Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఖమ్మానికి మరో మూడు నమీకృత మార్కెట్లు... రెండు వైకుంఠధామాలు
- ఒకే రోజు రూ.423 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభం, శంకుస్థాపన
- అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ సభలో పురపాలక, ఐటీశాఖ మంత్రి కేటీఆర్
నవతెలంగాణ - ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సారథ్యంలో అభివృద్ధికి ఖమ్మం రోల్ మోడల్‌గా నిలుస్తుందని ఐటీ, పురపాలకశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. ఖమ్మంలో రూ.423.26 కోట్ల వివిధ అభివృద్ధి పనుల ప్రారంభం, శంకుస్థాపనల కోసం శుక్రవారం నగరానికి వచ్చిన మంత్రి కేటీఆర్ ఐటీ హబ్ ఫేజ్-2 , నూతన ఆర్టీసీ బస్టాండ్ ప్రారంభోత్సవ సభల్లో మాట్లాడారు. రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ నామ నాగేశ్వరరావుతో కలిసి ఆయా అభివృద్ధి పనులను ప్రారంభించారు. రూ.36 కోట్లతో చేపట్టిన ఐటీ హబ్ రెండో దశకు భూమిపూజ చేశారు. టేకులపల్లిలో రూ.60.20 కోట్లతో నిర్మించిన వెయ్యి డబుల్ బెడ్రూం ఇళ్లను ప్రారంభించారు. 45వేల నూతన కనెక్షన్లు, 85వేల పాత కనెక్షన్లకు ప్రతిరోజు మంచినీటి సరఫరా లక్ష్యంగా రూ.229.95 కోట్లతో నిర్మించిన మిషన్ భగీరథ పథకానికి ప్రారంభోత్సవం చేశారు. రూ.25 కోట్లతో 7.25 ఎకరాల విస్తీర్ణంలో 30 ప్లాట్‌ఫాంలతో ఆధునిక సదుపాయాలతో ఆర్టీసీ బస్టాండ్నూ ప్రారంభించారు. అధునాతన ఆర్టీసీ బస్టాండ్ ప్రారంభ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మంత్రిపై ప్రశంసల జల్లు కురిపించారు. మూడు నెలల్లో రెండోసారి ఖమ్మం రావడం గొప్ప విషయమన్నారు. ఒకే రోజు రూ.400 కోట్లకు పైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారన్నారు. నగరమంటే ఇలా ఉండాలని అజరు చేసి చూపిస్తున్నారన్నారు. 1004 డబుల్ బెడ్రూం ఇళ్లు, నూతన ఆర్టీసీ బస్టాండ్, ఐటీ హబ్ రెండో దశ పనులు, అత్యాధునిక సౌకర్యాలతో వైకుంఠధామం ఇలా ఎన్నో అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం, భూమి పూజలు చేసుకోవడం గర్వకారణమన్నారు. నష్టాల బాటలో ఉన్న ఆర్టీసీని లాభాల పట్టించడం కోసం మంత్రి అజరు సరికొత్త ఆలోచనలు చేస్తున్నారన్నారు. కార్గో సర్వీసులు ఆర్టీసీకి ఎంతో మేలు చేస్తున్నాయని తెలిపారు. ఆర్టీసీ సంస్థ ఆధ్వర్యంలో మల్టీఫ్లెక్స్ థియేటర్‌కు సైతం ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు.
ఖమ్మంపై వరాల జల్లు...
ఇతర ప్రాంతాల వారు చెప్పుకునేలా ఖమ్మం శరవేగంగా అభివృద్ధి చెందుతుందని తెలిపిన కేటీఆర్.... మరోమారు ఖమ్మంపై వరాల జల్లు కురిపించారు. మున్నేరుపైన వాకింగ్ ట్రాక్ ఏర్పాటుకు నిధులు మంజూరు చేస్తామన్నారు. గోళ్లపాడు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి సుముఖత తెలిపారు. ఇప్పటికే ఉన్న సమీకృత వెజ్ అండ్ నాన్‌వెజ్ మార్కెట్‌కు తోడు మరో మూడు మార్కెట్లు, మరో రెండు వైకుంఠధామాలకు మంత్రి అజరు విజ్ఞప్తి మేరకు నిధులు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో మరోమారు టీఆర్ఎస్కు పట్టం కడితే మరింత అభివృద్ధి పథంలో నగరం పయనించేలా అజరు కృషి చేయడానికి అవకాశం ఏర్పడుతుందన్నారు. సంయుక్త అభివృద్ధి అన్ని పట్టణాల్లో కనిపిస్తుందని రోడ్లు, భవనాల శాఖమంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. మంత్రి అజరు పట్టుదల కలిగిన ప్రజాప్రతినిధి అని కొనియాడారు. ఖమ్మంలో చేసిన వివిధ అభివృద్ధి పనుల వివరాలను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వివరించారు. శుక్రవారం ఒక్కరోజే రూ.400 కోట్లకు పైగా అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసుకున్నామన్నారు. ఆర్టీసీ బస్టాండ్, డబుల్ బెడ్రూం ఇళ్లు, మిషన్ భగీరథ నీటి సరఫరా, మున్నేరు ఒడ్డున ఆధునిక వైకుంఠధామం ప్రారంభించుకున్నామన్నారు. ఐటీ హబ్ రెండో దశ, శ్రీశ్రీ సర్కిల్ నుంచి వెంకటాయపాలెం వరకు ఫోర్‌లైన్ రోడ్డు నిర్మాణాలకు శంకుస్థాపన చేసినట్లు వివరించారు. ఖమ్మం నగరాభివృద్ధికి కృషి చేసిన నగరపాలక సంస్థ గత పాలకవర్గంతో పాటు కలెక్టర్ కర్ణన్, కమిషనర్ అనురాగ్ జయంతిలపై ప్రశంసలు కురిపించారు. తెలంగాణ వచ్చాక ఉమ్మడి ఖమ్మం జిల్లా రూ.40వేల కోట్ల అభివృద్ధి పనులు జరిగాయని ఎంపీ నామ నాగేశ్వరరావు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై ప్రశంసలు కురిపిస్తున్న కేంద్రం...అభివృద్ధికి నిధులు కేటాయించకపోవడాన్ని తప్పుబట్టారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, వైరా, పాలేరు ఎమ్మెల్యేలు లావుడ్యా రాములునాయక్, కందాళ ఉపేందర్‌రెడ్డి, జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజ్, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, ఆర్టీసీ ఎండీ సునీల్‌శర్మ, ఈడీ పురుషోత్తం నాయక్, ఐటీ హబ్‌లో వివిధ కంపెనీల సీఈవోలు, ఆర్టీసీ ఆర్ఎం సాల్మన్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు.