Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నేలకొండపల్లి
నేలకొండపల్లి గ్రామపంచాయతీ పరిధిలో లే అవుట్ అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మిస్తున్న నిర్మాణాలను తక్షణమే కూల్చివేయాలని జిల్లా పంచాయతీరాజ్ అధికారి వి.ప్రభాకర్ నేలకొండపల్లి పంచాయతీ పాలక వర్గాన్ని ఆదేశించారు. మండల కేంద్రంలోని కూసుమంచి రోడ్లో ఓ వెంచర్ లే అవుట్ అనుమతులు లేకుండా నిర్మాణాలు చేయడంపై స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గురువారం ఆయన పరిశీలించారు. అక్రమ వెంచర్లలో అనుమతులు లేకుండా ఎలా నిర్మాణాలు చేశారంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ నిర్మాణాలు చేయడంపై పంచాయతీ అధికారులు, ప్రజా ప్రతినిధులు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. స్పందించిన పంచాయతీ పాలకవర్గ సభ్యులు తాము లేఅవుట్ నిబంధనలకు లోబడి మాత్రమే అనుమతులు ఇచ్చామని, అందులో భాగంగానే సంబంధిత వెంచర్లో 2000 గజాలను పంచాయితీ పాలకవర్గానికి కేటాయించడం జరిగిందన్నారు. గత పాలకవర్గాలు మాత్రమే ఎటువంటి అనుమతులు లేకుండానే గ్రామంలో వెంచర్ల ఏర్పాటుకు అవకాశం కల్పించారని వారి హయాంలోనే అక్రమ నిర్మాణాలు జరిగాయంటూ డీపీఓ దృష్టికి తీసుకెళ్లారు. వీటిపై సమగ్ర వివరాలు అందించాలని ప్రస్తుత పంచాయితీ పాలకవర్గాన్ని ఆదేశించారు. అక్రమ వెంచర్లు వేసిన వారిపై నిర్మాణాలు జరిపిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో సర్పంచి రాయపూడి నవీన్, ఉప సర్పంచ్ ఏడుకొండలు, పంచాయతీ కార్యదర్శి రామ్ నరేష్, పాలకవర్గ సభ్యులు సిబ్బంది పాల్గొన్నారు.