Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ముదిగొండ
మండల పరిధిలో మాదాపురం గ్రామపంచా యతీ సర్పంచ్ వేణుగోపాల్ రెడ్డి పంచాయతీ నిధులు దారి మళ్లించాడని ఓ దినపత్రికలో (నవతెలంగాణ కాదు) వచ్చిన కథనంపై ఆయన స్పందించారు. ఆ ఆరోపణల్లో వాస్తవం లేదని శనివారం ఆయన స్వగృహంలో జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామపంచా యతీలో రూ 24 లక్షల రూపాయల నిధులతో 2019 నుండి 2020 వరకు గ్రామంలోనే ప్రజలకు కావలసిన వివిధ కనీస సౌకర్యాలతో పాటు మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. తను రూ 24 లక్షల రూపాయలు ఖర్చు పెడితే 20 లక్షల రూపాయలు దారి మళ్ళించడం అని న్యూస్ ప్రచురించటం హేయమైన చర్య అన్నారు. 2019 ఏప్రిల్ నెల నుండి 2020 మే వరకు నిధులు ఖర్చు చేసిన విషయంపై ఆడిట్ జరిగిందన్నారు. గ్రామపంచాయతీ పాలక వర్గం ఆమోదం లేకుండా ఏ పనీ చేయలేదన్నారు. గ్రామ అభివృద్ధికి కృషి చేస్తున్న తనపై కక్షగట్టి ఉద్దేశపూర్వకంగానే కావాలని అవాస్తవాలను న్యూస్ పేపర్లలో రాయిస్తున్నారని ఆయన తీవ్రంగా విమర్శించారు. గ్రామ పంచాయతీలో ప్రతి పనికి తమ దగ్గర బిల్లు ఉందని, తాము బహిరంగ విచారణకు సిద్ధమేనని ఆయన సవాల్ విసిరారు. గ్రామపంచాయతీ వీధిలైట్లకు రూ లక్ష రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టమన్నారు కానీ ఐదులక్షల రూపాయలు ఖర్చు చేశారని రాయటం ఎంత వరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు.