Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కల్యాణానికి అడ్డుగా మారిన కరోనా
- గతేడాది నుంచి కళ తప్పుతున్న వేడుక
- రూ.2 కోట్లకు పైగా ఆదాయానికి గండి
- 21న భద్రాద్రిలో నిరాడంబరంగా శ్రీరామనవమి
నవతెలంగాణ - ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి:
శ్రీరామనవమి వస్తుందంటే '' కల్యాణ వైభోగమే శ్రీ సీతారాముల కల్యాణమే...' అంటూ భక్తిగీతాలు మార్మోగుతుంటాయి. భద్రాద్రి యావత్ పెళ్లి కళ సంతరించుకుంటుంది. స్వామివారి వివాహం కోసం వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు భద్రాచలం చేరుకుంటారు. వేలాదిమంది భక్తజనం మధ్య మిథిలాస్టేడియంలో శ్రీ సీతారాముల పెళ్లివేడుక రంగరంగ వైభవంగా జరిగేది. ఇవన్నీ కోవిడ్-19కు ముందున్న పరిస్థితులు. కానీ ఇప్పుడు ఈ పెళ్లి కళ తప్పింది. గత ఏడాది నుంచి కరోనా మహమ్మారి రాములోరి పెళ్లికి ఆటంకంగా మారింది. 'శ్రీ సీతారాముల కల్యాణం చూతుము రారండి..' బదులు '...చూతుము రావొద్దు' అని పాడుకోవాల్సిన దుస్థితి వచ్చింది. ఏటా రూ.కోటి ఖర్చుతో స్వామివారి పెళ్లి వేడుక జరిగితే... ఈ కల్యాణం ద్వారా దేవస్థానానికి రూ.2 కోట్ల వరకూ ఆదాయం వచ్చేది. కానీ ఇప్పుడు ఈ ఆదాయంతో పాటు పెళ్లి కళ తప్పనుంది. మిథిలాస్టేడియం బదులు పరిమిత సంఖ్యలో భక్తులతో చిత్రకూట మంటపంలో ఈనెల 21న రాములోరి పెళ్లి జరగనుంది. దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్వామివారికి ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.
ఈ ఏడాది కూడా నిరాడంబరంగానే...
దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలంలో 1969 నుంచి ప్రతియేటా అంగరంగ వైభవంగా జరిగే శ్రీ సీతారాముల కల్యాణం, పట్టాభిషేకం ఈ ఏడాది అర్చకులు, కొద్దిమంది ప్రభుత్వ పెద్దల సమక్షంలో నిరాడంబరంగా జరగనుంది. ప్రతియేటా బ్రహ్మౌత్సవాల్లో భాగంగా స్వామివారి కల్యాణంతో పాటు పట్టాభిషేకం బ్రహ్మాండగా సాగేది. కోవిడ్ నేపథ్యంలో అధికారులు గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా ఆలయ ప్రాంగణంలోని చిత్రకూట మంటపంలో నిరాడంబరంగా నిర్వహించనున్నారు. గతేడాది మార్చి 20 నుంచి లాక్డౌన్ అమల్లోకి రాగా.. ఏప్రిల్ 2న శ్రీరామనవమి వేడుకలు వచ్చాయి. లాక్డౌన్ మూడునెలల పాటు కఠినంగా అమల్లో ఉండటంతో నవమి కళ తప్పింది. కరోనా తగ్గుముఖం పట్టిందని... రాములోరి కల్యాణం ఎప్పటిలాగే కన్నులారా వీక్షించవచ్చని ఎంతో మంది భక్తులు ఆశపడ్డారు. వారందరి ఆశలను అడియాసలు చేస్తూ కరోనా సెకండ్ వేవ్ మొదలవడంతో మళ్లీ గతేడాది మాదిరిగానే నిరాడంబరంగా వివాహం జరపనున్నారు.
- కరోనా ప్రభావంతో రూ.2 కోట్ల ఆదాయానికి గండి...
