Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.37 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లు, డ్రైన్లు ప్రారంభోత్సవం
- తెరాస కార్పొరేటర్లను గెలిపించండి..మరింత అభివృద్ధిని చూస్తారు
- డిప్యూటీ మేయర్ కృతజ్ఞత సభలో మంత్రి పువ్వాడ
నవతెలంగాణ- ఖమ్మం
ఖమ్మం నగరాభివృద్ధికి మీ వంతు సహకారం ఇవ్వాలని తద్వారా మరింత అభివృద్ధి చేసి ఇచ్చే బాధ్యత తనదే అని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. గురువారం 24వ డివిజన్ వీడియోస్ కాలనీలో రూ.37 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లు, డ్రైన్లను మంత్రి పువ్వాడ ప్రారంభోత్సవం చేశారు. అనంతరం నాయకులు, ప్రజల ఆధ్వర్యంలో డిప్యూటీ మేయర్ బత్తుల మురళి పదవి కాలం పూర్తి చేసినందుకు ఏర్పాటు చేసిన కృతజ్ఞత సభలో మంత్రి హాజరై మాట్లాడారు. ఖమ్మం నగరంలో ఒకప్పుడు వాటర్ ట్యాంకులు గల గల అంటూ తిరుగుతానే ఉండేవి.. ఇప్పుడు ఉన్నాయా.. ఎక్కడైనా కనిపించాయా అని ప్రశ్నించారు. ''నగరంలో వేసవిలో అసలు కరెంట్ ఉండేదే కాదు. కానీ ఇప్పుడు రెప్పపాటున కరెంట్ పోతుందా. అపార్ట్మెంట్లలో ఎప్పుడు జనరేటర్లు నడుస్తానే ఉండేవి. ప్రతి ఇంట్లో ఇన్వెర్టర్లు నడుస్తానే ఉండేవి. గత ప్రభుత్వాలు పరిశ్రమలకు పవర్ హాలిడే ఇచ్చేవారు. ఇప్పుడు అవన్నీ ఉన్నాయా... ఖమ్మం నగరం చిన్న చిన్న రోడ్లతో ట్రాఫిక్ సమస్యలతో ఉండేది.. ఇపుడు ఎక్కడ అయిన ఏ రోడ్లు చూసినా విశాలంగా ఉన్నాయి. రోడ్లు విస్తరించినం. ఖమ్మంలో సరైన స్మశాన వాటిక ఒక్కటి కూడా ఉండేది కాదు. కానీ ఇప్పుడు బల్లెపల్లి, కాల్వఒడ్డు వైకుంఠధామంల ముందు సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఇది ఎప్పుడైనా చూసారా. ఖమ్మం ప్రజలకు, చిన్న పిల్లలకు ఆహ్లాదం కోసం ప్రతి డివిజన్లలో పార్కులు, అందులో ఓపెన్ జిమ్‌లు, పబ్లిక్ టాయిలెట్స్, తాగునీరు ఇలా అనేకం వసతులు అందుబాటులోకి తీసుకొచ్చా. తెలంగాణ ప్రభుత్వం ఖమ్మం ప్రజా అవసరాల కోసం, అభివృద్ధి కోసం 1800 కోట్ల రూపాయల నిధులు ఇచ్చింది. ఇంకా తెస్తాం. వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో తెరాస పార్టీ ని ఆదరించండి. అభివృద్ధి బాధ్యత పూర్తిగా నాదే. తెరాస అభ్యర్థులను గెలిపించి ఇవ్వండి మీ ప్రాంత అభివృద్ధి చేసి మీకు ఇస్తా'' అని అన్నారు. ఈ కార్యక్రమంలో పోట్ల శ్రీకాంత్, పిల్లి శేఖర్, నెల్లూరి చంద్రయ్య, మందడపు నర్సింహారావు, ఆర్జేసీ కృష్ణ, సిరిపురపు సుదర్శన్ రావు, సుధాకర్, డివిజన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.