Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య
నవతెలంగాణ-సత్తుపల్లి
రూ. 3.11కోట్లతో నిర్మాణం జరిగిన సత్తుపల్లి నూతన మున్సిపల్ భవనాన్ని ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ శుక్రవారం ప్రారంభించనున్నారని స్థానిక ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తెలిపారు. గురువారం స్థానిక కొత్త మున్సిపల్ భవన్ వద్ద విలేకర్లతో ఎమ్మెల్యే సండ్ర మాట్లాడారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కొత్త మున్సిపల్ భవన్ రూపు దిద్ద్దుకుందన్నారు. పాలకవర్గ సమావేశాలు జరుపుకునేందుకు విశాలమైన మీటింగ్ హాలుతో పాటు కౌన్సిలర్లకు ప్రత్యేక డెస్క్‌లు అసెంబ్లీలో మాదిరిగా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మున్సిపల్ భవన్ ప్రారంభోత్సవంతో పాటు మూడు ఎకరాల్లో రూ. కోట్లతో కూరగాయలు, మాంసం దుకాణాల సముదాయానికి కూడా కేటీఆర్ శంకుస్థాపన చేస్తారన్నారు. రాష్ట్రంలో ఉన్న 140 మున్సిపాలిటీల్లో ఇదే మాదిరిగా ప్రత్యేకంగా మార్కెట్ సముదాయాల ఏర్పాటు లక్ష్య:గా ముఖ్యమంత్రి కేసీఆర్ రూపకల్పన చేయడం జరిగిందన్నారు. ఇదేగాక 8 ఎకరాల్లో రూ. 2 కోట్లతో డంపింగ్ యార్డు పనులు కూడా ప్రారంభమవుతాయన్నారు. ఈ యేడాదిలోనే సత్తుపల్లి పట్టణంలో రూ. 3 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. ఇవేగాక ఇప్పటి వరకు సత్తుపల్లిలో రూ. 32.93 కోట్లతో మొత్తం 72 పనులు చేపట్టగా అందులో 42 పనులు పూర్తి చేయడం జరిగిందన్నారు. మిగతాయి కూడా త్వరలో పూర్తి చేయడం జరుగుతుందన్నారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు ఆటోనగర్ ఏర్పాటుకు కృషి చేయడం జరుగుతుందన్నారు. అలాగే సత్తుపల్లికి ఓ ట్యాంకుబండ్ ఏర్పాటును కేటీఆర్‌ను కోరడం జరుగుతుందన్నారు. సత్తుపల్లిని అన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ, అడిగిన వెంటనే కోట్లాది రూపాయలు మంజూరు చేస్తూ వస్తున్న మంత్రి కేటీఆర్‌కు పట్టణ ప్రజలు రాజకీయాలకు అతీతంగా ఘనస్వాగతం పలుకుదామని సండ్ర పిలుపునిచ్చారు. ఈ సమావేశానికి ముందు కేటీఆర్ సభ జరుగనున్న సభా స్థలి ఏర్పాట్లను ఎమ్మెల్యే పార్టీ శ్రేణులతో కలిసి పరిశీలించారు. సభకు హాజరయ్యే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చూడాలని మున్సిపల్ ఛైర్మెన్ కూసంపూడి మహేశ్‌ను కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కోడూరు సుజాత, డీసీసీబీ డైరెక్టర్ చల్లగుండ్ల కృష్ణయ్య, కౌన్సిలర్లు మట్టా ప్రసాద్, చాంద్‌పాషా, అనిల్‌కుమార్, ప్రవీణ్‌కుమార్, నాయకులు చల్లగుళ్ల నరసింహారావు, కొత్తూరు ప్రభాకరరావు, దొడ్డా శంకరరావు, వల్లభనేని పవన్, గఫార్, పాలకుర్తి రాజు పాల్గొన్నారు.