Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
వైఎస్ఆర్ తనయ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి వైఎస్ షర్మిల సభకు ఖమ్మం పెవిలియన్‌గ్రౌండ్‌లో శరవేగంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. 9వ తేదీ శుక్రవారం నిర్వహించే ఈ సభపై గత నెలరోజులుగా చర్చ జరుగుతున్నప్పటికీ సభా నిర్వహణ అనుమతులపై కొంత సందిగ్ధత నెలకొంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర చేపట్టిన ఏప్రిల్ 9వ తేదీ నుంచే తెలంగాణ రాష్ట్రంలో తన రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టాలని షర్మిల భావించారు. ఈ నేపథ్యంలోనే ఆ రోజున ఖమ్మంలో లక్ష మందితో సభ నిర్వహిస్తామని ప్రకటించారు. ఈలోగా కరోనా రెండో దశ ఊపందుకోవడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సభలు, సమావేశాల విషయంలో కొన్ని మార్గదర్శకాలు చేశాయి. ఈక్రమంలో షర్మిల సభ కోవిడ్ నిబంధనలకు లోబడి నిర్వహించుకోవాలని ఇటీవల బదిలీ అయిన ఖమ్మం సీపీ తఫ్సీర్‌ఇక్బాల్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఖమ్మం ఏసీపీ ఆంజనేయులు పరిమితులతో కూడిన అనుమతి ఇచ్చారు. ఐదారువేలకు మించి సభకు అనుమతి లేదని స్పష్టం చేశారు. ఈ పరిణామాలతో షర్మిల సభ జరుగుతుందో లేదోననే సందిగ్ధత నెలకొంది. ఈలోగానే సీపీ బదిలీ కావడంతో కొత్త సీపీగా విష్ణు వారియర్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. మంగళవారం ఆయన మంత్రి, కలెక్టర్లను మర్యాదపూర్వకంగా కలవడం శాఖపరమైన వ్యవహారాల్లో బిజీబిజీగా ఉండటంతో సంకల్ప సభ అనుమతులపై స్పష్టత రావడంలో జాప్యమైంది. ఏదీఏమైనా సభ నిర్వహించి తీరుతామనే నమ్మకాన్ని హైదరాబాద్ నుంచి షర్మిల ప్రతినిధులుగా వచ్చిన నాయకులు కొండా రాఘవరెడ్డి, సతీష్‌రెడ్డి తదితరులు వెలువరించారు. ఈక్రమంలోనే మంగళ, బుధవారాల్లో నూతన సీపీని కలిసి సంకల్ప సభ అనుమతి విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు కోవిడ్ నిబంధనలకు లోబడి సభ నిర్వహించుకోవాలని సీపీ స్పష్టతనివ్వడంతో శరవేగంగా ఏర్పాట్లు మొదలుపెట్టారు. సభా ఏర్పాట్లు, నిర్వహణ తీరుపై సాయంత్రం పెవిలియన్‌గ్రౌండ్‌లో అత్యవసరంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు.
సంకల్ప సభకు షర్మిలతో పాటు విజయమ్మ, బ్రదర్ అనిల్
ఖమ్మంలో నిర్వహించే సంకల్ప సభకు షర్మిలతో పాటు విజయమ్మ, ఆమె భర్త బ్రదర్ అనిల్‌కుమార్ సైతం హాజరుకానున్నట్లు షర్మిల స్థాపించబోయే పార్టీ ముఖ్యనాయకులు కొండా రాఘవరెడ్డి, సతీష్‌రెడ్డి, జిల్లా నాయకులు లక్కినేని సుధీర్, కృష్ణమోహన్, రోశిరెడ్డి, అంజన్‌రావు తదితరులు స్పష్టం చేశారు. ఈ మేరకు బుధవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. శుక్రవారం ఉదయం 8 గంటలకు హైదరాబాద్ లోటస్‌పాండ్ నుంచి షర్మిల, విజయమ్మ రోడ్డుమార్గంలో ఖమ్మం బయలుదేరుతారు. మార్గమధ్యం లోని హయత్‌నగర్ మొదలు నాయకన్‌గూడెం వరకు వారికి ఆయా ప్రాంతాల్లో వైఎస్ఆర్, షర్మిల అభిమానులు స్వాగతం పలుకుతారు. మధ్యాహ్నం 3 గంటల వరకు ఖమ్మం చేరుకుం టారు. సాయంత్రం 5 గంటలకు సభ ప్రారంభమవుతుంది. రాత్రి 9 గంటల వరకు ముగుస్తుంది. కోవిడ్ నిబంధనల మేరకు ఈ సభ నిర్వహణ ఉంటుంది. 6వేలకు మించి సభా ప్రాంగణానికి జనానికి అనుమతి లేదు. ఈ సభ కోసం సోడియం హైడ్రోక్లోరైడ్‌తో పెవిలియన్‌గ్రౌండ్ మొత్తాన్ని శానిటైజ్ చేస్తున్నారు. వంద లీటర్ల శానిటైజర్‌ను సిద్ధంగా ఉంచుతున్నారు. 30 థర్మల్ స్కానర్స్‌ను ఏర్పాటు చేసి 80 డిగ్రీలకు పైబడి ఉష్ణం ఉన్నవారిని సభా ప్రాంగణంలోకి అనుమతించరు. ఇలాంటి కోవిడ్ నిబంధనల మధ్య ఈ సభ జరగనుంది. సభకు అనుమతి ఇచ్చినందుకు నూతన సీపీ విష్ణు వారియర్‌కు నేతలు కృతజ్ఞతలు తెలిపారు. సంకల్ప సభకు ముందే గత రెండు నెలలుగా షర్మిల రాష్ట్రంలోని 9 ఉమ్మడి జిల్లాల నేతలతో సమీక్ష సమావేశాలు నిర్వహించారని, ఆయా సమస్యలపై అధ్యయనం చేశారని ఆమె స్థాపించే పార్టీ ముఖ్యనేతలు తెలిపారు. పోడు మొదలు పంటల వరకు ప్రతి సమస్యపైనా ఆమె అవగాహనతో ఉన్నారన్నారు. సంకల్ప సభలో ఇవన్ని అంశాలు ప్రస్తావిస్తారన్నారు. అయితే పార్టీ పేరు, జెండా, విధి విధానాలపై జూలైలో వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా జరిగే మరో సభలో వెల్లడిస్తారని తెలుస్తోంది.