Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిధుల దుర్వినియోగానికి పాల్పడి ఉంటే నాతోపాటు నా కుటుంబాన్నీ ఉరితీయండి
- రైతుల సంక్షేమ కార్యక్రమాలకే నిధులు వెచ్చించాం..
- పాలకవర్గ సమష్టి నిర్ణయాలతోనే ప్రతి పైసా ఖర్చు చేశాం...
- కొందరు డైరెక్టర్లు అప్పుడు సంతకాలు చేసి ఇప్పుడు ఫోర్జరీ అంటే సరిపోతుందా?
- నా హయాంలో డీసీసీబీ ఎంతో పురోభివృద్ధి సాధించింది..
- అధికారపార్టీలో అనధికార పక్షంలా ఉన్నాం..! ఉంటాం...!!
- రెవెన్యూ తరహాలోనే సహకార రంగంలోనూ సంస్కరణలకు సీఎం చొరవ చూపాలి..
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయప్రతినిధి
'కేవలం నాపై కక్షతోనే.. రాజకీయంగా ఎదుగుదలను ఓర్వలేకనే...కొందరు నాపై బురదజల్లే కార్యక్రమం మొదలుపెట్టారు. వేధింపు చర్యలకు దిగుతున్నారు. నేను డీసీసీబీలో ఒక్క పైసా దుర్వినియోగానికి పాల్పడినట్లు నిరూపిస్తే నాతో పాటు నా కుటుంబాన్ని ఖమ్మం మయూరి సెంటర్లో ఉరితీయండి. లేదంటే నన్ను జైలుకు పంపండి. రైతుల సంక్షేమం కోసమే ప్రతి పైసా వెచ్చించాం. నా హయాంలోనే బ్యాంకు ఎంతో పురోభివృద్ధి చెందింది. ఎందరో రైతులకు లోన్లు ఇప్పించా..కానీ ఏ ఒక్కరి నుంచి ఒక్క పైసా తీసుకున్నట్లు నిరూపించమనండి? అప్పట్లో తీర్మాన ప్రతులపై సంతకాలు చేసిన కొందరు డైరెక్టర్లు ఇప్పుడు మా సంతకాలు ఫోర్జరీ చేశారంటే సరిపోతుందా? టెస్టుకు పంపిస్తే తెలుస్తుంది కదా!. రెవెన్యూ తరహాలోనే సహకార రంగంలోనూ సంస్కరణలకు ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ చూపాలని విజ్ఞప్తి చేస్తున్నా...' అని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు మాజీ చైర్మన్ మువ్వా విజరుబాబు కోరారు. స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఫంక్షన్హాల్లో టీఆర్ఎస్ జిల్లా నాయకులు మట్టా దయానంద్‌తో కలిసి గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మౌనాన్ని అసమర్థత కింద భావిస్తే తగిన శాస్తి జరుగుతుందన్నారు. తన హయాంలో డీసీసీబీలో కొత్తగా 50 బ్రాంచీలు ఏర్పాటు చేశానన్నారు. రైతాంగానికి మంచి జరగాలని కొన్ని నిర్ణయాలు తీసుకున్న మాట యదార్థమేనన్నారు. తాను చైర్మన్‌గా బాధ్యతలు తీసుకున్నప్పుడు రూ.380 కోట్లున్న బ్యాంకు డిపాజిట్లను రూ.వెయ్యి కోట్ల పైగా చేర్చానన్నారు. రైతుల పిల్ల్లలు విదేశాల్లో చదువుకునేందుకు లోన్లు ఇచ్చి ప్రోత్సహించామన్నారు. ఇప్పుడు ఎందరో రైతుల పిల్లలు ఉద్యోగాలు చేస్తూ తల్లిదండ్రులు సంతోషపెడుతున్నారంటే...అదంతా డీసీసీబీ క్రెడిటేనన్నారు. రైతులకు జీరో అకౌంట్లు తెరిచి...ఏటీఎం కార్డులు సైతం ఇచ్చామన్నారు. రైతు సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన ట్రస్టుకు రైతులు రూ.500 విరాళం, అంతకుమించి ఇచ్చారన్నారు. సొసైటీల చైర్మన్లు ఐదేళ్ల గౌరవవేతనాన్ని ట్రస్టుకు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. తాను నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు కొన్ని పత్రికలు అదే పనిగా రాస్తున్నాయని, తాను ఒక్క పైసా నిధులు దుర్వినియోగం చేసినట్లు నిరూపిస్తే కుటుంబంతో సహా తనను ఉరితీయాలని...లేదంటే జైలుకు పంపండని విజరుబాబు సవాల్ విసిరారు. ఒకవేళ తాను నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు నిరూపిస్తే ఆస్తులమైనా సరే చెల్లిస్తా? అన్నారు.
చూడకుండా సంతకాలు చేస్తారా?
ఇటీవల కొందరు డైరెక్టర్లు మీడియా సమావేశం ఏర్పాటు చేసి అధికారులు, చైర్మన్ మాత్రమే నిధుల మళ్లింపునకు బాధ్యత వహించాలని చెబుతుండటాన్ని మువ్వా విజరుబాబు ఆక్షేపించారు. గొప్పగొప్ప చదువులు చదివిన ఓ డైరెక్టర్ ఫోర్జరీ సంతకాలని కాసేపు... చూడకుండా సంతకాలు చేశామని కొద్దిసేపు చెబుతుండటం విడ్డూరంగా ఉందన్నారు. కేవలం తన రాజకీయ ఎదుగుదలను ఓర్వలేకనే ఇలాంటి వేధింపు చర్యలకు పాల్పడుతున్నారన్నారు. డీసీసీబీలో నిధుల మళ్లింపు జరిగినట్లు విచారణ రిపోర్టులో ఉంటే నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు కొన్ని పత్రికల్లో రావడం బాధాకరమన్నారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు రెవెన్యూ తరహాలోనే సహకార రంగంలోనూ సంస్కరణలు తీసుకురావాలని కోరారు. లేదంటే సహకార రంగం స్వార్థ రాజకీయాలతో నిర్వీర్యమయ్యే ప్రమాదం ఉందన్నారు.