Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుమ్ముగూడెం
గిరిజనులు ఏండ్ల తరబడి పోడు కొట్టి సాగు చేసుకుంటున్న పోడు భూములకు తెలంగాణ ప్రభుత్వం పరిష్కార మార్గం చూపక పోవడం వలన పోడు సాగుదారులు తమ గోడు ఎవరికి చెప్పుకోవాలంటూ అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓట్లేసి గెలిపించిన ప్రజా ప్రతినిధులు ఇటు వైపు కన్నెత్తి కూడా చూడడం లేదని ఆరోపిస్తున్నారు. ఈ సారి ఓట్ల కోసం వస్తే వారికి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరికలు చేస్తున్నారు. దుమ్ము గూడెం అటవీ రేంజి పరిధిలోని సుజ్ఞ్నాపురం బీట్ పరిధిలో గల తోగ్గూడెం గిరిజన గ్రామ సరిహద్దులో గల సుమారు 11 హెక్టార్ల ప్రభుత్వ భూమిలో హరితహారం మొక్కలు వేసేందుకు ఫారెస్టు అధికారులు ఆదివారం డోజర్లతో అక్కడికి వెళ్లారు. విషయం తెలుసుకున్న పైడిగూడెం, తోగ్గూడెం గిరిజన గ్రామాలకు చెందిన గిరిజన మహిళా రైతులు అక్కడకు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. తాము ఏండ్ల తరబడి పోడు కొట్టి సాగు చేసుకుంటున్నామని హరిత మొక్కలు పోడు భూముల్లో వేయడానికి వీలు లేదని పనులను అడ్డగించారు. దీంతో ఫారెస్టు సిబ్బంది వారికి నచ్చ చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ వారు ససేమిరా అన్నారు. కొద్ది గంటలు ఆగిన తర్వాత తిరిగి డోజర్ల సహాయంతో హరిత పనులు చేస్తున్న సమయంలో మహిళలు ఒక్క సారిగా డోజర్ల ముందు నిల్చొని పనులు జరగకుండా అడ్డుకున్నారు. ''మేము చావ నైనా చస్తాం.... కాని పోడు భూములు వదులుకునేది లేదని హెచ్చరించారు.'' ఓ మహిళా రైతు డోజర్ ముందు కూర్చొని చావనైనా చస్తాను కాని భూములను వదులుకోం అంటూ భీష్మించుక కూర్చుంది. దీంతో మహిళా ఫారెస్టు సిబ్బంది ఆమెను బలవంతంగా ఈడ్చుకుంటూ బయటకు లాగేశారు. ఆ సమయంలో ఫారెస్టు సిబ్బందికి గిరిజన మహిళా రైతుల మద్య కొంత వాగ్వివాదం చోటు చేసుకుంది. పిల్లా పాప లతో పోడు భూముల వద్ద చావనైనా చస్తాం గాని పోడు భూములను ఎట్టి పరిస్థితుల్లో వదులుకునేది లేదని గిరిజన మహిళా రైతులు నవతెలంగాణ ముందు వాపోయారు. కాగా ఈ విషయమై డీఆర్ఓ అప్సరున్నీసా బేగంను నవతెలంగాణ వివరణ కోరగా శాటిలైట్ ఆధారంగా గుర్తించిన ప్రభుత్వ భూముల్లో మాత్రమే హరితహారంలో భాగంగా మొక్కలు వేయడం జరుగుతుందని, తాము పోడు భూముల జోలికి వెళ్లడం లేదని తెలిపారు.