Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సత్తుపల్లి అభివృద్ధికి రూ. 30కోట్లు
- మినీ ట్యాంక్‌బండ్ ఏర్పాటు చేయిస్తాం
- ఇండ్ల స్థలాలు ఇప్పిస్తాం
- సత్తుపల్లి సభలో మంత్రి కేటీఆర్
నవతెలంగాణ- సత్తుపల్లి
మాటలు చెప్పే ప్రభుత్వం కాదని, చేతలు చేసే ప్రభుత్వమని రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు స్పష్టం చేశారు. సత్తుపల్లి నూతన మున్సిపల్ భవన్ ప్రారంభోత్సవానికి శుక్రవారం సత్తుపల్లి వచ్చిన మంత్రి కేటీఆర్ ఆ కార్యక్రమం అనంతరం జరిగిన సభలో ప్రసంగించారు. ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆధ్వర్యంలో సత్తుపల్లి ఎంతో పురోభివృద్ధి సాధించిందన్నారు. హైదరాబాద్ వచ్చిన ప్రతిసారి సత్తుపల్లి పట్టణంతో పాటు నియోజకవర్గ అభివృద్ధి నిధులు కోరడం చేస్తుంటారన్నారు. ఆయన సొంత పనులు ఏనాడూ అడిగిన సందర్భాలు లేవన్నారు. సత్తుపల్లి పట్టణాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతున్న నేపధ్యంలో గత మున్సిపల్ ఎన్నికల్లో ఉన్న 23 డివిజన్లలో మొత్తం డివిజన్లన్నీ గెలిపించి రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిచారన్నారు. ఈ నేపధ్యంలో సత్తుపల్లిని మరింతగా అభివృద్ధి చేయడం కోసం తక్షణమే రూ. 30కోట్లు మంజూరు చేస్తున్నారన్నారు. ఆ నిధులతో ఆయన కోరిన విధంగా సత్తుపల్లి వేశ్యకాంతల చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా తీర్చిదిద్దడం జరుగుతుం దన్నారు. దీంతో పాటు ఇండ్లులేని పేదలకు ఇంటి స్థలాలు అందించడం జరుగుతుందన్నారు. పట్టణ శివారులతో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు స్మృతి వనాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. అలాగే ముస్లిం వర్గానికి షాదీఖానా ఏర్పాటు, క్రైస్తవ సమాజానికి కమ్యూనిటీహాలు నిర్మాణం తదితర అభివృద్ధి కార్యక్రమాలు ఎమ్మెల్యే సండ్ర నేతృత్వంలో రూపుదిద్దుకుంటా యన్నారు. ఎమ్మెల్యే సండ్ర ప్రాతినిధ్యం మేరకు సత్తుపల్లి సమస్యలన్నింటిని పొల్లు పోకుండా పరిష్కరించడం జరుగుతుం దన్నారు. అనంతరం ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామా నాగేశ్వరరావు, ఆర్అండ్బీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, రవాణామంత్రి పువ్వాడ అజరుకుమార్ మాట్లాడారు.
35 ఎకరాల అటవీ భూమిని ఇండ్ల స్థలాలకు కేటాయించండి : సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య
పట్టణ నడిబొడ్డులో ఉన్న 35 ఎకరాల అటవీ భూమిని ఇప్పించి ఇండ్లులేని పేదలకు పంపిణీ చేయాలని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మంత్రి కేటీఆర్‌ను కోరారు. ఆయా భూమిని డీరిజర్వ్డ్ చేయించి ఇండ్ల స్థలాలకు అప్పగించడం జరుగుతుందని కేటీఆర్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సండ్ర మాట్లాడుతూ కిష్టారం వై-జంక్షన్ వద్ద ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటు న్నామన్నారు. సత్తుపల్లిని స్లాస్టిక్ రహిత పట్టణంగా తీర్చిదిద్దే కార్యక్రమంలో భాగంగా 10వేల కుటుంబాలకు జ్యూట్ బ్యాగులు అందించే కార్యక్రమం చేపట్టామన్నారు. 20వేల తడిపొడి చెత్త డబ్బాలను ఇంటికి రెండు చొప్పున పంపిణీ చేస్తున్నామన్నారు. సభ ప్రారంభానికి ముందు మున్సిపల్ భవన్ ప్రారంభోత్సవం, ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహాత్ముడి విగ్రహం, చాకలి ఐలమ్మ విగ్రహాలను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం రూ. 2కోట్లతో 3 ఎకరాల్లో నిర్మాణం చేపట్టనున్న వెజ్ అండ్ నాన్‌వెజ్ మార్కెట్‌కు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం, పాలేరు ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, కందాల ఉపేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, కలెక్టర్ ఆర్వీ కర్ణన్, మాజీ పార్లమెంట్ సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మున్సిపల్ ఛైర్మెన్ కూసంపూడి మహేశ్, వైస్ ఛైర్మెన్ తోట సుజలారాణి, కౌన్సిలర్లు పాల్గొన్నారు.