Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడెం
సింగరేణి కాలరీస్ సంస్థ 2021-22 ఆర్ధిక సంవత్సరం 700 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించాలని, అది విధంగా బొగ్గు రవాణ చేసి చరిత్ర నెలకొల్పాలని సింగరేణి చైర్మెన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్. శ్రీధర్ స్పష్టం చేశారు. శనివారం హైదరాబాద్ సింగరేణి భవన్ నుంచి ఆయన సింగరేణి సంస్థ డైరెక్టర్లు, ఆరు జిల్లాలోని11 ఏరియాల జనరల్ మేనేజర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నిర్ధేశించిన లక్ష్యాలపై ఆయన మాట్లాడుతూ కరోనా వల్ల గత ఏడాది బొగ్గు ఉత్పత్తి, రవాణాలో వెనుకబడి పోయామని, అయితే ప్రస్తుతం కొత్త గనులు ప్రారంభమవడం ,కాంట్రాక్టులు ఖరారు కావడం, బొగ్గుకి డిమాండ్ పెరగడం వంటి పూర్తి అనుకూల పరిస్థితులు ఏర్పడినందున ఈ ఏడాది రికార్డు స్థాయిలో బొగ్గు ఉత్పత్తి, రవాణా, టర్నోవర్, లాభాలు సాధించాలని తద్వారా రికార్డు స్థాయి సంక్షేమాన్ని ఉద్యోగులకు అందించాలని నిర్దేశించారు. కొత్త గనులకు సంబంధించి భూసేకరణ, ఆర్ అండ్ ఆర్ సమస్యలపై తాను స్వయంగా 5 జిల్లాల కలెక్టర్లతో మాట్లాడానని, డైరెక్టర్ ఫైనాన్స్ ఎన్.బలరాం కూడా స్వయంగా కలెక్టర్లతో సమావేశం నిర్వహించారని, కలెక్టర్లు తమకు ఇచ్చిన హామీలను అమలు జరపడానికి ఏరియా జిఎం లు ప్రత్యేక చొరవ చూపాలని కోరారు. ఉత్పత్తి లక్ష్యాల సాధనకు ఎటువంటి సమంజసమైన ప్రతిపాదనలు వచ్చినా తాను నిధులు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. సింగరేణి సంస్థ గత ఆరు సంవత్సరాలలో సాధించిన ప్రగతిని కార్మికులకు వివరించడంతో పాటు ఈ ఏడాది సాధించాల్సిన లక్ష్యాల పై ప్రతి ఏరియా జనరల్ మేనేజర్ ఏప్రిల్ మొదటి వారంలో తన పరిధిలోని ప్రతి గనికి వెళ్లి కార్మికులకు స్వయంగా వివరించాలని కోరారు.హైదరాబాద్ కార్యాలయంలో ఆయన తో పాటు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, (కోల్ మూమెంట్) జె. ఆల్విన్, అడ్వైజర్ మైనింగ్ డి.ఎన్. ప్రసాద్, అడ్వైజర్ ఫారెస్ట్రీ సురేంద్ర పాండే, జిఎం కో-ఆర్డినేషన్ అండ్ మార్కెటింగ్ సూర్యనారాయణ పాల్గొన్నారు. కార్పొరేట్ కొత్తగూడెం నుండి డైరెక్టర్ ఆపరేషన్స్, (పా) ఎస్. చంద్రశేఖర్, డైరెక్టర్ ఫైనాన్స్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ ఎన్. బలరాం, డైరెక్టర్ ఇ అండ్ ఎం.డి సత్యనారాయణ అన్ని ఏరియాల జనరల్ మేనేజర్లు పాల్గొన్నారు.