Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్థానిక ఇంజినీరింగ్ కాలేజీలతో అనుసంధానం
- మరింత మందికి ఉద్యోగావకాశాల కల్పన
- మంత్రులు కేటీఆర్, అజరు, కలెక్టర్ కర్ణన్లకు ఐటీ కంపెనీల సీఈవోల కృతజ్ఞతలు
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ఖమ్మంలో ఐటీ హబ్ ప్రారంభించిన మూడు నెలల్లోనే ఫేజ్-2 నిర్మాణం కూడా చేపడుతుండటం హర్షనీయమని ఆయా కంపెనీల సీఈవోలు పేర్కొన్నారు. ఐటీ హబ్ ప్రారంభం సందర్భంగా డిసెంబర్లో ఇచ్చిన మాట ప్రకారం మంత్రి కె.తారకరామారావు రెండో దశ నిర్మాణానికి సైతం నిధులు మంజూరు చేయడం హర్షనీయమన్నారు. స్థానిక ఇల్లెందు క్రాస్‌రోడ్డులోని ఐటీహబ్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయా కంపెనీల సీఈవోలు మాట్లాడారు. ప్రస్తుతం ఉన్న బిల్డింగ్ కంటే కూడా వెయ్యి చదరపు అడుగుల అధిక విస్తీర్ణంతో ఫేజ్-2 బిల్డింగ్ నిర్మిస్తున్నామని టెక్ మహేంద్ర కంపెనీ సీఈవో విజరు తెలిపారు. ప్రస్తుతం ఉన్న బిల్డింగ్ 41వేల చదరపు అడుగులైతే నూతన భవనం 55వేల చదరపు అడుగులని వివరించారు. ప్రస్తుత బిల్డింగ్‌లో 430 సిట్టింగ్ లుంటే నూతనంగా నిర్మించే దానిలో 570కి పైగా ఉంటాయన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఐటీ హబ్‌లో ఇప్పటికే 430కి గాను 410 ఉద్యోగాలు భర్తీ అయ్యాయని మొత్తం 19 కంపెనీలు దీనిలో భాగస్వామ్యం అయ్యాయని తెలిపారు. ఫేజ్-2లో ఉద్యోగాలు కల్పించేందుకు అమెరికాకు చెందిన 31 కంపెనీలు ఆసక్తి చూపుతున్నట్లు పేర్కొన్నారు. స్థానిక ఇంజినీరింగ్ కాలేజీలతో అనుసంధానమై ఆయా కాలేజీల విద్యార్థులకు ఖమ్మం ఐటీ హబ్‌లో ప్లేస్‌మెంట్స్ కల్పిస్తామన్నారు. కాలేజీలో ఉండగానే విద్యార్థులకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. డిసెంబర్లో ఫస్ట్ ఫేజ్ మొదలు పెట్టి మూడు నెలల్లోనే రెండో దశ కూడా ప్రారంభించడం హర్షనీయమని ల్యాక్స్ సీఈవో చేపూరి ల్యాక్స్ అన్నారు. తమకు సహకరిస్తున్న మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజరుకుమార్లతో పాటు స్థానిక కలెక్టర్ ఆర్వీ కర్ణన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఫేజ్ వన్‌లో మీడియం సైజ్ కంపెనీలు వచ్చాయని ఫేజ్-2లో పెద్ద కంపెనీలు వచ్చేలా ప్రయత్నిస్తున్నామన్నారు. రెండో దశలో ఇప్పటికే 230 సిట్టర్స్కు ప్రతిపాదనలు వచ్చాయని తెలిపారు. ఇప్పటి వరకు వచ్చిన కంపెనీలన్నీ కనీసం రూ.100 కోట్లకు పైగా పెట్టుబడులు కలిగివున్నవేనన్నారు. విస్తృత ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా ఐటీ హబ్ పనిచేస్తుందన్నారు. ఇంకా వివిధ కంపెనీల సీఈవోలు యూనికార్న్ సునీల్ గాంధీ, రాకేష్ బత్తిని, ఉపేందర్ మాట్లాడారు.