Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తామర, వేశ్యకాంతల చెరువుల అభివృద్ధి
- రూ. 24కోట్ల పీఆర్ నిధులతో రహదారులు
- 247 మందికి రూ. 1.44 కోట్ల సీఎంఆర్ఎఫ్
- సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య
నవతెలంగాణ- సత్తుపల్లి
రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ శుక్రవారం సత్తుపల్లి వచ్చిన సందర్భంగా పట్టణ ఆధునీకరణకు రూ. 30 కోట్లు మంజూరు చేయడం జరిగిందని స్థానిక ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తెలిపారు. శనివారం స్థానిక క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే విలేకర్లతో మాట్లాడారు. కేటీఆర్ మంజూరు చేసిన నిధులతో సత్తుపల్లి పట్టణ ఆధునీకరణకు వినియోగించడం జరుగుతుందన్నారు. ఇప్పటికే పట్టణ శివారు గుడిపాడు సమీపంలో ఉన్న తామర చెరువు ఆధునీకరణకు నిధులు మంజూరై ఉన్నాయన్నారు. ఇప్పుడు మంజూరైన నిధులతో వేశ్యకాంతల చెరువు ఆధునీకరణను చేపట్టడం జరుగుతుందన్నారు. దీంతో పాటు క్రైస్తవ, ముస్లిం, రజక వర్గాలకు సామాజిక పరమైన అవసరాల కోసం ఈ నిధులను కేటాయించడం జరుగుతుందన్నారు. సత్తుపల్లి అభివృద్ధికి నిధులు కేటాయించిన మంత్రి కేటీఆర్‌కు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సండ్ర ధన్యవాదాలు తెలిపారు. నియోజకవర్గంలోని కొన్ని మండలాల్లో నిర్మాణం జరగాల్సి ఉన్న రహదారులకు గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు రూ. 24కోట్లు పీఆర్ శాఖ నుంచి విడుదల చేశారన్నారు. ఈ నిధులతో నియోజకవర్గంలోని సత్తుపల్లి, వేంసూరు, పెనుబల్లి మండలాల పరిధిలో ఉన్న కొన్ని గ్రామాల్లో 34 కిలోమీటర్ల మేర రహదారుల నిర్మాణం చేపడతామన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికి నియోజకవర్గంలోని 247 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి నిధి నుంచి ఫిబ్రవరి, మార్చి నెలలకు సంబంధించి రూ. 1.44 కోట్లు మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో మున్సిపల్ ఛైర్మెన్ కూసంపూడి మహేశ్, ఆత్మ ఛైర్మెన్ శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, మున్సిపల్ వైస్ ఛైర్మెన్ తోట సుజలారాణి, కౌన్సిలర్లు కొత్తూరు ఉమామహేశ్వరరావు, ఎస్కే చాంద్‌పాషా, మట్టా ప్రసాద్, అద్దంకి అనిల్‌కుమార్, డీసీసీబీ డైరెక్టర్ చల్లగుండ్ల కృష్ణయ్య, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు యాగంటి శ్రీనివాసరావు, మోనార్క్ రఫీ, మల్లూరు అంకమరాజు పాల్గొన్నారు.