Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సందర్శించినా ప్రయోజనం శూన్యం
- పేదలకు అందని వైద్యం
- నిరుపయోగంగా పరికరాలు
- మూలపడ్డ అంబులెన్స్
- స్పందించని జిల్లా వైద్యాధికారి
- నేడు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం
నవతెలంగాణ-ఇల్లందు
ప్రభుత్వ వైద్యశాల తీరని సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. ప్రతీ యేటా అనారోగ్య దినోత్సవమే జరుపుకోవాల్సి వస్తోంది. ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ఏప్రిల్-7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవం నిర్వహిస్తోంది. ప్రస్తుతం ఆనవాలు కూడా కనపడటంలేదు. దీంతో ప్రజలు రోగాల నుండి కోలుకోలేక పోతున్నారు. ఇల్లందు ప్రభ్వు వైద్యశాలకు రెండు దశాబ్దాలుగా తీరని సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది.
ఉమ్మడి ఏపీలో ఉన్న సమస్యలు తెలంగాణ వచ్చినా కొనసాగుతూనే ఉన్నాయి. 1976లో అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు 14 పడకల వైద్యశాలను ప్రారంభించారు. సుదీర్ఘ పోరాటాల ఫలితంగా ప్రభుత్వం 2009లో రూ.3 కోట్లతో భవనం విస్తరింపజేశారు. 30 పడకల వైద్యశాలగా అప్గ్రేడ్ చేశారు. ఐపీహెచ్ఎస్ 2007 ప్రకారం లక్షపైగా జనాభా ఉన్నచోట వంద పడకల వైద్యశాలగా మార్చాలని కేంద్రం ఆదేశించినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడంలేదు.
ప్రతి వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలని, ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ ధ్యేయం అంటూ కాంగ్రెస్ హయాంలో రాష్ట్ర ఆరోగ్య కుంటంబ సంక్షేమ శాఖ మాత్యులుగా ఉన్న సంభాని చంద్రశేఖర్, తెలంగాణ రాష్ట్రం ఏర్పడి సిఎం కేసిఆర్ పగ్గాలు చేపట్టిన అనంతరం 2014 జూన్ 25న అప్పటి ఉపముఖ్యమంత్రి, రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజయ్య, నాటి ఎంపి సీతారాం నాయక్, నాటి ఎంఎల్ఏ కోరం కనకయ్య, నేటి ఎంఎల్ఏ హరిప్రియ 30 పడకల వైద్యశాలను సందర్శించారు. సూపర్ స్ఫెషాలిటీ, వంద పడకల వైద్యశాలగా మారుస్తామని, ఖాళీలు భర్తీ చేస్తామని కిక్కిరిసిన విలేకర్ల సమావేశలో ప్రకటించారు. 2015లో అప్పటి మంత్రి రాజయ్య, 2016లో నాటి మంత్రి లక్ష్మారెడ్డి ఇచ్చిన ఉపన్యాసాలు గాలి మాటలే అని తేలింది. ప్రస్తుత వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ 2019లో ఇల్లందు మీదుగా కొత్తగూడెం వెళ్ళినా వైద్యశాల ముఖం చూడలేదని ప్రజలంటున్నారు.
గర్భిణీలకు అత్యవరంగా పెద్దాప రషన్స్ చేయాల్సి వస్తే, సీరియస్గా ఉన్న రోగులు సైతం ఖమ్మం, కొత్తగూడెం తరలించాల్సిందే. మార్గ మధ్యంలో మృతిచెందినవారు రెండు దశాబ్దాలలో అనేకం. గత 5 సంవత్సరాల నుండి కుటుంబ నియంత్రణ ఆపరేషన్స్ నిర్వహించడంలేదు. దీనికి తోడు వైద్యపరికరాలు మొరాయిస్తున్నాయి. ము ఖ్యంగా సివిల్ సర్జన్, గైనకాలజిస్ట్, మత్తు వైద్యుల పోస్టులు ఖాళీగా ఉండటంతో ఆపరేషన్ థియేటర్, మత్తుఇచ్చే రూం గదులకు తాళాలు వేశారు. దీనితో పరికరాలు నిరుపయోగంగా ఉన్నాయి.
