Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గాంధీ చౌక్
మహిళలు పోలీసు స్టేషన్‌కు వచ్చి తమ సమస్యలు చెప్పుకునేందుకు జంకుతున్న వేళ రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి పోలీసు స్టేషన్ లో మహిళల కోసం ప్రత్యేకంగా ఉమెన్స్ హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అక్కడ మహిళా పోలీసులే ఉండేలా రూపకల్పన చేశారు. దీంతో ఖమ్మం జిల్లాలో మొత్తం 23 పోలీస్ స్టేషన్లలో వీటిని ఏర్పాటు చేశారు. ఒక్కో డెస్క్‌కు ఇద్దరు మహిళా పోలీసులను కేటాయించారు. వారికి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారు. తమ సమస్యలను చెప్పుకునేందుకు స్టేషన్‌కు వచ్చే మహిళలతో ఎలా వ్యవహరించాలి, వారిలో భయం పోగొట్టి సమస్యను ఎలా తెలుసుకోవాలనే దానిపై శిక్షణ ఇచ్చారు.
మహిళలను గౌరవంగా సంబోధించే వాతావరణం కల్పిస్తూ వారు తమ సమస్యను నిర్భయంగా చెప్పడానికి, న్యాయ సహాయం, కౌన్సెలింగ్, ఆశ్రయం, పునరావాసం సులభతరం చేయడానికి జిల్లాలోని 23 పోలీసు స్టేషన్లో ఉమెన్స్ హెల్ప్ డెస్క్ లను ఏర్పాటు చేశారు.స్టేషన్ లోని ఓ ప్రత్యేక ప్రదేశంలో వీటిని ఏర్పాటు చేశారు. వారికి ఓ భరోసా, నమ్మకం, స్వేచ్ఛ ఇవన్నీ ఉమెన్స్ హెల్ప్ డెస్క్ వద్ద లభిస్తాయని పోలీసులు భరోసా ఇస్తున్నారు.
మహిళలు, యువతులు వారు ఎదుర్కొంటున్న సమస్యలు ముఖ్యంగా ఈవ్ టీజింగ్, ఉమెన్ ట్రాఫికింగ్ వేధింపులు, బయటకు చెప్పుకోలేని సమస్యలను ఇక్కడ పరిష్కరించుకోవచ్చు. ఫిర్యాదీ మహిళ గౌరవానికి భంగం కలగకుండా, పేరు, వివరాలు బయటకు రాకుండా సమస్యను పరిష్కరించడం ఇక్కడి సిబ్బంది బాధ్యత. ఇంట్లో కుటుంబ సభ్యుల వేధింపులు(డొమెస్టిక్ వాయిలెన్స్), బాలికల రక్షణ, పోక్సో చట్టం కింద కేసులు, ప్రేమ పేరుతో మోసానికి గురికావడం వంటి తదితర సమస్యలకు ఇక్కడ సహాయం పొందవచ్చు.