Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జడ్పీ స్థాయి సంఘాల సమావేశంలో చైర్మన్ లింగాల కమల్ రాజు
నవతెలంగాణ-గాంధీచౌక్
రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్-19 పై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా అధికారులు ముందుకు పోవాలని జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు సూచించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో రాష్ట్ర ఉన్నతాధికారుల మార్గదర్శకాల ప్రకారం వైద్య ఆరోగ్యశాఖ అధికారులు మరింత అప్రమత్తంగా వ్యవహరిం చాలన్నారు. జిల్లా పరిషత్ స్థాయి సంఘాల సమావేశం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో గురువారం జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వ పథకాల అమలు తీరుపై సమీక్షించి మాట్లాడుతూ కోవిడ్ సెకండ్ వేవ్ వ్యాప్తి పట్ల ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు ఆరోగ్య సిబ్బంది నిత్యం గ్రామాలలో ప్రజలను చైతన్యం చేయాలన్నారు. ప్రభుత్వం పంపిణీ చేస్తున్న కోవిడ్ వ్యాక్సిన్ పట్ల ప్రజల్లో కొన్ని అపోహలు ఉన్నాయని, వాటి పట్ల అవగాహన పెంచాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్య పనులపై దృష్టి సారించాలని తెలిపారు. గ్రామాల అభివృద్ధి పనులకు ప్రభుత్వం ఎప్పటికప్పుడు నిధులు మంజూరు చేసి పల్లె ప్రగతిలో అమలు చేస్తున్నారని తెలిపారు. పల్లె ప్రగతిలో జరుగుతున్న పనులలో ఇంకా పూర్తి కాని వాటిని అధికారులు పర్యవేక్షణ పెంచాలన్నారు. సీఈవో సీహెచ్ ప్రియాంక మాట్లాడుతూ ప్రభుత్వం శాఖల వారిగా నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు. స్థాయి సంఘాల సమావేశాలకు హాజరవుతున్న అధికారులు పూర్తి సమాచారంతో రావాలని సూచించారు. సమావేశంలో జడ్పీ వైస్ చైర్మన్ మరికంటి ధనలక్ష్మీ, జడ్పీటీసీలు, ఇంచార్జీ డిప్యూటీ సీఈవో కొండపల్లి శ్రీరామ్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.