Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.10వేల కరోనా భృతి ఇచ్చి ఆదుకోవాలి..
- ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు లేని కరోనా ఇప్పుడే వస్తుందా?
- ప్రభుత్వంపై సమిష్టిగా ఒత్తిడి తెస్తేనే ప్రైవేట్ టీచర్లకు న్యాయం
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, ప్రైవేట్ టీచర్స్ యూనియన్ నాయకులు చిరంజీవి
నవతెలంగాణ- గాంధీచౌక్
ప్రైవేట్ టీచర్ల జీవితాలతో ఆటలొద్దని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు ప్రభుత్వానికి హితవు పలికారు. ప్రైవేట్ టీచర్లకు నెలకు రూ.10వేల కరోనా భృతి ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. స్థానిక మంచికంటి మీటింగ్‌హాల్‌లో గురువారం ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు లేని కరోనా...ఇప్పుడు ఎందుకు పెరిగింది? ప్రభుత్వం రావాలంటే వస్తుంది..? వద్దంటే పోతుందా? అని ప్రశ్నించారు. ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు, టీచర్లు, అధ్యాపకుల నుంచి వ్యతిరేకత రావొద్దనే.. కేవలం ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే అప్పటికప్పుడు స్కూల్స్ తెరిచారన్నారు. ప్రైవేట్ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న సిబ్బందికి నెలకు రూ.10వేల కరోనా భృతి పదినెలల పాటు చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ టీచర్ల జీవితాలతో ఆడుకోవద్దన్నారు. కేసీఆర్ మొండి వైఖరిని విడనాడాలన్నారు. ప్రైవేట్ టీచర్స్, యాజమాన్యాలన్నీ సమష్టిగా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని పిలుపునిచ్చారు. కరోనా విషయంలో ప్రభుత్వానివన్నీ కల్పితాలు మాత్రమేనని ప్రైవేట్ టీచర్స్ యూనియన్ జిల్లా నాయకులు చిరంజీవి అన్నారు. ప్రజలను భయభ్రాంతులను చేయడానికే ప్రభుత్వం నాటకమాడుతుందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నిర్వహించిన బహిరంగ సమావేశాల్లో రాని కరోనా స్కూల్స్ తెరిస్తేనే వస్తుందా? అని ప్రశ్నించారు. రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధుల పిల్లలు చదివేది ప్రైవేట్ స్కూల్స్‌నే అన్నారు. ఏ ఒక్క ప్రైవేట్ స్కూల్లో కరోనా వచ్చిన దాఖలాలు లేవన్నారు. కేవలం ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో మాత్రమే అక్కడక్కడా వచ్చిందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో కరోనా విషయంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఎలా ఉన్నాయో మనకు అర్థమవుతుందన్నారు. పాఠశాలలు ప్రారంభమై 25 రోజులు కూడా కాకముందే మూసివేయడం వల్ల ప్రైవేట్ టీచర్లు రోడ్డున పడ్డారన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ముందు వరకు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు తెరిచి ఇప్పుడు మూసివేయడానికి కారణమెంటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ టీచర్లను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం సరికాదన్నారు. స్టేట్ స్పోక్స్‌పర్సన్ యూనియన్ రాష్ట్ర నాయకులు శేషుకుమార్, కాంగ్రెస్ జిల్లా నాయకులు దీపక్‌చౌదరి, వై.సంతోష్, కాంట్రాక్ట్ టీచర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి సురేష్, ప్రైవేట్ టీచర్స్ యూనియన్ నాయకులు రంగారావు, కె. తిరుమలరావు, టీఎస్‌యూటీఎఫ్ జిల్లా కోశాధికారి నాగేశ్వరరావు, సీపీఐ జిల్లా నాయకులు సింగు నర్సింహారావు, సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు యర్రా శ్రీకాంత్, జిల్లా నాయకులు వై.విక్రమ్, తుషాకుల లింగయ్య, బండారు రమేష్, యర్రా శ్రీను, మహేష్, నవీన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.