వైద్యుల కొరతతో ఖాళీగా ఉన్న పోస్టులు
వైద్యశాలకు 10 మంది డాక్టర్స్ అవసరం కాగ ఒకరు పర్మినెంట్, ఇద్దరు కాంట్రాక్ట్ బేసిక్ డాక్డర్స్ తప్ప మిగిలిన పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సివిల్ సర్జన్, మత్తు డాక్టర్ పోస్టులు గత 20 సంవత్సరాలుగా భర్తీకి నోచుకోవడం లేదు. మరో 2 అసిస్టెంట్స్ సివిల్ సర్జన్ పోస్టులతో పాటుగా గైనకాలజిస్ట్, లేడీ డాక్డర్, పిల్లల వైద్యనిపుణులు, ఒక ల్యాబ్ టెక్నిషియన్, వార్డుబార్సు ఇద్దరు, ఫీమేల్, స్వీపర్, నైట్ వాచ్మెన్, వాటర్బారు, ఎల్టీ తదితర అనేక రకాల పోస్టులు ఖాళీగా పడి ఉన్నాయి. తాత్కాలికంగా కొందరిని నియమిం చుకుని యేడాదిలో వచ్చే ఫండ్ నుండి అంతోఇంతో వేతనాలు ఇస్తున్నట్లు తెలిసింది. వీటిని భర్తీ చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవరిస్తోందని ప్రజలు ఆరోపిస్తున్నారు.
మందులు, ఎక్స్రే ఫిలీంల కొరత... రోగుల ఇబ్బందులు
ప్రభుత్వం బడ్జెట్లో కోతలు విధించ డంతో తరచు మందుల కొరత ఎక్స్రే ఫిలీంల కొరత ఏర్పడుతోంది. యాంటి బేటిక్, కాఫ్ సిరప్స్, మెట్రోజిల్, ట్యాక్స్, పాంటాప్, క్లావం తదితరాలు సక్రమంగా సరఫరా కావడం లేదు. 193 రకాల మందులు సరఫరా కావాల్సి ఉండగా కేవలం 45 రకాల మందులు మాత్రమే సప్లై అవుతున్నట్లు తెలిసింది. కొన్ని సందర్భాలలో సిరంజీల కొరత ఏర్పడటంతో రోగులు బయట మెడికల్ షాపుల్లో మందులు కొనాల్సి వస్తోంది.
తగ్గుతున్న రోగుల సంఖ్య.. ఖాళీగా 30 పడకలు
వైద్యశాలకు పటిష్టమైన భవనం, గదులు ఉన్నప్పటికి మౌళిక వసతులు, వైద్యుల కొరత ఉండటంతో రోజురోజుకు రోగుల సంఖ్య తగ్గుతోం ది. ఇల్లందు, వైరా, పినపాక నియెజవర్గాల మం డలాలైన టేకులపల్లి, ఇల్లందు, కామేపల్లి, కారేపల్లి, గార్ల, బయ్యారం, గుండాల మండలాలలోని అనేక ఏజెన్సీ గ్రామాలకు ఇల్లందు పెద్దాసుపత్రియే దిక్కు. రోజుకు 600 పైన వచ్చే ఔట్ పేషంట్స్ రోగుల సంఖ్య నేడు క్రమంగా తగ్గుతోంది. సాధారణ కేసులే జిల్లా కేంద్రానికి రిఫర్ చేస్తుండటంతో 30 పడకల బెడ్స్ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. వివరణ కోరేందుకు ప్రయత్నింగా జిల్లా వైద్యాధికారి డా.భాస్కర్ నాయక్ స్పందించలేదు.