Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- సత్తుపల్లి/ఖమ్మం
రాష్ట్ర పురపాలక, ఐటీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావుతో పలువురు మంత్రులు శుక్రవారం ఖమ్మం, సత్తుపల్లికి రానున్నారు. ఆరోజు ఉదయం 10 గంటలకు నగరానికి చేరుకొని ఐ.టి హబ్ ప్రాంగణంలో రెండో దశ ఐ.టి హబ్ నిర్మాణ పనులు, ఖమ్మం నగరపాలక సంస్థ పరిధిలో ఎస్.డి.ఎఫ్ నిధులతో నిర్మించనున్న సి.సి, బి.టి రోడ్ల నిర్మాణపు పనులు, 10.30 గంటలకు శ్రీ శ్రీ సర్కిల్ నుండి వెంకటాయపాలెం వరకు నాలుగు వరుసల రోడ్డు విస్తరణ పనులకు మంత్రులు శంకుస్థాపన చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. 11.00 గంటలకు టేకులపల్లి డబుల్ బెడ్ రూమ్ గృహ సముదాయాలను ప్రారంభిస్తారని, అనంతరం నగరపాలక సంస్థ పరిధిలో మిషన్ భగీరథ పథకం తాగునీటి సరఫరాను ప్రారంభిస్తారని పేర్కొన్నారు. 11.15 గంటలకు నూతన అర్.టి.సి బస్టాండ్ ను ప్రారంభించి అక్కడే బహిరంగసభలో మాట్లాడతారని తెలిపారు. మధ్యాహ్నం 12.00 గంటలకు మున్నేరు శ్మశానవాటిక ను మంత్రులు ప్రారంభిస్తారని సూచించారు.
మధ్యాహ్నం 1:30 గంటలకు హెలికాఫ్టర్ లో సత్తుపల్లి చేరుకుంటారు. రూ. 3.11కోట్లతో కొత్తగా నిర్మాణం జరిగిన మున్సిపల్ భవనాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారు. దీంతో పాటుగా మున్సిపల్ భవనం పక్కనే మూడు ఎకరాల్లో నిర్మాణం చేపట్టనున్న వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ సముదాయానికి శంకుస్థాపన చేస్తారు. కేటీఆర్ తో పాటు రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజరు కుమార్, జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ పాల్గొననున్నారు. అనంతరం సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అధ్యక్షతన జరిగే సభలో కేటీఆర్ పాల్గొంటారని అధికార వర్గాలు తెలిపాయి.