Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- సత్తుపల్లి
అర్హులైన పేదలందరికీ రేషన్ కార్డులు అందించాలని, రేషన్ దుకాణాల్లో 16 రకాల నిత్యావసర సరుకులు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పొన్నం వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. ఆదివారం సత్తుపల్లిలోని మదర్ థెరెసా టెక్నో స్కూలులో రేషన్ కార్డులు- నిత్యావసర సరుకులు అనే అంశంపై జరిగిన అఖిలపక్ష సమావేశంలో పొన్నం ముఖ్య వక్తగా పాల్గొని ప్రసంగించారు. గత రెండేండ్లుగా కరోనా కారణంగా పనులు దొరక్క పేదలు, వలస కార్మికులు, కొత్తగా కుటుంబాల నుంచి వేరుబడిన కుటుంబాలకు రేషన్ కార్డులు లేక, బియ్యం, నిత్యావసరాలు కొనలేక నానా అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రేషన్ కార్డులు అందిస్తామంటూ ప్రభుత్వం పదేపదే ప్రకటనలు చేస్తుందే తప్ప కార్డులు అందించే కార్యక్రమం చేపట్టక పోవడం శోచనీయమన్నారు. కుటుంబ సర్వే జరిపించి అర్హులైన వారికి రేషన్ కార్డులు అందించి ఆదుకోవాలన్నారు. బోగస్ కార్డులు ఉన్నాయంటూ సాకులు చూపెడుతూ కార్డులు అందించే కార్యక్రమాన్ని జాప్యం చేస్తున్నారన్నారు. చౌకడిపో బియ్యం బ్లాక్ మార్కెట్‌కు తరలుతున్నా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఆధార్ కార్డులో సంబంధం లేకుండా కార్డులు అందించే కార్యక్రమాన్ని వెంటనే చేపట్టాలన్నారు. ప్రతి 600 కుటుంబాలకు ఓ చౌక దుకాణం ఏర్పాటు చేయాలన్నారు. వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసే వ్యవసాయ చట్టాలు, ఆహార భద్రతను దెబ్బతీసే చట్టాలను వెంటనే రద్దు చేయాలన్నారు. రైతుసంఘం జిల్లా కార్యదర్శి మాదినేని రమేశ్ మాట్లాడుతూ 2013 ఆహార భద్రత చట్టాన్ని అమలు చేయడం లేదన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాన్నంటుతున్నాయన్నారు. పేదలు జీవనం సాగించలేని స్థితికి ప్రభుత్వాలు తీసుకురావడం దుర్మార్గమన్నారు. పెట్ర ధరలు పెంచి పేద, మధ్య తరగతి ప్రజలపై మరింత భారం మోపుతున్నారన్నారు. ధరలను నియంత్రించే స్థితిలో ప్రభుత్వాలు లేకపోవడం బాధాకరమన్నారు. వ్యకాస రాష్ట్ర కమిటీ సభ్యులు జాజిరి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో కాంగ్రెస్ మండల , పట్టణ అధ్యక్షులు శివా వేణు, కొర్రపాటి సాల్మన్‌రాజు, టీడీపీ నాయకులు బొంతు శ్రీనివాసరావు, పీడీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అమర్లపుడి శరత్, రైతు సంఘం మండల కార్యదర్శి రావుల రాజబాబు, ఎమ్మార్పీఎస్ జాతీయ కార్యదర్శి కొలికపోగు వెంకటేశ్వరరావు, సీఐటీయూ మండల కార్యదర్శి కొలికపోగు సర్వేశ్వరరావు, డీవైఎఫ్ఐ నాయకులు తడికమళ్ల రామకృష్ణ, అర్జునరావు, కువ్వారపు లక్ష్మణరావు పాల్గొన్నారు.