Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బుగ్గపాడులో భూస్వాముల ఆక్రమణలో ఉన్న గిరిజనుల భూములు తిరిగి ఇప్పించండి
- సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో మంత్రి కేటీఆర్‌కు వినతిపత్రం
నవతెలంగాణ- సత్తుపల్లి
సత్తుపల్లి మండలం బుగ్గపాడు ఫుడ్‌పార్కు భూనిర్వాసితులకు న్యాయం చేయాలని, ఆక్రమణకు గురైన బుగ్గపాడు గిరిజనుల భూములను అప్పగించాలని కోరుతూ శుక్రవారం సత్తుపల్లి వచ్చిన రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌కు సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో వినతిపత్రాలు అందించారు. ఫుడ్‌పార్కు ఏర్పాటుకు బుగ్గపాడు, రుద్రాక్షపల్లి, గాంధీనగర్‌కు చెందిన చిన్న, సన్నకారుల రైతుల నుంచి 2005లో 200 ఎకరాల సేకరించారని, అందులో 190 ఎకరాల వరకు అసైన్డ్ భూములు ఉన్నాయని వినతిపత్రంలో పేర్కొన్నారు. అప్పుడు విడుదల చేసిన భూసేకరణ రాయితీలు భూనిర్వాసితులకు అందలేదన్నారు. 2006లో భూసేకరణ కార్యక్రమం మొదలుపెట్టగా రైతులు వ్యతిరేకించడంతో భూసేకరణ ఆగిందన్నారు. మరలా 2016లో ఫుడ్‌పార్కు అంశం తెరపైకి వచ్చిందన్నారు. సేకరించిన భూముల చుట్టూ ఫుడ్‌పార్కు సంబంధిత అధికారులు ప్రహారీ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. భూపరిహారం నామమాత్రంగా చెల్లించారన్నారు. న్యాయయైన పరిహారం అందించడంతో పాటు అప్పట్లో ఇచ్చిన హామీ మేరకు ఇంటికో ఉద్యోగం, భూమికి బదులు భూమి ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. దీంతో పాటు బుగ్గపాడుకు చెందిన గిరిజనుల భూములను అదే గ్రామానికి కొందరు భూస్వాములు కౌలుపేరుతో ఆక్రమించుకొని కార్పొరేట్ వ్యవసాయం చేస్తున్నారని వినతిపత్రంలో వివరించారు. గత 36 యేండ్లుగా సాగులో ఉన్న గిరిజనుల భూములను భూస్వాముల నుంచి స్వాధీనం చేసుకొని తిరిగి గిరిజనులకు ఇప్పించాలని కోరారు. సీపీఐ(ఎం) జిల్లా మోరంపూడి పాండురంగారావు, సత్తుపల్లి మండల కార్యదర్శి జాజిరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కాజా రామలింగేశ్వరరావు, కర్లపూడి ఆదిలక్ష్మి మంత్రి కేటీఆర్‌కు వినతిపత్రం అందించారు. ఇందుకు స్పందించిన మంత్రి కేటీఆర్ ఈ విషయం తన దృష్టిలో ఉందని న్యాయం చేస్తానని హామీ ఇవ్వడంతో పాటు స్థానిక ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యను కలిసి పరిస్థితిని వివరించడం ద్వారా ఆయన ప్రాతినిధ్యంతో సమస్యకు పరిష్కారం చూపించడం జరుగుతుందని కేటీఆర్ సీపీఐ(ఎం) నాయకులకు హామీ ఇచ్చారు.