Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రణాళిక లోపంతో బస్టాండ్‌లో ట్రాఫిక్ కష్టాలు
- ప్రజల అవస్థలు పట్టించుకోని మంత్రి, అధికారులు
నవతెలంగాణ-ఖమ్మం
త్వరలో జరగనున్న ఖమ్మం కార్పోరేషన్ ఎన్నికలో గెలుపే లక్ష్యంగా రాష్ట్ర రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజరుకుమార్, మంత్రి కేటీఆర్‌తో ఆర్భాటంగా నగరంలో రూ.25 కోట్లతో నిర్మించిన అధునాతన బస్టాండ్‌ను ప్రారంబించారు. కేవలం ఎన్నికల లబ్ధికోసమే తప్ప ప్రయాణికుల సంక్షేమం, బస్సుల ట్రాఫిక్ వంటి అంశాలను కనీసం పట్టించుకోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. విశాలమైన బస్టాండ్ నిర్మించామని గొప్పలు చెబుతున్న మంత్రి కనీసం బస్టాండ్ లోపల బస్సుల ఫ్రీగా తిరిగే విధంగా స్థలం కేటాయించకపోవడం పట్ల డ్రైవర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
పార్కింగ్ ఇబ్బందులు ...
బస్టాండ్‌లో ఒక బస్సు పాయింట్లో ప్రయాణికులను ఎక్కించుకొని రివర్స్ తిరిగే సమయంలో దాని వెనుక మరో బస్సు వస్తుంది. అది వెనుకకు వెళ్లడానికి స్థలం లేదు. దీంతో బస్సుల తిరిగి వెళ్లే సమయంలో ఇబ్బందులు తప్పడం లేదని, పాత బస్టాండ్‌లో కొంచెం నయమని, కొత్త బస్టాండ్‌లో వచ్చిన తరువాత తమకు మరిన్ని కష్టాలు మొదలయ్యయని డ్రైవర్లు వాపోతున్నారు.
దోమలు, ఉక్కపోతో సతమతం...
బస్టాండ్ అయితే విశాలంగా ఉందిగాని. ఎక్కడా ఒక్క ఫ్యానూ లేదు. రాత్రులు దోమలు తో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అసలే ఎండకాలం కవడంతో రేకుల వేడికి ప్రయాణికులు తట్టుకునే పరిస్థితి లేదని, ఇన్ని రూ.కోట్లు ఖర్చుపెట్టి ఏమి లాభం అని, కనీసం ఒక్క ఫ్యాన్ కూడా లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్న వర్షానికే కురిస్తే వర్షకాలంలో పరిస్థితి దారుణంగా ఉంటుందన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఫ్యానులు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
సీసీ కెమెరాలు లేకపోవడంతో దొంగతనాలు..
ఎంతో ఆర్బాటంగా నూతన పరిజ్జానంతో నిర్మించామని చెబుతున్న మంత్రులు, అధికారులు కనీసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయకపోవడం విశేషం. దీంతో ఏ వాహనం ఎటుపోతుంది, ఎవరు తీసుకు వెళ్లతున్నారనేది తెలియడంలేదు. ఇంత విశాలమైన బస్టాండ్‌లో సీసీ కెమెరాలు లేకపోవడం వలన ఇప్పటికే పలువురి ద్విచక్రవాహనాలు చోరికి గురయ్యాయి. ఇప్పటికైనా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. పాత బస్టాండ్‌లో సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ సంవత్సరానికి సుమారు 10 వరకు దొంగతనాలు జరిగాయని, ఇక్కడ అసలు సీసీ కెమెరాలు లేకపోతే ఇంకెన్ని దొంగతనాలు జరుగుతాయో అని వాహనదారులు, ప్రయాణికులు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు.