Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
నష్టాల్లో ఉన్న జిల్లా కేంద్ర సహకార బ్యాంకును లాభాల్లోకి తీసుకు వచ్చామని బ్యాంకు చైర్మన్ కూరాకుల నాగభూషణం తెలిపారు. స్థానిక డీసీసీబీ ప్రధాన కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఈవో అట్లూరి వీరబాబుతో కలిసి మాట్లాడారు. గత ఏడాది తాము పదవీ బాధ్యతలు చేపట్టే నాటికి రూ.7.23 కోట్ల నష్టంతో బ్యాంకు ఉందన్నారు. ఏడాదికాలంలో తాను తీసుకున్న చర్యల కారణంగా రూ.10.89 కోట్ల వృద్ధిలోకి వచ్చిందన్నారు. నికరంగా రూ.3.66 కోట్లు లాభం చేకూరిందని తెలిపారు. గతంలో రూ.116.31 కోట్లున్న వాటాధనం ఏడాదికాలంలో రూ.123.84 కోట్లకు పెంచామని చెప్పారు. రూ.994.03 కోట్ల డిపాజిట్లను రూ.1,053.89 కోట్లకు చేర్చామన్నారు. రుణాల విషయంలోనూ గతంలో రూ.697.39 కోట్లను రూ.791.02 కోట్లకు పెంచామన్నారు. బ్యాంకు లావాదేవీలు తాము పదవీకాలం చేపట్టేనాటికి రూ.2,375.03 కోట్లుండగా దానిని రూ.2,491.37 కోట్లకు పెంచామని తెలిపారు. రుణమొత్తాలను కూడా రూ.1381 కోట్లను రూ.1437.48 కోట్లకు పెంచగలిగామని తెలిపారు. తాము పాలకవర్గం వచ్చాక బ్యాంకు పురోభివృద్ధిలో పయనిస్తోందన్నారు.
7వ తేదీ నుంచి పదోన్నతులు
జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో ఈనెల 7వ తేదీ నుంచి పదోన్నతుల ప్రక్రియను చేపట్టనున్నట్లు చైర్మన్ తెలిపారు. బ్యాకింగ్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా 70 ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేసే ప్రక్రియను కూడా నిర్వహించనునÊ్నట్లు తెలిపారు. రబీ కాలంలో సహకార సంఘాల ద్వారా ధాన్యం కొనుగోలు నిర్వహిస్తామన్నారు. ఈ సమావేశంలో డీఆర్ఓఎస్డీ కె.వెంకటేశ్వర్లు, డీజీఎం వేణుగోపాల్ పాల్గొన్నారు.