Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బోనకల్
ఒకవైపు కరోనా వేగం పెరుగుతుండగా మరోవైపు పొట్టకూటి కోసం వ్యవసాయ కార్మికులు ప్రాణసంకటంతో విలవిల లాడుతున్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా పూర్తిస్థాయిలో పనులు లేకపోవడం మరోవైపు ఆయా గ్రామాలలో వ్యవసాయ పనులు తగ్గుముఖం పట్టడంతో వ్యవసాయ కార్మికులు పొట్టకూటి కోసం పడరాని పాట్లు పడుతున్నారు. ప్రతిరోజు వందలాది మంది బోనకల్లు మండలం నుంచి కృష్ణాజిల్లాలోని పలు గ్రామాలకు వాహనాల ద్వారా వ్యవసాయ పనుల కోసం వెళ్తున్నారు. వాహనంలో మోతాదుకు మించి ప్రయాణం చేస్తే ఏదైనా జరగరాని సంఘటన జరిగితే ప్రమాదం పొంచి ఉందని తెలిసినా వ్యవసాయ కార్మికులు వెళ్తూనే ఉన్నారు ఆటోలో నిబంధనల ప్రకారం నలుగురు మాత్రమే వెళ్ళవలసి ఉంది. కానీ వ్యవసాయ కార్మికులు ఆటోలో 25 మంది వరకు సుదూర ప్రాంతాలకు వెళ్తున్నారు. ఒక ట్రాక్టర్లో సుమారు 50 మంది వరకు, టాటా ఏసీ, డీసీఎంలలో కూడా ఇదేవిధంగా వ్యవసాయ కార్మికులు పనుల కోసం వెళ్తున్నారు. వాహనాలలో మోతాదు కి మించి వ్యవసాయ కార్మికులు వెళ్తున్న పోలీసులు కూడా వారికి కౌన్సిలింగ్ ఇచ్చే పరిస్థితి కూడా కనిపించడం లేదు. కొంతమంది డ్రైవర్లు మద్యం మత్తులోనే వాహనాలు నడుపుతున్నారు. అయినా వ్యవసాయ కార్మికులు ఆ వాహనాలలో అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని పొట్టకూటి కోసం వెళ్తున్నారు. ఇదే విషయంపై కొంత మంది వ్యవసాయ కార్మికులను ప్రశ్నించగా ప్రభుత్వం ఉపాధి కల్పించడం లేదు.. తమ తమ గ్రామాలలో ఏ రకమైన పనులు లేవు.. ఇటువంటి పరిస్థితులలో ప్రమాదం అని తెలిసి కూడా పొట్టకూటి కోసం వెళ్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 30 నుంచి 50 మంది వరకు ఒకే వాహనంలో వెళుతుండటంతో కరోనా భయం వీరిని వెంటాడుతూనే ఉంది. కరోనా నిబంధనలను గాలికి వదిలేసి పొట్టకూటి కోసం వెళ్తున్నారు. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియని భయంతో వ్యవసాయ కార్మికులు పడరాని అవస్థలు పాట్లు పడుతున్నారు. ప్రభుత్వం గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ఆయా గ్రామాలలో ఉపాధి పనులు కల్పించాలని, అందుకు తగిన వేతనం ఇవ్వాలని వ్యవసాయ కార్మికులు ముక్తకంఠంతో కోరుతున్నారు.