కరోనా తగ్గుముఖం పట్టడంతో కల్యాణాన్ని వీక్షిద్దామని 700 భక్తుల వరకు ముందుగానే టిక్కెట్లు బుక్‌చేసుకున్నారు. కల్యాణానికి 4,740 టిక్కెట్లు, పట్టాభిషేకానికి 1,400 టిక్కెట్లు ఆన్లైన్లో అందుబాటులో ఉండగా దేవాదాయశాఖ, దేవస్థానం నుంచి ప్రకటన వెలువడటానికి ముందే కల్యాణానికి 699, పట్టాభిషేకానికి 110 టిక్కెట్లు భక్తులు కొనుగోలు చేశారు. కల్యాణం టిక్కెట్ల ద్వారా రూ. 9,26,300, పట్టాభిషేకం టిక్కెట్ల ద్వారా 23,600 ఆదాయం ఆలయానికి వచ్చింది. దీనిలో రూ.5,000 విలువ చేసే ఉభయదాతల టిక్కెట్లు 190 మాత్రమే అందుబాటులో ఉండగా 110 కొనుగోలు చేశారు. వీటి ద్వారా రూ.55 లక్షల ఆదాయం వచ్చింది. రూ.2,000 వీవీఐపీ టిక్కెట్లు 400కు గాను 67 అమ్ముడుపోగా 1,34,000 ఆదాయం సమకూరింది. రూ.1,116 విలువ చేసే సెక్టార్ 1సీ టిక్కెట్లు వందకు వంద అమ్ముడుపోవడం విశేషం. వీటి ద్వారా రూ.1,11,600 ఆదాయం సమకూరింది. ఈ మూడు టిక్కెట్ల ద్వారా లభించిన రూ.7.95 లక్షలను ఆలయం జమ చేసుకుంటుండగా... మిగిలిన సెక్టార్ టికెట్ల ద్వారా వచ్చిన రూ.1.31 లక్షలను తిరిగి భక్తులకు ఇవ్వనున్నట్లు దేవస్థానం ఈవో ప్రకటించారు. కరోనా లేకుండా ఉంటే ఒక్క శ్రీరామనవమి ద్వారానే ఆలయానికి రూ.2 కోట్లకు పైగా ఆదాయం వచ్చి ఉండేది. గతేడాది రూ.19.50 లక్షల వరకు ఆన్లైన్ టికెట్స్ బుక్కాగా సగానికి పైగా సొమ్మును కరోనా కారణంగా వెనిక్కి ఇచ్చారు.
నిరాడంబరంగానే సీతారాముల కల్యాణం- బాణోత్ శివాజీ, ఈవో, భద్రాచలం దేవస్థానం
కోవిడ్-19 నేపథ్యంలో ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఈ ఏడాది కూడా శ్రీ సీతారాముల కల్యాణం నిరాడంబరంగానే నిర్వహిస్తాం. సాధారణ రోజుల్లో నిర్వహించే వివిధ సేవల్లోనూ స్వల్ప మార్పులు చేశాం. స్వామివారి నిత్యం కల్యాణం, అభిషేక టికెట్లను సగానికి తగ్గించాం. ఆర్జిత సేవల్లో సామాజిక దూరం పాటించాలని సూచించాం. కల్యాణోత్సవం, పట్టాభిషేకం కోసం సెక్టార్ టిక్కెట్లు బుక్ చేసుకున్న వారికి నగదును తిరిగి ఇస్తాం. ఎదుర్కోలు ఉత్సవం, కల్యాణోత్సవం, పట్టాభిషేక మహౌత్సవం చిత్రకూట మండపంలో నిర్వహిస్తాం. తిరువీధి సేవలనూ రద్దు చేశాం. రూ.5,000 ఉభయ దాతల టిక్కెట్లు బుక్ చేసుకున్న భక్తులకు కల్యాణోత్సవం రోజున గోత్ర నామాలతో పూజలు చేసి, వస్త్రాలు, తలంబ్రాలు పంపుతాం. రూ.1,116తో బుక్ చేసుకున్న భక్తుల గోత్రనామాలను కూడా కల్యాణం రోజున చదివి, ముత్యాలతో కూడిన తలంబ్రాలు, ప్రసాదాలను పంపుతాం.