Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 18 రకాల నిత్యావసర వస్తువులను చౌకగా ఇవ్వాలి
- రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తల డిమాండ్
నవతెలంగాణ- ఖమ్మం
అర్హులందరికీ రేషన్ కార్డులు ఇచ్చి రేషన్ షాపుల ద్వారా 18 రకాల నిత్యావసర వస్తువులను కారుచౌకగా ఇవ్వాలని రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు వక్తలు డిమాండ్ చేశారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మంలోని మంచికంటి భవనంలో శుక్రవారం సంఘం జిల్లా అధ్యక్షులు మెరుగు సత్యనారాయణ అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సంఘం జిల్లా కార్యదర్శి పొన్నం వెంకటేశ్వరరావు, తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి మాదినేని రమేష్ మాట్లాడుతూ గత సంవత్సర కాలంగా కరోనాతో ప్రజలు పనులు లేక వలస పోతు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదలను పట్టించుకోకుండా రేషన్ షాపుల ద్వారా అందే కనీసం నిత్యావసర వస్తువులు కూడా అందించకుండా అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నాయన్నారు. తెలంగాణ వచ్చి ఏడు సంవత్సరాలు గడిచినా జిల్లాలో నూతనంగా ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదన్నారు. అనేకమంది పెళ్లిళ్లు చేసుకుని కుటుంబాల నుంచి విడిపోయి జీవనం గడుపుతున్నా రేషన్ కార్డు ఇవ్వడం లేదన్నారు. ఉన్న కార్డులు తొలగించే ప్రయత్నంలో భాగంగా వేలిముద్రలు ఐరిస్ ఆధార్‌తో అనుసంధానం లాంటి మార్పులకు పాల్పడుతూ పేదలకు రేషన్ అందకుండా అన్యాయం చేస్తున్నారన్నారు. ఖమ్మం జిల్లాలో నేటికీ మూడు లక్షల 95 వేల రేషన్ కార్డులకు 669 రేషన్ షాపుల ద్వారా 7250 మెట్రిక్ టన్నుల బియ్యం ప్రతినెలా ఇస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోందని, కానీ అవి లబ్ధిదారులకు అందటం లేదన్నారు. రేషన్ కార్డుతో ఆరోగ్యశ్రీ కార్డు సంబంధం ఉండటం వల్ల పేదలకు రేషన్ కార్డులు లేక ఆరోగ్యశ్రీ కార్డు అందక వైద్యం కోసం ఇబ్బందులు పడుతున్నారన్నారు. తక్షణం అర్హులందరికీ ఆధార్ తో సంబంధం లేకుండా కొత్త రేషన్ కార్డులు వెంటనే ఇవ్వాలని కేరళ తరహాలో 18 రకాల నిత్యావసర సరుకులను రేషన్ షాపుల ద్వారా అందించాలని వారు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రైతాంగ, కార్మిక, పేదల వ్యతిరేక వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నిత్యావసర వస్తువుల నియంత్రణ చట్టం రద్దు వల్ల రానున్న కాలంలో పేదలకు ఆహారం అందక ఆత్మహత్యలే శరణ్యమని వారన్నారు నిత్యావసర వస్తువుల నియంత్రణ చట్టాన్ని ప్రభుత్వం కొనసాగించాలన్నారు. సొంత స్థలం ఉన్న వారికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టుకోవడానికి అనుమతిని ఇవ్వాలన్నారు. స్థలం లేని పేదవారికి ప్రభుత్వమే డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టి ఇవ్వాలన్నారు. కెసిఆర్ ఇచ్చిన హామీ మేరకు 57 సంవత్సరాలు నిండిన అర్హులందరికీ వృద్ధాప్య పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఐద్వా రాష్ట్ర నాయకురాలు బుగ్గవీటి సరళ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచి అన్ని నిత్యావసర వస్తువుల ధరల పెంపునకు పాల్పడుతున్నాయని, వాటివల్ల మహిళలు ప్రాణాలు తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలను లక్షాధికారులను చేస్తానన్న కెసిఆర్ డ్వాక్రా మహిళలకు గతంలో ఉన్న ఆమ్ ఆద్మీ బీమా, అభయహస్తం, పెన్షన్, విద్యార్థుల స్కాలర్షిప్లు రద్దు చేయడం వల్ల డ్వాక్రా మహిళలు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ పథకాలను పునరుద్ధరించాలన్నారు ప్రతి డ్వాక్రా గ్రూప్‌కి వడ్డీలేని రూ.10 లక్షల రుణం ఇచ్చి స్వయం పోషకులుగా ప్రోత్సహించాలన్నారు. గొర్రెల మేకల సంఘం జిల్లా కార్యదర్శి మేకల నాగేశ్వరరావు, మత్స్య కార్మిక సంఘం జిల్లా కన్వీనర్ పగడాల నాగేశ్వరరావు, సిఐటియు జిల్లా నాయకులు మాచర్ల గోపాల్, తిరుమల చారి, బీవీకే ట్రస్ట్ చైర్మన్ శ్రీనివాసరావు, కల్లుగీత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బోడపట్ల సుదర్శన్‌రావు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ నాయకులు వత్సవాయి జానకి రాములు మాట్లాడారు. సమావేశంలో ఐద్వా జిల్లా ఉపాధ్యక్షురాలు మెరుగు రమణ, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ నాయకులు పి.సంగయ్య, గద్దల రత్నమ్మ, జిల్లా నాయకులు బందెల వెంకయ్య, బారీ మల్సూర్, కే.గురుమూర్తి, గణపతి, సిఐటియు నాయకులు నవీన్ రెడ్డి, పి.ఝాన్సీ, శ్రీమన్నారాయణ తదితరులు పాల్గొన్నారు.