Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అదనపు కలెక్టర్ అనుదీప్
నవతెలంగాణ-కొత్తగూడెం
జిల్లాలో ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, సర్పంచుల ఎన్నికల నిర్వహణలో ఓటరు జాబితాలో అభ్యంతరాలుంటే తెలియచేయాలని అదనపు కలెక్టర్ డి.అనుదీప్ తెలిపారు. మంగళవారం అదనపు కలెక్టర్ చాంబర్ నందు ఓటర్లు జాబితాలో అభ్యంతరాలు, పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటరు జాబితాను రాజకీయ పార్టీల ప్రతినిధులకు అందచేయడం జరిగిందని, ఆ ప్రకారం జాబితాలో ఏవేని అభ్యంతరాలుంటే రాత పూర్వకంగా సంబంధిత ఎంపీడీఓ కార్యాలయంలో అందచేయాలన్నారు. బుధవారం ఆయా ఎంపీడీఓల కార్యాలయాల్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి ఓటరు జాబితాలో అభ్యంతరాలను తెలియచేయు విధంగా సమావేశం నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎన్నికలు జరుగనున్న 18 మండలాల్లో 12 ఎంపిటిసి, 48 వార్డు సభ్యులకు 6 సర్పంచులకు ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పారు. ఓటరు జాబితాలో అభ్యంతరాలు తెలిపేందుకు ఈ నెల 8వ తేదీ వరకు ఓటరు జాబితాలో అభ్యంతరాలపై ఫిర్యాదు చేయుటకు అవకాశం ఉన్నదని వచ్చిన అభ్యంతరాలను ఈ నెల 10వ తేదీ నాటికి పరిష్కరించు విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. తుది ఓటరు ముసాయిదా ఈ నెల 12 తేదీన ప్రచురించడం జరుగుతుందని చెప్పారు. గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ ఎన్నికల్లో తప్పులు లేని ఓటరు జాబితా రూపకల్పనలో అన్ని రాజకీయ పార్టీలు, ప్రజలు సహకరించాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో డీపీఓ రమాకాంత్, జడ్పీ సిఈఓ విద్యాలత, వివిధ పార్టీల నాయకులు కాంగ్రెస్ నుండి మోతుకూరి ధర్మారావు, సీపీఐ నుండి సాబీర్ పాష, సీపీఐ(ఎం) నుండి మచ్చా వెంకటేశ్వర్లు, బీఎస్సీ నుండి మాలోత్ వీరునాయక్ పాల్గొన్నారు.