Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తలలు పట్టుకుంటున్న నాయకులు
- అయోమయంలో కార్యకర్తలు
- అధికార పార్టీలో తాజా - మాజీ ఎమ్మెల్యేలు
నవతెలంగాణ-అశ్వారావుపేట
తెలంగాణ తెలుగు దేశం పార్టీని తెలంగాణ రాష్ట్ర సమితిలో విలీనం చేయడంతో పాటు ఆ పార్టీ బి - ఫాంపై గెలిచిన ఒక్కగానొక్క అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు తెరాసలో జేరిపోవడంతో స్థానికంగా రాజకీయాలు రసవత్తరంగా మారనున్నాయి. అధికార పార్టీలో ఓడిపోయి మాజీ అయినా తాటి వెంకటేశ్వర్లు, ప్రతిపక్ష పార్టీలో గెలిచిన తాజా ఎమ్మెల్యే ఇరువురూ ఒకే వేదిక పైకి రావడంతో నాయకులు తలలు పట్టుకుంటుండగా, కార్యకర్తలు అయోమయానికి గురి అవుతున్నారు. రాష్ట్ర రాజకీయాలకు ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలు ఒక ఎత్తు అయితే అశ్వారావుపేట రాజకీయాలు మరో ఎత్తు.
అశ్వారావుపేట నియోజక వర్గంపై ఓ విశ్లేషణ...
అసెంబ్లీ నియోజక వర్గాలు పునర్విభజనలో భాగంగా ఉమ్మడి ఆంద్రప్రదేశ్ ఉండగానే 2009లో సత్తుపల్లి నియోజక వర్గం నుండి విడిపోయి అశ్వారావుపేట, దమ్మపేట, ములకలపల్లి, చండ్రగొండ, కుక్కునూరు, వెలేరుపాడు మండలాలతో నూతన నియోజక వర్గంగా అశ్వారావుపేట ఏర్పాటు అయింది.ఈ నియోజక వర్గానికి ప్రధమంగా 2009లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నుండి అశ్వారావుపేట మండలానికే చెందిన మిత్రసేన, టీడీపీ మద్దతుతో సీపీఐ(ఎం) నుండి కూనవరం మండలానికి చెందిన పాయం వెంకయ్య, ప్రజారాజ్యం పార్టీ నుండి దమ్మపేట మండలానికి చెందిన తాటి నాగేంద్ర పోటీ పడ్డారు. ఇందులో మిత్రసేన 46183 ఓట్లతో విజయం సాధించగా పాయం, తాటి లు ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు.
రాష్ట్రాల పునర్విభజనలో భాగంగా తెలంగాణ నూతన రాష్ట్రంగా ఏర్పడ్డంతో 2014లో రెండో దఫా జరిగిన ఎన్నికల్లో నూతనంగా ఏర్పడ్డ వైఎస్ఆర్సిపి నుండి వెలేర్పాడు మండలానికి చెందిన ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, టీడీపీ నుండి దమ్మపేట మండలానికి చెందిన ప్రస్తుతం ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే మిత్రసేన, ప్రస్తుతం అధికారి పార్టీ తెరాస నుండి జారే ఆదినారాయణ పోటీ పడ్డారు. ఇందులో తాటి వెంకటేశ్వర్లు 49421 ఓట్లు సాధించి గెలుపొందారు. మెచ్చా, మిత్రసేన, జారేలు వరుస క్రమంలో ఉన్నారు. అనంతరం ఆరు నెలలు తిరగకుండానే తాటి వెంకటేశ్వర్లు టీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకున్నారు.
2018 ఎన్నికల్లో తెదేపా నుండి మెచ్చా నాగేశ్వరరావు, అధికార పార్టీ తెరాస నుండి తాటి వెంకటేశ్వర్లు, సిపిఐ, కాంగ్రెస్ మద్దతుతో సీపీఐ(ఎం) నుండి తానం రవీందర్ లు పోటీ పడ్డారు. ఇందులో మెచ్చా నాగేశ్వరరావు 61124 ఓట్లు సాధించి విజయం సాధించగా సిట్టింగ్ ఎమ్మెల్యే తాటి మాజీ అయి రెండో స్థానంలో, తాను రవీందర్ మూడో స్థానంలో నిలిచారు. ప్రస్తుతం మెచ్చా నాగేశ్వరరావు సైతం టీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకోవడం విశేషం. రాష్ట్రంలో రెండు సార్లు అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ మాత్రం అశ్వారావుపేట నియోజక వర్గం తన సత్తా చాటలేక పోయింది. టీఆర్ఎస్ భవితవ్యం ఇక్కడ ప్రశ్నార్ధకమే అని రాజకీయ విశ్లేషకులు వ్యాక్యానిస్తున్నారు.