూ శ్మశానవాటికను కలెక్టర్ సందర్శించారు. ప్రారంభోత్సవ ఏర్పాట్లను పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. నగరపాలక సంస్థ కమిషనర్ అనురాగ్ జయంతి, జిల్లా రెవెన్యూ అధికారి శిరీష, ముఖ్య ప్రణాళికాధికారి శ్రీనివాస్, రోడ్లు భవనాలు, పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు శ్యాంప్రసాద్, చంద్రమౌళి అసిస్టెంట్ కమిషనర్ మల్లీశ్వరి, అర్బన్ తహశీల్దారు శైలజ తదితరులు ఉన్నారు.