Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ముదిగొండ
బీజేపీకి ప్రత్యామ్నాయం సీపీఐ(ఎం)యేనని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చెప్పారు. పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం మచ్చా వీరయ్య భవనంలో వెంకటాపురం, ముదిగొండ గ్రామాల నుంచి సీనియర్ నాయకులు రాయల వెంకటేశ్వర్లు, వెంకటాపురం మాజీ సర్పంచ్ బంక వెంకటేశ్వర్లుతో పాటు 15 కుటుంబాలవారు సీపీఐ(ఎం)లో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. రాయల వెంకటేశ్వర్లుతో పాటు ముదిగొండ, వెంకటాపురం గ్రామాల నుండి 15 కుటుంబాల వారు పార్టీలో చేరడం అభినందనీయమన్నారు. ప్రజా ఉద్యమాలకు, పోరాటాలకు వేదికగా నిలిచిన ముదిగొండ మండలం పార్టీకి పెట్టిన కోటగా నిలిచిందన్నారు.
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం దుర్మార్గమైన చట్టాల తీసుకొచ్చి ప్రజలపై నిర్బంధాలు ప్రయోగించి, ఎదురుతిరిగిన వారిపై దేశద్రోహి అని ముద్రవేసి జైల్లో పెడుతున్నారని ఆయన బీజేపీ విధానాలపై తీవ్రంగా ధ్వజమెత్తారు. దేశం మొత్తం కష్టాల్లో ఉన్నదని 136 కోట్ల ప్రజలు బాధలతో సతమతమవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను బీజేపీ ప్రభుత్వ ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ అమ్మకానికి పెట్టిందన్నారు. సంసారాన్ని చక్క దిద్దేది మహిళని ఆమహిళా దేశ ఆర్థిక మంత్రిగా ఉండి దేశ సంపదను కొల్లగొడుతూ కార్పొరేట్లకు కారుచౌకగా కట్టబెట్టి దేశ విచ్ఛిన్నానికి, వినాశనానికి పాటుపడుతుందని ఆయన మండిపడ్డారు. బీజేపీ పాలిత రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటకలో దుర్మార్గమైన ప్రజా వ్యతిరేక చట్టాలను తీసుకువచ్చి పాలనను కొనసాగిస్తున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో కేసీఆర్ నక్క వినయాలు చేస్తూ ఢిల్లీ కెళ్ళి అమిత్షా, మోడీ కాళ్ళ మీదపడి సాష్టాంగ నమస్కారాలు చేసొచ్చి రాష్ట్రంలో సాగు చట్టాలు మంచిదే అని రైతులు పంటను కొనుగోలు చేయమని కేసీఆర్ ప్రకటించారన్నారు. ఎమ్మెల్సీ ఉపఎన్నిక గారడిలో భాగంగా రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని, ఉద్యోగ ఉపాధ్యాయలకు పిఆర్సి పెంచుతానని కేసీఆర్ గాలమేసి సరికొత్త డ్రామాకు తెరలేపారన్నారు.
పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ మాట్లాడుతూ పార్టీలోకి వస్తుంటారు పోతుంటారు కానీ రాయల వెంకటేశ్వర్లు వృద్ధాప్యంలో కూడా పార్టీలో చేరటం ప్రాధాన్యతను సంతరించుకుందన్నారు. రాయల పార్టీకి దూరంగా ఉండటం కొంత బాధాకరం, మరికొంత నష్టదాయకం కలిగిందన్నారు.
సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు పొన్నం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రస్తుత రాజకీయ పరిణామాల మధ్య కమ్యూనిస్టు వైపు దేశ రాష్ట్ర ప్రజల చూపు మళ్లిందన్నారు. రాజకీయ అనుభవం ప్రజలతో సంబంధాలు కలిగిన రాయల వెంకటేశ్వర్లు మరల పార్టీలో చేరటం హర్షించదగ్గ విషయమన్నారు.పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు మాట్లాడుతూ రాయల వెంకటేశ్వర్లు తన శేష జీవితాన్ని పార్టీలో గడపటం అభినందనీయమన్నారు. పార్టీ జిల్లా నాయకులు బండి రమేష్ మాట్లాడుతూ రాయల వెంకటేశ్వర్లు, రావెళ్ళ సత్యం వర్ధంతి సభలో మాట్లాడుతూ ఒక చారిత్రక తప్పిదాన్ని చేసినని ఆయన నిగర్వంగా ఒప్పుకోవటం ఆయనకున్న నిలువెత్తు నిజాయితీకి నిదర్శనమన్నారు. రాయల వెంకటేశ్వర్లు సతీమణి కమలమ్మ చనిపోయిన తర్వాత ఆమె బంగారాన్ని తన కూతురు కొడుకుల పిల్లలకు సమానవాటాతో పాటు తన ఇంట్లో పనిచేసిన దళిత మహిళను తన కూతురుగా భావించి బంగారం పంచటం రాయల గొప్పతనంమన్నారు. పార్టీలో చేరిన రాయల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తన శేషజీవితాన్ని పార్టీలోనే గడుపుతూ తుదిశ్వాస వరకు పార్టీలోనే ఉంటూ ప్రజల కోసం పని చేస్తానన్నారు.
పార్టీ మండల కార్యదర్శి వాసిరెడ్డి వరప్రసాద్ అధ్యక్షతన జరిగిన సభలో నవతెలంగాణ దినపత్రిక జనరల్ మేనేజర్ మన్నేపల్లి సుబ్బారావు, పార్టీ జిల్లా నాయకురాలు బండి పద్మ, చింతలచెరువు కోటేశ్వరరావు, పార్టీ మండల నాయకులు వేల్పుల భద్రయ్య, టీఎస్ కళ్యాణ్ కందుల భాస్కర్ రావు, కొల్లేటి ఉపేందర్, మంకెన దామోదర్, బట్టు పురుషోత్తం, మరలపాటి కోటేశ్వరరావు, పయ్యావుల ప్రభావతి, పయ్యావుల పుల్లయ్య, రవికుమార్, పి రాంబాబు, ఎంపీటీసీలు కోలేటి అరుణ, జయమ్మ, ఇరుకు నాగేశ్వర రావు, సూరపల్లి నాగరాజు, ఊటుకూరి నాగేశ్వరరావు, చింతకాని, నేలకొండపల్లి, తిరుమలా యపాలెం పార్టీ మండల కార్యదర్శులు మడుపల్లి గోపాలరావు, గుడవర్తి నాగేశ్వరరావు, అంగిరేకుల నరస య్య, రైతు సంఘం జిల్లా కార్యదర్శి మాదినేని రమేష్, నవతెలంగాణ డివిజన్ ఇంచార్జి గుమ్మడి నరసయ్య పాల్గొన్నారు.
భారీ ర్యాలీ
సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో వెంకటాపురం రాయల వెంకటేశ్వర్లు ఇంటి వద్ద నుండి మచ్చ వీరయ్య భవనం వరకు కార్యకర్తలు నాయకులు ఎర్రజెండాలతో నినాదాలు ఇస్తూ భారీ ర్యాలీ కళ నృత్యంతో కొనసాగింది. తొలుత వెంకటాపురం గ్రామంలో నాలుగు సెంటర్లలో పార్టీ పతాకాన్ని రాయల వెంకటేశ్వర్లు, చింతలచెరువు కోటేశ్వరరావు, వాసిరెడ్డి వరప్రసాద్, బంక వెంకటేశ్వర్లు ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు బలంతు యుగేందర్, డివైఎఫ్ఐ మండల అధ్యక్ష కార్యదర్శులు బట్టు రాజు, మెట్టెల సతీష్ పాల్గొన్నారు.