Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మం
ఖమ్మం : బాబూ జగ్జీవన్ రామ్ దేశానికి, దీనజనరోద్ధరణకు, దళితుల అభ్యున్నతికి చేసిన సేవలు భావి తరాలకు తెలియచేసే విధంగా రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాల సంక్షేమ కార్యక్రమాలతో ముందుకెళ్తున్నామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయకుమార్ తెలిపారు. బాబూ జగ్జీవన్ రామ్ 114వ జయంతి పురస్కరించుకొని నగరంలోని తెలంగాణ తల్లి సర్కిల్లో గల బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహానికి మంత్రి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఏప్రిల్ 14న భారతరత్న డాక్టర్.బి.ఆర్.అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని జెడ్.పి సెంటర్ లో గల ప్రస్తుత విగ్రహానికి బదులుగా 14 అడుగుల అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో పాటు జడ్పీ సెంటర్‌ను అంబేద్కర్ సెంటర్‌గా నామకరణం చేసేందుకు నిర్ణయించినట్లు ఈ సందర్భంగా మంత్రి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఆర్.వి.కర్ణన్, జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమలరాజు, శాసనమండలి సభ్యులు బాలసాని లక్ష్మీనారాయణ, సుడా చైర్మన్ బచ్చు విజరు కుమార్, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి కె.సత్యనారాయణ, సంఘం నాయకులు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
గాంధీచౌక్ : బైపాస్ రోడ్ లోని జగ్జీవన్ రామ్ విగ్రహానికి గురుకుల విద్యాసంస్థల రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ కె శారద పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అనగారిన వర్గాల కోసం బాబు జగ్జీవన్ రామ్, భారతరత్న డాక్టర్.బి.ఆర్.అంబేద్కర్ వంటి అనేకమంది మహనీయులు తమ ప్రాణాలను తృణప్రాయంగా పెట్టి దేశ అభివృద్ధి కోసం కృషి చేశారని కొనియాడారు. ఇటువంటి త్యాగధనుల ఆశయాలు ఆలోచనలు నేటి తరానికి ఆదర్శం అన్నారు. ఈ కార్యక్రమంలో స్వేరోస్ పిజిపిఎ అనుబంధ సంఘాల నేతలు మందుల వెంకన్న, శీలం ప్రసాద్, ఉదరు, నాగేశ్వరరావు, టిజి పిఏఏ రాష్ట్ర నాయకులు పివి వీరస్వామి, జగదీష్, గుద్దేటి రమేష్ బాబు పాల్గొన్నారు.
సత్తుపల్లి : దళితుల అభ్యున్నతి కోసం మాజీ ఉప ప్రధానమంత్రి బాబూ జగ్జీవన్‌రామ్ అందించిన సేవలు మరువలేనివని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. జగ్జీవన్‌రామ్ 113 జయంతిని ఖమ్మంలోని తన స్వగృహంలో సోమ వారం ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సండ్ర మాట్లాడుతూ స్వాతంత్రోద్యమంలో పాల్గొంటూనే దళితుల అభ్యున్నతి కోసం పాటుపడ్డారని కొనియాడారు.
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో...
స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ ఛైర్మెన్ కూసంపూడి ఆధ్వర్యంలో బాబూ జగ్జీవన్‌రామ్ జయంతిని జరిపారు. చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు గాదె సత్యనారాయణ, డీసీసీబీ డైరెక్టర్ చల్లగుండ్ల కృష్ణయ్య, కౌన్సిలర్లు అద్దంకి అనిల్‌కుమార్, ఎస్కే చాంద్‌పాషా, మారుతి సూరిబాబు, మల్లూరు అంకమరాజు, మేకల నరసింహారావు, కంటె అప్పారావు, రామిశెట్టి కృష్ణ పాల్గొన్నారు.
వివిధ పార్టీలు, సంఘాల ఆధ్వర్యంలో...
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని బాబూ జగ్జీవన్‌రామ్ 113 జయంతిని జరిపారు. స్థానిక జగ్జీవన్‌రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పట్టణ, మండల అధ్యక్షులు శివా వేణు, కొర్రపాటి సాల్మన్‌రాజు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోళ్ల అప్పారావు, దేవళ్ల పెద్దిరాజు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీలోని మరో వర్గం ఆధ్వర్యంలో జయంతిని జరిపారు. కార్యక్రమంలో పీఏసీఎస్ వైస్ ఛైర్మెన్ గాదె చెన్నకేశవరావు, పింగుల సామ్యూల్ పాల్గొన్నారు. దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో బాబూ జయంతిని జరిపారు. కార్యక్రమంలో మంద వెంకటేశ్వర్లు, దండు ఆది నారాయణ, తడికమళ్ల యేబు పాల్గొన్నారు. బీజేఆర్ మెమోరియల్ వెల్ఫేర్ సర్వీస్ సొసైటీ అధ్యక్షుడు తాటికొండ పురుషోత్తం ఆధ్వర్యంలో జగ్జీవన్‌రామ్ జయంతిని జరిపారు.
నేటి యువత జగ్జీవన్ రామ్ ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలి : కేవీపీఎస్
ఖమ్మంరూరల్ : నేటి యువత బాబు జగ్జీవన్ రామ్‌ను ఆదర్శంగా తీసుకోవాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సమితి(కెవిపిఎస్)రాష్ట్ర కమిటీ సభ్యులు కొమ్ము శ్రీను అన్నారు. మండలంలోని చింతపల్లి గ్రామంలో సోమవారం బాబు జగ్జీవన్ రావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాబు జగ్జీవన్‌రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కొమ్ము శ్రీను మాట్లాడుతూ కెవిపిఎస్ ఆధ్వర్యంలో పూలే, అంబేద్కర్ సందేశ యాత్ర పేరుతో సోమవారం నుంచి ఈ నెల మొత్తం మండలంలోని దళిత వాడలు తిరుగుతూ ప్రజలను చైతన్య పరుస్తూ యాత్రను కొనసాగిస్తామని, ఈ యాత్రను జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో కెవిపిఎస్ మండల కార్యదర్శి పాపిట్ల సత్యనారాయణ, మండల అధ్యక్షుడు కుక్కల సైదులు, నాయకులు వీరభద్రం, రమణ, అచ్చయ్య, పుల్లారావు, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.