Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఖమ్మం
ప్రైవేటు విద్యా సంస్థలలో పనిచేస్తున్న టీచర్లను, లెక్చరర్లను, బోధనేతర సిబ్బందిని ఆదుకోవాలని, ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలను కరోనా జాగ్రత్తలతో తిరిగి ప్రారంభించాలని స్థానిక కలెక్టరేటు ఎదుట అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రైవేటు టీచర్స్, లెక్చరర్స్ అసోసియేషన్ జిల్లా నాయకులు బండారు రమేష్ అధ్యక్షతన సభ జరిగింది. ఈ సభలో సిపిఐ (ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు మాట్లాడుతూ కరోనా కష్ట కాలంలో ప్రైవేటు విద్యా సంస్థలలో పనిచేస్తున్న టీచర్లు, లెక్చరర్లు, బోధనేతర సిబ్బంది వేతనాలు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వీరికి కరోనా ప్యాకేజీని ప్రకటించి నెలకు రూ.10 వేలకు తగ్గకుండా కనీసం ఒక సంవత్సర కాలం అందించి ఆదుకోవాలని కోరారు. అలాగే విద్యార్థులు, విద్యా సంస్థలు నష్టపోకుండా కరోనా జాగ్రత్తలు తీసుకుంటూ పాఠశాలలను, కళాశాలలను తిరిగి ప్రారంభించాలని తెలిపారు. సిపిఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని విద్యా సంస్థలను తెరవాలని ప్రైవేటు టీచర్లను, లెక్చరర్లను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. సిపిఐ (ఎం.ఎల్.) న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు ఆవుల అశోక్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విద్యా సంస్థలను తెరవకపోతే, దేశస్థాయిలో జరిగే పోటీ పరీక్షలలో మన విద్యార్థులు నష్టపోతారని అన్నారు. విద్యా సంస్థల సిబ్బందిని ప్యాకేజీ ప్రకటించి ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్య సంఘం రాష్ట్ర నాయకులు శేషుకుమార్ మాట్లాడుతూ కరోనా వలన విద్యా సంస్థలు తీవ్రంగా నష్టపోయాయని, విద్యా సంస్థలను చిన్న, మధ్య తరహా పరిశ్రమల మాదిరి ఆదుకోవాలని కోరారు. తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకులు కూరపాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రైవేటు విద్యా సంస్థలలో పనిచేస్తున్న సిబ్బంది పట్ల రాష్ట్ర ప్రభుత్వం చిన్న చూపు చూస్తోందని ఆరోపించారు. మానవతా దృష్టితో వారిని ఆదుకోవాలని కోరారు. సిబ్బంది వేతనాలు లేక ఆత్మహత్యలు చేసుకునే దుస్థితిలోకి వెళుతున్నారని తెలిపారు. ఈ ధర్నా కార్యక్రమంలో సిపిఐ (ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు, మాచర్ల భారతి, సిఐటియు జిల్లా కార్యదర్శి కల్యాణం వెంకటేశ్వరరావు, ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్య సంఘ నాయకులు రామచంద్రరావు, రవి మారుత్, అభినవ్ రమణ, నాగేంద్రబాబు, వివిధ ప్రజా సంఘ, టీచర్స్, లెక్చరర్స్ నాయకులు మాదినేని రమేష్, యర్రా శ్రీనివాస్, టి.లింగయ్య, రంగారావు, నారాయణరావు, అమర్, కె.శ్రీనివాస్, గౌస్, సిహెచ్.రమేష్, రామకష్ణ విష్ణు, మేకల శ్రీను, శిరోమణి, ఆజాద్, రమ్య, అశోక్, వీరబాబు, నాగమల్లేశ్వరరావు, విజరు తదితరులు పాల్గొన్నారు.